21, అక్టోబర్ 2021, గురువారం

దారి ఇచ్చిన కుక్క – భండారు శ్రీనివాసరావు


ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు ఈ పోస్టు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న శాస్త్రి గారు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఈయన గారెకి కాలు ఎత్తివేసే అలవాటు. దానికి ఆయనే అవిటి కాలు అని పేరు పెట్టుకున్నారు. వయసు ఎనభై దాటడం వల్ల అది సహజంగా వచ్చి వుంటుంది. ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్వ్యాలికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారెకి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారెకి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో స్థలంలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.

2 కామెంట్‌లు:

  1. మీరేమిటో ఉత్తర దక్షిణ ధ్రువాలకు పరస్పర పోలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు - వృధాగా.

    ఆ దేశాల్లో ఏదైనా భవనంలో నుండి బయటకు వస్తున్నప్పుడు తలుపు తీసుకుని తను బయటకు వచ్చిన తరువాత తన వెనకాలే (మరీ దూరంగా కాదు) ఎవరైనా ఉంటే (అపరిచితులైనా కూడా) తలుపు మూసుకోకుండా పట్టుకుంటారు. ఇక్కడా? — తలుపు విసురుగా వదిలేసి / విసిరేసి (స్టైల్ అన్నమాట) వెళ్ళిపోతారు.

    టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండేది మీకు గుర్తుండే ఉంటుంది. సూటూ బూటూ వేసుకున్న ఒక యువకుడు (బహుశః కార్పొరెట్ట ఉద్యోగి అయ్యుంటాడు) లిఫ్టులో ఎక్కుతాడు. జస్ట్ వెనకాలే ఇంకొకాయన లిఫ్ట్ కోసం పరిగెడుతూ వస్తుంటాడు. అది చూసి కూడా మన మోడర్న్ యువకుడు లిఫ్ట్ బయలుదేరడానికి బటన్ నొక్కేస్తాడు. చేసిన పని చాలక మహా గొప్పగా తన చేతి వాచ్ వంక చూస్తాడు - ఏదో లోకంలో తనకే అర్జంట్ అన్నట్టు. ఈ తరం చాలా insensitive గా తయారయ్యారు.

    రిప్లయితొలగించండి
  2. నరసింహారావు గారూ!

    ఆ కుక్క పక్కకి తప్పుకోవడం అనుకోకుండా చెయ్యలేదు.శిక్షణ ఇస్తేనే కుక్కలూ పిల్లులూ మనుషుల్లా ప్రవర్తిస్తాయి.అక్కడ పెంపుడు కుక్కలకి ఇల్లు దాటి వెళ్ళాక రోడ్డు మీదా షాపుల్లోనూ సినిమా జాళ్ళలోనూ అలా ప్రవర్తించాలి అని ట్రైనింగ్ ఇస్తారు.మా అమెరికా మరదలు కొత్తగా కుక్కను పెంచుతున్నది.దాన్ని "కుక్క/Dog" అని అనకూడదు.దానికో పేరు పెడతారు కదా, ఆ పేరుతోనే పిలవాలి.ఆ ట్రైనింగ్ స్కూలుకి తీసుకెళ్ళే వ్యవహారం కూడా మన పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళే వ్యవహారం లాగే యమా సీరియస్సుగా ఉంటుంది.

    అబ్బో!"ఎందుకీ దిక్కుమాలిన మానవ జన్మ?ఈ చదువులూ పెళ్ళిళ్ళూ దాంపత్యాలూ ఉద్యోగాలూ వ్యాపారాలూ రాజకీయాలూ లేని వైభవోపేతమైన బతుజు బతికే పెంపుడు కుక్కలా పుట్టడం ఎంత అదృష్టం,దేనికైనా పెట్టి పుట్టాలి.ఈ జన్మకింతే!" అనిపించ్జింది నాకు.

    ఇంట్లోనూ ఇల్లు దాటి బైటికి వెళ్ళినప్పుడూ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవేర్తిస్తే గౌరవప్రదమో చెప్పడం లాంటి పనులు చెయ్యక క్రమశిక్షణ లేకనే మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.అసలు గౌరవప్రదంగా ఎందుకు ఉండాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు.నిజం చెప్పాలంటే ముప్పాళ రంగనాయకమ్మ, కంచె ఐలయ్య లాంటి గౌరవప్రదంగా బతికితే నష్టం బతక్కపోతే లాభం అన్నట్టు బతుకుతున్నవాళ్ళు కూడా ఉన్నారు.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి