24, అక్టోబర్ 2021, ఆదివారం

ప్రజలు గమనిస్తున్నారు - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha Daily today, SUNDAY)
“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదం ఒక్కటి పొరబాటున దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం ఇలా అస్తమానం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబుగా అన్నట్టు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔనని తలూపుతున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.
మంచీచెడులను అభివ్యక్తీకరించే సమయంలో మహా కవులు కొన్ని ఔచిత్యాలను పాటించేవారు. అంటే ఎక్కడ ఆకట్టునేలా ఎక్కడ ఎలా చెప్పాలో, ఎక్కడ కర్రుకాల్చి వాత పెట్టాలో వారికి వెన్నతో పెట్టిన విద్య.
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకి ఇవ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.
కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే పనికట్టుకుని అదేపనిగా పునః ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
టీవీ ఛానల్ చర్చలకు వచ్చే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిర్మొహమాటంగా ఒకసారి నాతోనే చెప్పారు, ‘జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది ఎంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అర్ధం కానట్టు వుండిపోతున్నారని అనుకోవాలి. ఇదో విషాదం.
‘నైతిక హక్కు, చిత్తశుద్ధి, ప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతుగా నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, అసలు ఏ పార్టీకి చెందనివాళ్ళు, రాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.
తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు తమకు తామే అడ్డుకట్ట వేసుకోవాలి. సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి.
మంచీ చెడు అనికదా మొదలు పెట్టాం, అవేమిటో చెప్పుకుని ముగిద్దాం.
ఈ ప్రపంచం పుట్టినప్పుడే మంచీ చెడు అనేవి కూడా పుట్టాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం భారతంలో వుంది.
కృష్ణుడు, భీష్ముడు కలిసి ఇది తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు.
ముందు దుర్యోధనుడిని పిలిచి సూర్యాస్తమయం వరకు నగరంలో తిరిగి రమ్మన్నారు. ఎక్కడయినా ఒక మంచి మనిషి తటస్థ పడితే వెంటనే రాజసభకు వచ్చి ఆ విషయం తెలియచేయమన్నారు.
తరువాత ధర్మరాజును విడిగా పిలిచి నగర పర్యటన చేసి ఎక్కడయినా ఒక చెడ్డ మనిషి కనిపిస్తే తక్షణం ఆ సంగతి తమతో చెప్పాలని ఆదేశించారు.
పొద్దుగుంకుతున్న సమయంలో దుర్యోధనుడు తిరిగి వచ్చాడు. యెంత దూరం తిరిగినా మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా తన కంటికి కానరాలేదని చెప్పాడు. కాసేపటికి యుధిష్టురుడు వచ్చాడు. అతడిదీ అదే సమాధానం. యెంత వెతికినా ఒక్క దుర్మార్గుడు కూడా ధర్మజుడుడికి తటస్థ పడలేదు.
అంటే ఏమిటి?
నాలో ఉన్న ‘నేను’ ఎలాటివాడినో, బయటి ప్రపంచంలో నాకు అలాటి వాళ్ళే కనబడతారు. నిజానికి బయట కనబడేది అంతా, మన లోపల ఉన్నదానికి ప్రతిరూపమే.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి