15, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.

మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే అసలు పేరు అక్కరాజు హరగోపాల్.
‘ఆర్కే కనిపిస్తే కాల్చేయాలి’ అని పోలీసులకు ఉత్తర్వులు, ఆర్కేను పట్టించిన వారికి కోటి రూపాయలు రివార్డు వున్న ఈ ఆర్కే అనే మావొయిష్టు అగ్ర నేతను, పదిహేడేళ్ల క్రితం, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే పోలీసులు అడవుల నుంచి సగౌరవంగా హైదరాబాదుకు తీసుకురావడం, అప్పుడు రేడియో విలేకరిగా పనిచేసిన నాకు కూడా విభిన్నమైన అనుభవం.
మావొయిష్టులు అనే విప్లవకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ద్ధపడడం, అందుకు వారిని ఆహ్వానించడం ఆ కాలంలో ఓ పెద్ద విశేషమైన, సంచలనాత్మకమైన వార్త. అయుధాలు వదిలిపెట్టి నగరానికి రావాలి అనే ప్రభుత్వ షరతు కారణంగా మొదట్లో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే విషయంలో కొంత సంగ్దిగ్ధత ఏర్పడ్డా, చివరికి ఆ నీలి నీడలు తొలగిపోయి చర్చలు జరిగాయి. అవి ఫలించాయా లేదా అనేది వేరే విషయం. ఒక ముందడుగు పడింది అని భావించినవారే ఎక్కువ.
దట్టమైన అడవుల్లో దశాబ్దాలుగా సంచరిస్తూ, ఒక స్థావరానికీ మరో స్థావరానికీ నడుమ, పోలీసుల డేగ కళ్ళు కప్పి వేరే స్థావరంలో తాత్కాలికంగా తల దాచుకుంటూ జీవితాలు గడుపుతున్న మావోయిష్టు నాయకులకు, నాటి ప్రభుత్వం వారిని ప్రభుత్వ అతిధులుగా పరిగణిస్తూ సమస్త మర్యాదలు చేసింది. సంవత్సరాల తరబడి అడవుల్లో దొరికింది తింటూ కాలం గడిపిన వారికి ప్రభుత్వ అతిథి గృహంలో చేసిన ఏర్పాట్లు విస్మయం కలిగించాయి. ఒక దిన పత్రిక అయితే ఒక అడుగు ముందుకు వేసి అతిథి గృహంలో మావోయిష్టు నాయకులకు జరుగుతున్న మర్యాదలను ఉటంకిస్తూ ఏకంగా వారికి భోజనాల్లో వడ్డిస్తున్న వివిధ రకాల వంటకాల జాబితాను సవివరంగా ప్రచురించింది.
ఈ విషయం దృష్టికి రాగానే మావోయిష్టు నాయకుడు ఆర్కే వెంటనే స్పందించి తమకు ప్రత్యేక మర్యాదలు, భోజన ఏర్పాట్లు అవసరం లేదని మృదువుగా తిరస్కరించి ఆ విషయం అధికారులకు తెలియచేసారు.
మావోయిష్టులు అక్కడ బస చేస్తున్నారని తెలిసి సామాన్య జనం తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టుకోవడానికి, వారికి మహజర్లు ఇవ్వడానికి క్యూలు కట్టారు.
తాము ఇక్కడికి వచ్చింది ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మాత్రమే అని ఆర్కే వారితో స్పష్టంగా చెప్పేవారు. సమాజంలోని ఈ అసమానతలు తొలగించడానికే తాము ఆయుధాలు చేతబట్టామని, తమ లక్ష్యం సాధించుకోవడానికి ప్రభుత్వంతో పోరాడుతాము కానీ సిఫారసులు చేయడం తమ పని కాదనీ ఆయన స్పష్టం చేశారు.
బీ టెక్ చదివి, కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు సమాజాన్ని ఉద్ధరించడానికి తుపాకీ చేతబట్టి అడవులకు వెళ్ళడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్న ఆర్కే తండ్రికి ఎలాంటి మనస్తాపం కలిగించిందో ఎవరికీ తెలియదు. సంఘాన్ని బాగుచేయాలనే సదుద్దేశ్యంతో అడవి బాట పట్టిన ఇలాంటి అడవి వీరులు ఎందరో ఇలా తమ బతుకులను తెల్లవార్చుకోవడం విషాదం అనిపిస్తుంది. గమ్యం మంచిదైనా నడిచే మార్గం మంచిది కాదని అనేవాళ్ళు వుంటారు. నిజం కూడా. కానీ లక్ష్యశుద్ధి వుంటే మార్గం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆ వీరుల నమ్మకం.
అయితే, పోరాడితే పోయేది లేదు అనే ఒకే ఒక జవాబు తప్ప, ఇన్నేళ్ళుగా సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు వారి నుంచి సరయిన సమాధానం లేదు,.
ముందే చెప్పినట్టు మంచి చెడులను తేల్చి చెప్పేది ఒక్క కాలం మాత్రమే.
ఆర్కే కుటుంబానికి నా సానుభూతి.



(15-10-2021)

7 కామెంట్‌లు:

  1. >>ఇలాంటి అడవి వీరులు ఎందరో
    అడవి వీరులేమిటీ. సిధ్ధాంతం ముసుగులోని అరాచక ముఠాలు. ఆతతాయిలు.

    >> లక్ష్యశుద్ధి వుంటే మార్గం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆ వీరుల నమ్మకం.
    ఐతే దొంగతనాలు చేసి ప్రజోపయోగ కార్యక్రమాలు చేయటం అనే రాబిన్‌ హుడ్ తరహా సరైనదని వారు నమ్మినా వారు ఏసమాజం కోసం అని చెప్పుకుంటున్నారో ఆసమాజం నమ్మటం లేదు.

    >> ఆర్కే కుటుంబానికి నా సానుభూతి.
    ఈ‌ ఆర్కే & గ్యాంగ్ వలన అసువులు బాసిన వారికి ( వారిలో ముప్పాతిక మువ్వీసం మంది అమాయకులే ఉంటారు! ) మాత్రమే నా సానుభూతి.
    ఈ మావోయిష్టులు ఏదో ధర్మయుధ్ధం చేస్తున్నట్లు ఆర్కే‌భార్య పోలీసులు అధర్మయుధ్ధం చేస్తున్నారని వాపోతోంది. మాటువేసి చంపటాలు చేసే‌ ఈ మావోయిష్టులు ధర్మయుధ్ధం చేస్తున్నారని ఆవిడ ఘోష కాబోలు. వీళ్ళంతా ఆతతాయిలే శ్రీకృష్ణుడి నిర్వచనం ప్రకారం - వీళ్ళ మీద సానుబ్భూతి ఏమిటీ‌ నాన్సెన్స్!!

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. నిదు‌రలో ఉన్న ఉపపాండవాది వీరులను అందరినీ అశ్వధ్థామ కర్కశంగా పశువుల వలె వధించిన తరువాత కూడా బ్రాహ్మణుడు గురుపుత్రుడు అన్న కారణాలతో అతడు వధార్హుడు కాడని పాండవులు భావించారు. ఈవాదాన్ని కృష్ణుడు నిరాకరించి వాడు ఆతతాయి కాబట్టి తప్పక వధార్హుడు అని చెప్పుతాడు. ఆయన చెప్పిన ప్రకారం అగ్నివిషాదులతోనూ ఇతరత్రానూ దొంగదెబ్బతో హాని కాని చంపటం కాని చేసే దుష్టుడు ఆతతాయి. వాడిని ఏదో ధర్మపన్నాలతో క్షమించనక్కరలేదు - వాడు అవశ్యం వధ్యుడే.

      తొలగించండి
  3. చీడ పురుగు సచ్చింది

    రిప్లయితొలగించండి
  4. ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతం కోసం నూటికి నూరుపాళ్ళు నిజాయితీగా బతకటం చాలా గొప్ప విషయమే!

    ఆతతాయి అనే పదానికి శ్యామలీయం ఇచ్చిన నిర్వచనం రామకృష్ణకు వర్తించదు.
    ఆతతాయి అంటే చంపడానికి ఉద్యుక్తుడు అయిన వాడు అని అర్ధం
    వీళ్ళు ఎన్ని రకాలంటే:
    ౧. అగ్నిదుడు - నిప్పుని ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాడు ఉదా: మహాభారతంలో పాండవుల లక్క ఇల్లు కాల్చిన వాళ్ళు
    ౨. గరదుడు - విషమును ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాళ్ళు ఉదా: మహాభారతములో భీమసేనుడిని చంపదలచిన వాళ్ళు
    ౩. శస్త్ర పాణి - ఆయుధములను ఉపయోగించి చంపడానికి పూనుకున్నవాళ్ళు
    ౪. ధనాపహుడు - ధనమును, ఐశ్వర్యమును కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
    ౫. క్షేత్రాపహారి - రాజ్యమును, ఆస్తిని కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
    ౬. దారాపహారి - వేరొకరి భార్యని అపహరించి అడ్డు వచ్చిన వాళ్ళని చంపాలనుకునే వాళ్ళు ఉదా: రామాయణములో రావణాసురుడు
    అశ్వద్ధామతో సహా ఆ పదాన్ని స్వార్ధం కోసం ఇతరుల్ని చంపేవాళ్ళకు మాత్రమే వాడాలి.రామకృష్ణ గానీ ఇతర నక్సలైట్లు గానీ తమ స్వార్ధం కోసం ఆ హత్యలు చెయ్యలేదు కదా!

    అతను చంపినవాళ్ళు పులుగడిగిన ముత్యాలు కాదు.మన దేశపు సైన్యం మన దేశం మీద యుద్ధానికి వచ్చిన ఇతర దేశపు సైనికుల్ని చంపడం తప్పు కానప్పుడు సామాన్య ప్రజానీకాన్ని అడ్డూ అదుపూ లేకుండా పీడించుకు తినే దోపిడీ దారుల్ని చంపడం రామకృష్ణ తప్పెలా అవుతుంది?తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి - ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇతర్లని దోచుకోవడం మానను అని భీష్మించుకుని కూర్చున్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని భయపెట్టి అదుపు చెయ్యగలిగేది రామకృష్ణ లాంటివాళ్ళే తప్ప శ్యామలీయం లాంటివాళ్ళు కాదు.దోపిడీదారులు ఉన్నంతకాలం విప్లవవీరులు కూడా ఉంటారు,ఉండాలి,ఉండకపోతేనే మనలాంటివాళ్ళకి ప్రమాదం.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి
  5. ముందే చెప్పినట్టు మంచి చెడులను తేల్చి చెప్పేది ఒక్క కాలం మాత్రమే.... ఈ వాక్యం సందర్భోచితంగా వాడినా ఇంతకాలం... ఇన్ని ప్రాణాలు.... అందులో అమాయకుల ప్రాణాలను బలిగొనడం, ఆనక సారీ చెప్పడం వంటివి నక్సల్స్ తప్పక పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని తెలిపేవి.

    ఆర్కే ఖచ్చితంగా వీరుడే. అతని మార్గం తప్పయినా ఆచరణను బట్టి చూస్తే అతనిని ఆకతాయి అనడం దుస్సాహసం అవుతుంది.

    రిప్లయితొలగించండి