9, అక్టోబర్ 2021, శనివారం

వాడుకోలేని అధికారం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు

 

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడితే...

సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను.

అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.

అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి వచ్చింది.

అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలువుంటాయి.

పూర్వం నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్ తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత తోస్తే అంతే!’ అనేవాళ్ళు వాళ్ళు ఆయన పరోక్షంలో.

ఒకప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్ చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు రైల్వేశాఖ డిప్యూటీ మంత్రిగా వున్నప్పుడు ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి విలేకరులకు తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ చేసారు. ఈ వార్త పత్రికల్లో వచ్చినప్పుడు సంతోషం అనిపించింది. వార్త అయితే వచ్చింది కానీ, అమలు జరిగిన వార్త నా కంటికి కానరాలేదు. పోనీండి.

పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం అనే తేడాలేదు. శుక్రవారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు ఎయిర్ పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన వాహనాలు. అవి వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రిగారి శాఖ స్థాయిని బట్టి ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు. యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి ఖర్చులు పెట్టేవాళ్ళు.

నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ  చిక్కడపల్లిలో అద్దెకు   ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు  ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నాతొ ముచ్చటిస్తూ, ఆ రోజుల్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ బంధుమిత్రులతో కలిసి లక్షద్వీప్ యాత్ర గురించి ప్రస్తావించారు.  రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి  ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబుఅనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి  ఇంట్లో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన  పండక్కి తాను కొనుక్కున్న  చీరెల రంగులూ, వాటి  అంచులు  గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా  అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే,  ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి,  సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు,  కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య  ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను.

వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి మీ వీధులను మురికి చేయకుడిఅని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ అధికార దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది. 

తోక టపా :

కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు దేశ వ్యాప్తంగా కార్యాలయాలు వుంటాయి. ఒకానొక కీలక శాఖలో పనిచేసే ఒకానొక కీలక ఉన్నతాధికారి అమ్మాయికి  వివాహం నిశ్చయం అయింది. దేశంలోని  నలుమూలల నుంచి వందిమాగధులు ఈ శుభ కార్యానికి హాజరు కావాల్సిన సందర్భమాయే! వెళ్లక తప్పని పరిస్థితి.

అంతే! ఆ పెళ్లి ముహూర్తానికి ఒక రోజు ముందు దేశ రాజధానిలో జాతీయ స్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేస్తూ, ఒక ఉత్తర్వు ఆఘమేఘాల మీద జారీ అయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని  అన్ని చోట్ల నుంచి అధికారులు విమానాల్లో రాజధానికి తరలి వెళ్లి, వారి వారి విభవానికి తగిన  నక్షత్రాల హోటళ్ళలో ప్రభుత్వ ఖర్చుతో బసచేసి, పెళ్ళికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, తమ అవధికి మించిన చదివింపులు సమర్పించుకుని,  తమ పై అధికారి మన్ననలను చూరగొన్నవారై, తిరిగి స్వస్థానములకు చేరుకొని సుఖంబుననుండిరి.

ఓం! తత్ సత్! మంగళం మహత్!

 

NOTE: Cartoon Courtesy Cartoonist/Owner





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి