26, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ – భండారు శ్రీనివాసరావు

 

రతన్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలుసు. అదే రేడియో చిన్నక్క అంటే ఒకతరం తెలుగువారిలో తెలియనివారంటూ వుండరేమో!
మొన్న ఫోన్ చేశారు. ఏదో పనిలో వుండి నేను రెస్పాండ్ కాలేదు. రాత్రి నేనే ఫోన్ చేశాను. ఇప్పుడు ఆవిడ హైదరాబాదులో లేరు. ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. ఎనభయ్ ఎనిమిది సంవత్సరాల ముది వయసులో కూడా ఆమె కంఠస్వరం , ఓ నలభయ్ అయిదేళ్ళ క్ర్తితం నేను రేడియోలో చేరినప్పుడు ఎలా వుందో అలానే వుంది. అమృతం తాగిన ఆ స్వరంలో అతులిత మాధుర్యం అలాగే వుంది ఇప్పటికీ. కట్టుకున్న భర్త, కన్న కొడుకు కళ్ళ ముందే దాటిపోయారు అనే దుఖం ఆవిడ గొంతులో ఇంకా సజీవంగా వుంది. ‘అయితే నా మనుమలు ఇద్దరూ ఈ వయసులో తనని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారన్న తృప్తితో కొంత ఊరటగా వున్నాను నాన్నా!’ అన్నారావిడ విచారం,ఆనందం సమ్మిళితమైన గొంతుకతో.
ఫ్యాను, ఏసీ వేసుకోవాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా, లైట్లు ఆఫ్ చేయాలన్నా దేనికీ కాలు కదపకుండా తన పడక పక్కనే అన్ని పరికరాలు తనకు అందుబాటులో ఉంచారని, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ రోజులు దొర్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అదృష్టం! ఆవిడ ధారణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. పాత విషయాలు అనేకం చెప్పుకొచ్చారు. (వీటిల్లో చాలా వరకు గతంలో వార్త దినపత్రిక కోసం కె.ఎం.జి. కృష్ణకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ ప్రసాద్ చెప్పారు. Courtesy: రేడియో అభిమాని శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్)
రేడియోలో సంగీతం ఆడిషన్ కోసం వెడితే తన స్వరానికి, ఉచ్ఛారణకు ముచ్చట పడి అనౌన్సర్ గా సెలక్ట్ చేశారట. రేడియో అనౌన్సర్ గా చేనుగట్టు కధాపఠంనంతో 1955లో మొదలైన తన రేడియో ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగి 1992లో సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్ గా ముగిసిందని చెప్పారు. కార్మికుల కార్యక్రమంలో చిన్నక్కగా తాను పోషించిన పాత్ర తనను శ్రోతలకు మరింత దగ్గర చేసిందని, అంతకుముందు (ఆవిడ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు) తెలంగాణా యాసలోనే చంద్రి అనే పాత్రలో గ్రామసీమలు కార్యక్రమం నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. చిన్నక్క పాత్రకు ముందు రతన్ ప్రసాద్ రమణక్క పేరుతొ ఆ కార్యక్రమాన్ని మరో అనౌన్సర్, వి. సత్యనారాయణతో (పాత్ర పేరు జగన్నాధం) కలిసి నిర్వహించారు. అనుకోకుండా ఒకరోజు ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పుడు జగన్నాధం పాత్రధారి, ‘రమణక్కా! నీకు నోరు ఎక్కువ’ అంటాడు. ఇది ఆంధ్రప్రాంతం శ్రోతలకు మనస్తాపం కలిగించింది. పెద్ద సంఖ్యలో నిరసన లేఖలు వెల్లువెత్తడంతో అధికారులు కొంత కాలం ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
తరువాత అదే కార్యక్రమాన్ని పాత్రల పేర్లు మార్చి చిన్నక్క(రతన్ ప్రసాద్), ఏకాంబరం (వి.సత్యనారాయణ) పేర్లతో, మూడో పాత్రను మొదట్లో పెదబాబు (ఉషశ్రీ), తరువాత యాదగిరి ( టీ.వీ.ఆర్కే సుబ్బారావు, ఆ పిమ్మట చాలా కాలం రాంబాబు (డి.వెంకట్రామయ్య) లతో జోడించి ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
చాలా ఏళ్ళ కిందట ఓసారి గండిపేటకు గండి పడింది అనే వదంతులతో హైదరాబాదు అట్టుడికి పోయింది. ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని భయాందోళనలకు గురైన సమయంలో ‘వదంతులు నమ్మకండి, మీ ఇళ్లకు వెళ్ళిపొండి’ అంటూ తాను పదేపదే రేడియో ద్వారా విజ్ఞప్తులు చేశానని, మరునాడు పోలీసు కమిషనర్ స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తనని అభినందించడం ఇప్పటికీ మరిచిపోలేదని రతన్ ప్రసాద్ చెప్పారు.
ఆవిడ అసలు పేరు రత్నావళి. భర్త ప్రసాద్ పేరులో ప్రసాద్ అనే పదాన్ని, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్ గా రేడియో పేరు పెట్టుకున్నారట. (రత్న రతన్ గా మారడానికి కారణం ఉత్తర హిందూస్థానంలోని పై అధికారులు అనేది ఆవిడ నమ్మకం)
సుబ్బులక్ష్మిగారి సంగతితో కదా మొదలు పెట్టింది. కింది ఫోటో చూశారా! ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి కచ్చేరీ. పక్కన నిలబడి రేడియోకి అనౌన్స్ మెంట్స్ చేస్తున్నది అప్పటికి పాతికేళ్ళు కూడా నిండని రేడియో చిన్నక్క అనబడే రతన్ ప్రసాద్.
ఈ కధ ఆవిడ మాటల్లోనే.
“అప్పుడు రేడియో సంగీత సమ్మేళనాలు జరుగుతున్నాయి. జూబిలీ హాల్ వేదిక. అక్కడ ఆహూతుల నడుమ జరిగే ఎం ఎస్ సుబ్బులక్ష్మి సంగీత కచ్చేరీని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కార్యక్రమానికి ముందు నేను ఎమ్మెస్ గారెని కలిసి ఆమెగారు పాడబోయే కీర్తనల వివరాలు తీసుకుంటున్నాను. ఏ వరసలో పాడుతారో తెలిస్తే ఒక కీర్తన పూర్తికాగానే మరో కీర్తన పలానాది వినబోతున్నారు అని నేను అనౌన్స్ చేయాలి.
‘ఒక కీర్తన పూర్తికాగానే పక్కకి తిరిగి నావైపు చూస్తే చాలు ఆ సంకేతాన్ని అందుకుని నేను అనౌన్స్ మెంట్ చేస్తాను’ అని ఆవిడగారితో చెప్పాను. అప్పుడు ఎమ్మెస్ తన అరచేతిని చాపి ఇలా అన్నారు, ‘నేను ఉంగరపు వేలు చూపెడితే మరొక కీర్తన వుందని అర్ధం. చిటికిన వేలు ముడిచి చూపిస్తే అదే ఆఖరి కీర్తన అనుకోండి’.
కచ్చేరీ పూర్తయిన తరువాత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నాతొ చెప్పారు మెచ్చుకోలుగా.
‘బాగా అనౌన్స్ చేశావు, మంచి సంగీత పరిజ్ఞానం వున్నదానివే’
ఆవిడ ఇచ్చిన ఈ చిన్ని కితాబు నాకు పెద్ద ఆస్కారుతో సమానం’
ఇలా రతన్ ప్రసాద్ ఫోనులో చెబుతూనే వున్నారు. నాకూ వినాలనే వుంది కానీ అవన్నీముక్కున పెట్టుకుని రాయాలి కదా!
అంచేత మళ్ళీ మరో రోజు నేనే ఫోన్ చేస్తాను అని సంభాషణ ముగించ బోయాను. ఇదంతా నేను బుద్ధిగా విన్నది రాయడానికి అని ఎలా గ్రహించారో ఏమో!
చటుక్కున ఇలా అన్నారు.
‘నాన్నా! నాదో కోరిక. నువ్వు రాసేవన్నీ మా మనుమలు చదువుతుంటారు. నా గురించి కూడా ఏమైనా రాయవూ?
కళ్ళు చెమర్చాయి. నోరు పూడుకుపోయింది.
ఫోన్ పెట్టేసాను, కంప్యూటర్ ముందు కూర్చోడానికి.


(26-10-2019)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి