20, సెప్టెంబర్ 2021, సోమవారం

చీరే మేరే సప్నే - భండారు శ్రీనివాసరావు

 

నా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.

చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.

కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాడ్ని, పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.

అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.

(కింది ఫోటో:   తుర్లపాటి హనుమంతరావు బావగారి శత జయంతికి వచ్చిన దంపతులను ఇలా సింహాసనాల మీద కూర్చోబెట్టి  తీర్చుకున్న ముచ్చట)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి