16, సెప్టెంబర్ 2021, గురువారం

నర్సుని కావాలని వుంది

 

 “పెద్దయిన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నావ్? అనే ప్రశ్నకు నేను చెప్పిన ఈ  జవాబు విని క్లాసులో, టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.”

“దేవుడికి నా కోరిక సగమే అర్ధం అయినట్టు వుంది. అందుకే ఇలా నాచేత ఈ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టించి ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, వారి ఆలనా పాలనా చూడమని”

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం, 1980లో అనుకుంటాను, వాసిరెడ్డి కాశీ రత్నం గారు మా ఇంటికి వచ్చారు,  ఆంధ్రజ్యోతి  గ్రూపు తరపున  వెలువడే  వనితా జ్యోతి  పత్రిక కోసం మా ఆవిడను  ఇంటర్వ్యూ చేయడానికి. ఆ సందర్భంలో  మా ఆవిడ నిర్మల నడిపే  అమ్మవొడి గురించి కాశీరత్నం గారు అడిగినప్పుడు మా ఆవిడ చెప్పిన మాటలు ఇవి.

అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర్లో  పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. నాకు రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న  సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.

ఆరోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే  జీతానికి, జీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన ప్రై నెలా మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి చేతికర్ర  పొడుచుకుంటూ, జాగ్రత్తగా  నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.  మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు, సమయానికి  అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడి, మరికొంత చీకాకు పడి.

ఈ నేపధ్యంలో మరో దారి కనపడక, మా ఆవిడ ఈ అమ్మఒడి దారి ఎంచుకుంది.

ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని చిన్నారుల బడి’ అనే ట్యాగ్  లైన్ తో  ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.

రెండు వారాలు గడుస్తున్నా మా ఆవిడ అమ్మ ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీ, ఉయ్యాలలు  కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారు? కానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.

అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి మా ఆవిడ చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడిని, ఓ పాలసీసాను పెట్టి, ‘ఇప్పుడు టైము లేదు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి, సాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. నేను కూడా ఆఫీసు నుంచి వచ్చాను. ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని  సముదాయిస్తూ తను ఒక్కత్తీ కూర్చుని వుంది. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. నాలో ఆరాటం పెరిగింది. ‘పోలీసులకు చెప్పనా!’ అన్నాను. తల అడ్డంగా ఊపింది. ‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అంది స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.

మా ఆవిడ అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారు, బోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి  ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.

బాబు పేరు జేమ్స్. మా ఆవిడ పెట్టిన అమ్మఒడిలో చేరిన  మొదటి పిల్లవాడు.

తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. మా ఆవిడకు పని భారము పెరిగింది. పని మనిషి  రాని రోజున చూడాలి మా ఆవిడ అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేసేది.  కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలు, లాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగేది కాదు. ఇచ్చినది పుచ్చుకునేది. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేది కాదు.

‘మనం అంతేగా! నెలనెలా  అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది’ అని వారినే సమర్ధించేది.

అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు  నా మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.

అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే తను చాలా సంబర పడేది.

అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్  కావాలనుకున్న తన చిన్ననాటి కోరికను మా ఆవిడ నిర్మల తన  అమ్మఒడి ద్వారా తీర్చుకుంది.

ఆమె సేవాభావం నాకు అంటలేదు కానీ, కన్న పిల్లలు ఇద్దరికీ కొంచెం పంచిపెట్టే వెళ్ళింది, నేను పంచడానికి ఏమీ లేదని తెలుసు కనుక.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి