17, అక్టోబర్ 2021, ఆదివారం

శుభకార్యాల్లో చావుల సంగతి ప్రస్తావించవచ్చా - భండారు శ్రీనివాసరావు

 రాజమండ్రి వద్ద గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి రైలు రోడ్డు వంతెన ప్రారంభోత్సవానికి రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం బాధ్యత ఉషశ్రీ గారికి అప్పగించారు. ఆ రోజుల్లో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పనిచేస్తూ వుండేవారు. ఆయనా ఉషశ్రీ గారు మంచి స్నేహితులు. ఆ వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్నది సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కావడంతో అధికారులు ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టారు. వీవీఐపీ ప్రోగ్రాం కాబట్టి ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం నిమిత్తం పనిచేసేవాళ్ళు, ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిలో భాగంగానే ఉషశ్రీ గారు, మా అన్నయ్యను కలిసి వంతెన తాలూకు వివరాలు సేకరించారు. అప్పుడు మా అన్నయ్య చెప్పిన సలహా నాకు బాగా జ్ఞాపకం వుంది.

రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం కాబట్టి మధ్యలో విరామాలు ఇవ్వడానికి వీలుండదు. మీరు ఏదో ఒక సంగతి శ్రోతలకు నిరంతరం  చెబుతూనే వుండాలి. ఎక్కడా బ్రేక్ రాకూడదు. వంతెన వివరాలు ఎలాగూ మీకు ఇస్తాము. కానీ మధ్యమధ్యలో ఎక్కడయినా వీలుచూసుకుని ఈ వంతెన నిర్మాణంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటే బాగుంటుంది’

ఈ సలహా ఆయనకు నచ్చింది. కానీ, ఎందరెందరివో ధర్మసందేహాలు తీర్చగలిగిన ప్రతిభాశాలి ఆయనకే ఒక అనుమానం పొడసూపింది. శుభమా అంటూ కార్యక్రమం జరుగుతుంటే చనిపోయిన సంఘటనలు గుర్తు చేయడం బాగుంటుందా అని.

దీనికి సమాధానం ఆరోజు ప్రధాని ప్రసంగంలోనే లభించింది.

ఆసియాలోనే అతి పొడవైన రైలు రోడ్డు వంతెనను ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ ఇంజినీరింగ్ ప్రక్రియను జయప్రదంగా పూర్తిచేయడంలో అవిరళ కృషి చేసిన ఇంజనీర్లను, కార్మికులను అభినందిస్తున్నాను. అయితే ఇదే సమయంలో ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణలో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’

63 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మాణం 1972 లో పూర్తయింది. రాజమండ్రి, కొవ్వూరులను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పొడవైనదిగా చెప్పుకునే వారు. ఈ వంతెనకు అధికారికంగా ఏం పేరు పెట్టారో తెలవదు కానీ స్థానికులు మాత్రం కొవ్వూరు బ్రిడ్జ్ అనే పిలుచుకునే వారట.

NOTE: రాజమండ్రి దగ్గర ఎన్ని కొత్త వంతెనలు వచ్చాయో నాకు తెలియదు. నా పోస్టు ఉద్దేశ్యం జాతికి పనికి వచ్చే ఇలాంటి ప్రాజెక్టులు ఎవరి హయాంలో కట్టారు అని కాదు వాటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనేది వివరించడానికి మాత్రమే.

2 కామెంట్‌లు:

  1. మా రాజమండ్రి బ్రిడ్జిని.. అప్పటి రోజుల్ని గుర్తు చేశారు.. ధన్యవాదాలు.. వారాంతాల్లో బ్రిడ్జి ఎక్కి కాసేపు గడపడం రాజమండ్రీయులకు ఓ కాలక్షేపం..

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా మంది, ముఖ్యంగా కార్మికులు ప్రమాదాల్లో చనిపోతుంటారు. ఒక సివిల్ ఇంజనీర్ గా నా దృష్టిలో వాళ్ళ మరణం, సైనికుల వీర మరణం కంటే తక్కువేమీ కాదు. అయినా ఈ కార్మికులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. పరిహారం కూడా గొప్పగా ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి