ఈ మహారాజా నేనూ ఒక ఈడు వాళ్ళమే. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ ఏడాది ముందే అంటే 1946లో మేమిద్దరం పుట్టామన్న మాట.
పుట్టుక దగ్గర నుంచీ ఈ మహారాజా గారెకి దేశ విదేశాల్లో అసంఖ్యాక అభిమానులు ఏర్పడ్డారు. ఈ లోగో పుణ్యమా అని ఎయిర్ ఇండియాకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
ఆకారానికి మించిన పెద్ద పెద్ద మీసాలు, రంగు రంగుల కుచ్చు తలపాగా, పంచమీద కోటూ, రాజులు ధరించే పాదరక్షలు ఇవన్నీ జనాలను బాగా ఆకర్షించాయి.
ఏ దేశానికి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించినా ఈ మహారాజా కూడా అందుకు తగ్గట్టే తన వేషాన్ని సవరించుకుని, దశావతారాలు ఎత్తుతాడు. నవ తరాన్ని ఆకర్షించడానికి అవసరమైతే పంచె కట్టు పక్కనబెట్టి, జీన్స్ ప్యాంటు వేసుకుంటాడు. ఎయిర్ ఇండియా మహారాజా మస్కాట్ తమ డ్రాయింగు రూములో వుండాలని ఎగబడి వీటిని కొనుక్కున్న వారి సంఖ్య లక్షల్లో వుంటుంది.
ఇంత ప్రాచుర్యం తెచ్చుకున్న ఈ మహారాజాకు కూడా విమర్శల దాడి తప్పలేదు.
సోషలిజం అని ఓ పక్క కబుర్లు చెబుతూ ప్రభుత్వ విమాన సంస్థకు ఈ మహారాజా లోగో ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరికి ఎయిర్ ఇండియా 1989లో తన లోగో మార్చుకోవాల్సివచ్చింది. ఎగురుతున్న హంస, కోణార్క్ చక్రతో కూడిన కొత్త లోగోను ప్రవేశపెట్టింది. దానితో యాభయ్ ఆరేళ్లు ఓ వెలుగు వెలిగి దేశ విదేశాల్లో తన ప్రభావం చాటిన ఎయిర్ ఇండియా మహారాజా ఇప్పుడు ఓజ్ఞాపకంగా మిగిలాడు.
కానీ అదేమిటో విచిత్రం.
ఎయిర్ ఇండియాలో పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుని, ఆ బిడ్డును టాటా సంస్థ సొంతం చేసుకుందని వస్తున్న వార్తల నేపధ్యంలో ఈ మహారాజానే మళ్ళీ వార్తల్లో ప్రముఖంగా కనబడ్డాడు. అంటే ఎయిర్ ఇండియా అంటే మహారాజా. ఆ మీసాల మహారాజా అంటే ఎయిర్ ఇండియా అని జనం డిసైడ్ అయిపోయారన్న మాట.
(02-10-2021)
అంతే కదండీ - ఎయిర్ ఇండియా అంటే మహారాజా - ఈ తరువాత లోగోని మార్చినా కూడా గుర్తుండి పోయేది మహారాజానే. అంతటి బ్రాండ్ ఐడెంటిటీ (Brand Identity) (బ్రాండ్ పేరు చెబితే ఆ మోడల్ గుర్తుకు రావడం, మోడల్ ని చూస్తే ఆ బ్రాండ్ / ఉత్పత్తి గుర్తుకు రావడం) ఎయిర్ ఇండియా మహారాజాకు ఉంది, జోడియాక్ టై ల అలనాటి గడ్డం మోడల్ ధన్జీ రాణాకు ఉంది.
రిప్లయితొలగించండిఎయిర్ ఇండియా మహారాజాను సృష్టించి, అంత గొప్పగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చిన బాబీ కూకా (Bobby Kooka) కూడా అంత సమానంగానూ వినిపిస్తుండే పేరు ఆ రోజుల్లో.
తిరిగి టాటాల చేతుల్లోకి వెడితే ఎయిర్ ఇండియా వెతలు కాస్తైనా తీరుతాయని ఆశిద్దాం.