(ఈరోజు గురువారం ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)
2015 డిసెంబరులో తమిళనాడు రాజధాని చెన్నై నగరం వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమంటూ అప్పుడు లెక్కలు చెప్పారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూసిన వారికి అది నిజమే అనిపించింది.
మళ్ళీ ఆరేళ్ల తర్వాత అవే దృశ్యాలు.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకున్న దాఖలా లేదు.
ఈసారి ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా నడుం కట్టి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండడం ముదావహం.
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం. జరిగిన నష్టం కొండంతగా వున్నప్పుడు ఎంతటి సాయం అయినా రవ్వంతగా అనిపించడం సహజం.
చుట్టూ నీళ్ళే! కానీ, గుక్కెడు కూడా అవి తాగడానికి పనికి రావు. అరకొర విద్యుత్ సరఫరా అవుతుంటేనే సర్దుకుపోవడం కష్టం. అలాటిది రోజుల తరబడి అంధకారం. పక్కింటికి పోవాలంటేనే పదిసార్లు తాళాలు లాగిచూసుకుని, అనేక జాగ్రత్తలు చూసుకుని అడుగు బయట పెట్టే రోజులు. అలాటిది, పొరుగు వారితో కూడా ఒక మాట చెప్పకుండా, కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ, ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా నడుంలోతు నీళ్ళల్లో దాదాపు ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్తితి. చంటి పిల్లలకు పాలు, పెద్దవారికి వేళకు తిండీ మందులు సరి చూసుకునే వ్యవధానం వుండదు. ఒక కష్టం కాదు, ఒక ఇబ్బంది కాదు, పగవారికి కూడా రాకూడదు అనుకునే రీతిలో, పక్కవాడికి కూడా చెప్పుకోవడానికి వీలులేని పరిస్తితిలో, ప్రాణాలు దక్కించుకోవడం ఎల్లా అని, దిక్కుతోచని స్తితిలో కాలం గడపడం అంటే యెంత దుర్భరమో చెన్నై ప్రజలకు అనుభవంలోకి వచ్చివుంటుంది. ఆ సమయంలో వారి మానసిక స్తితి గురించి ఊహించుకోవడం కూడా దుర్భరం. ప్రస్తుతం చెన్నై వాసుల పరిస్తితి ఎలావుందంటే వర్షం పేరు చెబితేనే వారికి కంటి మీద కునుకు వుండడం లేదు. ఆకాశం వైపు చూస్తున్నారు, మళ్ళీ వాన కురుస్తుందేమో అన్న భయంతో. ఆకాశం వైపే చూస్తున్నారు ఎవరయినా హెలికాప్టర్ లో వచ్చి ఆదుకుంటారేమో అనే ఆశతో. ఆశల సంగతేమో కానీ భయాలు మాత్రం నిజమవుతున్నాయి
తుపాను, భూకంపాల వంటివి సంభవించినప్పుడు జరిగిన నష్టం ఏపాటిదన్నది రోజులు గడిస్తే కానీ పూర్తిగా అవగతం కాదు. వాస్తవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ముందు కంటికి కనిపించిన దానికంటే అధికంగా వుండే అవకాశాలే ఎక్కువ.
ఇలాటి ప్రకృతి వైపరీత్యాలు గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే. వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే. ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులు కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం.
బ్రిటిష్ వారి కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో మిగిలింది ఇదే. జరిగింది ఇదే. భారీ వర్షాలకు చెన్నపట్నం మునిగిపోయింది అని జనాలు వింతగా చెప్పుకునే విషమ పరిస్తితి.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను, ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. చెన్నై ప్రజలు కూడా గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంబై పౌరుల మాదిరిగానే అత్యంత నిబ్బరంగా వ్యవహరిస్తున్న సంగతి గమనార్హం.
(EOM)
Thank you for posting this!
రిప్లయితొలగించండిస్టాలిన్ వంటి అసాధారణ ముఖ్యమంత్రి ఏలుబడిలో పౌరులుగా ఉండడం కంటే కావలిసిందేముంటుందనిపిస్తోంది ఇటీవలి ఆయన వ్యవహార శైలి చూస్తుంటే..
ఒరిజినల్ స్టాలిన్ కు ఈ స్టాలిన్ కు ఎంత తేడా.. అనిపిస్తోంది..
ఇక రెండోది.. అంతటి వర్షపాతాన్ని తట్టుకునే శక్తి ఆధునిక మురుగునీటి పారుదల వ్యవస్థకు లేదు గాక లేదు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థకున్న రెండు ప్రధాన లోపాలలో ఇదొకటి.. దోమల నివారణ మరొకటి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ వైట్ ఎలిఫెంట్ వంటిదే.. అది కావాలనుకున్నపుడు.. ఇటువంటివాటిని భరించాల్సిందే.. సితార చిత్రంలో శరత్ బాబు వేసుకున్న కోటు తరహా మాత్రమే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ..