18, అక్టోబర్ 2021, సోమవారం

పెరుగుట పెరుగుట కొరకే

 

పెట్రోలుకు మండే గుణం సహజం. మరి వాటి ధరలు మండిపోతూ వుండడం అంతకంటే సహజం.
చాలా చాలా కాలం క్రితం, బహుశా గల్ఫ్ యుద్ధం సమయంలో కాబోలు, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్రోలు లీటరు ధరను, మూడు రూపాయలనుంచి తొమ్మిది రూపాయలకు ఒకేసారి మూడు రెట్లు పెంచారు. ఆ దెబ్బకు బొంబాయి (ఇప్పుడు ముంబై) లో కార్లలో ఆఫీసులకు వెళ్ళే బడా ఆసాములు రోజుకొకరి కారు చొప్పున వంతులవారీగా ప్రయాణాలు చేసేవారని పత్రికల్లో బాక్స్ ఐటంలు వచ్చాయి. ఇప్పుడు దాన్నే 'కార్ పూల్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఆ ముచ్చట కొద్ది రోజులే. తరువాత కధ మామూలే. పెరిగినధరకు అలవాటుపడ్డ జనం మళ్ళీ ఎవరి కారులో వారు వెళ్ళడం మొదలయింది. పెంచినా ఏం కాదు, పెరిగిన ధరలకు ప్రజలే అలవాటు పడతారు అనే భరోసా పాలకుల్లో కలిగింది. దాంతో పెట్రో ధరలు ఇన్నేళ్ళలో ఎన్ని రెట్లు పెరిగాయో లెక్క తెలియనంతగా పెరుగుతూ వచ్చాయి. కాకపోతే పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ప్రతిపక్షాలకు అదో ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతూ వచ్చింది. కారు దిగి కాలు కిందపెట్టని నేతలు, ఆ ఒక్క రోజు మొక్కుబడిగా కారు దిగి కాలినడకన ఊరేగింపులు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం కూడా ఓ మొక్కుబడి తంతుగా మారిపోయింది.
కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచింది. దానికి నిరసనగా ఎన్టీయార్ తన అధికార వాహనాన్నిఒదిలిపెట్టి ఆబిడ్స్ లోని తన నివాసం నుంచి సచివాలయం వరకు ఆటోలో ప్రయాణం చేయడం ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. వారి అధికారిక వాహనం ఖాలీగా ఆ ఊరేగింపు వెనుకనే వచ్చింది. ముఖ్యమంత్రి కారు ఒదిలి ఆటో ఎక్కడం నిరసనకు సంకేతంగా తీసుకోవాలని, అంతే కాని అనునిత్యం అలానే ఆటోలో ప్రయాణాలు చేయరని అధికార పార్టీ వారు పరోక్షంగా పత్రికలకు తెలియచేసారు.
పెట్రో ధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా కొత్తేమీ కాదు. ఒకే పార్టీ, తాను కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం షరా మామూలుగా మారిపోయింది. వాటి తీరు చూస్తుంటే, ఆ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి నిరసన ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగు రోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రో ధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా ఆ పాటికి వొంటబట్టే వుండడం అందుకు కారణం కావచ్చు.
పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు.
గతంలో యూపీఏ పాలన సమయంలో ఒకసారి లీటర్ ఒక్కింటికి ధరను మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచారు. ఆ సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగానే కాకుండా వింతగాను వుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ – రూపాయి మారకం విలువలో వచ్చిన తేడాల వల్ల భారత ఆయిల్ కంపెనీలకు లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట. అందువల్ల భారీగా పెంచిన ధరను జనం మంచి మనసు చేసుకుని భరించాలట. పెట్రోధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా పాలకులు వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయి విలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.
సరే ఇదంతా పాత కధ.
ఇప్పుడు రోజులు మారిపోయాయి. కోడిగుడ్ల ధరల మాదిరిగా ఏరోజుకారోజే పెట్రో ధరలు మారిపోతున్నాయి. ఒక పూట పెట్రోలు ధర లీటరుకు ఇన్ని పైసలు తగ్గించామంటారు. డీసెలు ధర ఇన్ని పైసలు పెంచామంటారు. వారం తిరిగేసరికి పెరిగిన ధర తగ్గించామంటారు. తగ్గించిన ధర పెంచామంటారు. దీనికి కారణం క్రూడాయిలు ధరల్లో హెచ్చు తగ్గులంటారు. ఇక ఈరోజుల్లో ఆ వివరణలు, సంజాయిషీలు కూడా లేవు. ‘ పెంచడం మా బాధ్యత, భరించడం మీ కర్తవ్యమ్’ అనే తరహాలో వ్యవహారం సాగుతోంది. వెనుకటి రోజుల్లో ఈ ధరల హెచ్చింపు, తగ్గింపు ధరల ప్రకటన రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత చేసేవారు. పలానా తేదీనుంచి అమల్లోకి వస్తుందనే వాళ్ళు. ఇప్పుడలా కాదు. లేడికి లేచిందే పరుగన్నట్టు ఏపూటకు ఆ పూటే ప్రకటనలు. టీవీల్లో స్క్రోలింగులు. దాన్నిబట్టే బంకుల్లో ధరలు. అంతా మాయ. విష్ణుమాయ.
ఇప్పుడు ఇది కూడా పాత కధల జాబితాలోకి చేరిపోయింది.
ఇప్పుడు మరో కొత్త విష్ణు మాయ మొదలయింది.
పెట్రో ధరలు లీటరుకు ఇన్ని రూపాయలో, పైసలో తగ్గించినట్టు ప్రకటన వస్తుంది. జనం అమ్మయ్య అనుకునే లోగా దాని వెంటే మరో స్క్రోలింగు పరుగులు తీస్తుంది, తగ్గిన మందానికి మరికొంత కలిపి ఎక్సయిజు డ్యూటీ పెంచారని. ఈతపండు చేతికిచ్చి తాటిపండు లాక్కోవడం అంటే ఇదే కాబోలు.
గతంలో ఓసారి, పెట్రోలు లీటరుకు 32 పైసలు, డీసెలు మీద 85 పైసలు తగ్గించారు. మరో చేత్తో ఎక్సయిజు సుంకాన్ని పెట్రోలు మీద 75 పైసలు, డీసెలు పైన 2 రూపాయలు పెంచారు. మరి వినియోగదారుడి మీద భారం పెరిగినట్టా, తగ్గినట్టా ఏలికలే జవాబు చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు. ఈ ఒక్క విషయంలో ఏ పార్టీ అయినా ఒకటే. అందరిదీ ఇదే దారి.
పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు అని పత్రికల్లో వస్తుంటుంది. మళ్ళీ పెంచారు అనడం కంటే ఇంకోసారి పెంచడానికి వీలుగా మరోసారి పెంచారు అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం అది ఆఖరు సారీ కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ లేదు.
చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.
ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు లోగోలు, బంకుల ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే సులువయిన మార్గం. ఇది తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.
లెక్కలు, డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే అనేది కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.
ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నారు. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభుత్వాలు తమ మీద మోయలేని భారం మోపుతున్నాయి అని విషాద గీతాలు ఆలపించే వినియోగదారుల్లో చాలామంది వాహనాల వినియోగంలో పొదుపు పద్దతులు పాటించడం లేదు. లీటరు వంద రూపాయలు దాటిపోయినా పెట్రోలు బంకుల్లో కొనుగోలుదారులు బారులు తీరుతూనే వున్నారు. వీరిలో అధిక శాతం మంది అనవసరపు తిరుగుళ్ళ కోసమే అని వారి మొహాలు చూడగానే అర్ధం అవుతుంది.

ఉపశ్రుతి : ఒక కార్టూను కళ్ళబడింది. పెట్రోలు బంకు ముందు సూటూ బూటూ వేసుకున్న వ్యక్తి చేతిలో ఓ ప్ల కార్డు పట్టుకుని నిలబడి అడుక్కుంటూ వుంటాడు. దానిమీద ఇలా రాసివుంటుంది.
"భార్యతో పాటు రెండు కార్ల భారం కూడా నేను మోయాలి"





NOTE: Courtesy Cartoonist

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి