16, సెప్టెంబర్ 2021, గురువారం

సంగీత ధ్రువతార ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

 

( సెప్టెంబర్ 16 సుబ్బులక్ష్మి గారి జయంతి)
"Who am I, a mere Prime Minister before a Queen, a Queen of Music" - Pandit Jawaharlal Nehru about MS Subbulakshmi.
ఈ వ్యాసానికి ప్రేరణ అయిన మితృలు ఆర్వీవీ కృష్ణారావు గారు, గతంలో ఒకసారి అమెరికా నుంచి వచ్చిన వారి అమ్మాయి కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళారు. కొండమీదకు కారులో వెడుతుంటే దారిలో పూర్ణకుంభం కూడలిలో వున్న ఓ విగ్రహాన్ని చూపించి అది ఎవరు తాతయ్యా అని అడిగాడు ఆయన మనుమడు. చేతిలో తంబుర ధరించి ఎంతో భక్తిప్రపత్తులతో కూడిన తన గానంతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తున్నారా అన్నట్టు జీవకళ ఉట్టిపడుతున్న ఆ కాంస్య విగ్రహాన్ని చూసి మనుమడికి జవాబు ఇవ్వబోయే లోపు అక్కడి టాక్సీ డ్రైవరే చెప్పాడు , దేశం గర్వించే ఒక గొప్ప గాయకురాలు ఎం ఎస్ సుబ్బులక్ష్మి అని.



అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహానుభావురాలికి ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేయడంలో తెలుగునేల వెనుకబడిలేదని, సంగీతం వంటి కళలు, కళాకారులను గౌరవించే విషయంలో ప్రాంతీయ, భాషా బేధాలకు తావులేదని నిరూపించారు.
(ఈ విగ్రహానికి సంబంధించి మరోప్రహసనం పత్రికల్లో వచ్చింది. ఓపదేళ్ళ తరువాత కాబోలు ప్రసిద్ధ గాయకుడు ఎస్.పీ. బాలసుబ్రమణ్యం దైవదర్శనం కోసం తిరుపతివెళ్ళారు. దారిలో ఆ కూడలిలోఆగి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి శ్రద్ధాంజలి ఘటించారు. కళ వ్యాపారం కాకున్నా ప్రతిదీ వ్యాపారం అనుకునేవాళ్ళకు ఈసమాజంలో కొదవలేదు. ఆ ప్రసిద్ధ గాయకురాలి విగ్రహం చేతికివున్న తంబురకు టీవీ కేబుళ్ళు వేలాడుతున్నాయి. పదిమంది కంటపడుతుంది అనే భావనతో కాబోలు ఆ విగ్రహం కనబడకుండా హోర్డింగులు దాని చుట్టూ
గోడకట్టాయి.ఈ పరిస్తితి గమనించి ఎస్పీ కలత చెందారు. కన్నీరు పెట్టుకున్నారు. స్వామి దర్శనం చేసుకున్న వెంటనే ఆయనచేసిన మొదటిపని టీటీడీ అధికారులని కలిసి పిర్యాదుచేయడం. అప్పటి ఈవో సాంబశివరావుగారు వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపి పరిస్తితిని చక్కదిద్దారు. ఎమ్మెస్ శత జయంతిని పురస్కరించుకుని విగ్రహంవున్న ఆ కూడలిని సుందరంగా తీర్చిదిద్దారు.)
ఇక విషయానికి వస్తే-
ఈరోజు సెప్టెంబర్ పదహారు సుబ్బులక్ష్మి శతజయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సంగీతాభిమానిగా సుబ్బులక్ష్మి గారి గురించిన కొన్ని జ్ఞాపకాలని కృష్ణారావు గారు నెమరు వేసుకున్నారు.
కేంద్రప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా రిటైరయిన కృష్ణారావుగారితో ఒక సహోద్యోగిగానే కాకుండా ఒక శ్రేయోభిలాషిగా కూడా నాకు కొన్ని దశాబ్దాల పరిచయం. బెజవాడలో చదువుకుంటున్నరోజులనుంచి ఆయనకు మొదలయిన ఈ సంగీతాభిమానం ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరిన్ని మొగ్గలు తొడిగింది. సంగీతం పట్ల యెంత అభిరుచి అంటే సంగీత సభల కోసం ఎంతో ఖర్చు పెట్టుకుని, ఉద్యోగానికి సెలవు పెట్టుకుని అనేక దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. కృష్ణారావు గారింట్లో ఒక హెచ్.ఎం.వీ. గ్రామఫోన్ వుంది. చాలామంది ఇళ్ళల్లో కూడా చూశాను, దాన్ని ఒక అలంకరణ వస్తువుగా. కానీ ఆర్వీవీ గారింట్లో వున్న ఆ పాత గ్రామఫోన్ ఇప్పటికీ పనిచేస్తూ వుంది. కొలంబియా వారు తయారు చేసిన గ్రామఫోన్ ప్లేట్లు అనేకం వున్నాయి. సుబ్బులక్ష్మి గారి రికార్డు కూడా వుంది. ఒక వైపు ఆవిడ కళ్యాణి రాగంలో పడిన 'నీదు చరణములే...' అనే కీర్తన, రెండో వైపు 'బృహు ముకుందే..' కీర్తన వున్నాయి.
ఆ రికార్డులని పదేపదే వినడంలో కూడా ఆయనదే ఒక రికార్డు. సంగీతం పట్ల అభినివేశం కలగడానికి సుబ్బులక్ష్మి గారు పాడిన ఆ కీర్తనలే కారణం అంటారు కృష్ణారావు గారు.
ఆయన బెజవాడ రేడియోలో పనిచేస్తున్నప్పుడు దగ్గరలో వున్న తెనాలికి సుబ్బులక్ష్మి గారు వస్తున్న కబురు అందింది.
తెనాలిలో నారుమంచి సుబ్బారావు గారనే మరో సంగీత అభిమాని వున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద సీతారామ గాన సభను నడుపుతుండే వారు.
బెజవాడలో కృష్ణారావు గారు కూడా త్యాగరాజ సంగీత కళాసమితి అనే పేరుతొ ఒక సంగీత సభ నిర్వహించేవారు. ఎలాగైనా బెజవాడలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సంగీత కచేరీ పెట్టించాలన్నది ఆ సభవారి కోరిక.
ఆయనా, మోహన రావుగారనే మరో సంగీత అభిమాని కలిసి రెక్కలు కట్టుకుని తెనాలిలో వాలిపోయారు. కచేరీ మొదలు కావడానికి ముందే సుబ్బారావు గారిని కలుసుకుని తమ మనసులో మాట ఆయన చెవిన వేసారు. కనుక్కుని చెబుతా అని ఆయన మాట ఇచ్చారు. లోపల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తన బృందంతో కలిసి కచ్చేరీకి సిద్ధం అవుతున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా కచేరీ చేయడంలో ఆవిడగారికి వున్న నిబద్దత అలాంటిది మరి. కచేరీ అయిన తరువాత ఎమ్మెస్ వారిని కలుసుకుని మాట్లాడారు. తనను ఇంతకు ముందే సౌందర రాజన్ అనే పెద్దమనిషి కలిసి బెజవాడ కచేరీ గురించి సంప్రదించారని, ఆయనకు మాట ఇవ్వడం వల్ల మీ మాట మన్నించలేక పోతున్నాననీ ఆవిడ ఎంతో నమ్రతగా, నొచ్చుకుంటూ చెప్పిన తీరు వారిని కదిలించింది. ఏ సభ వారు పిలిస్తే ఏమిటి, ఆవిడ బెజవాడలో కచేరీ చేయబోతున్నారు అదే పదివేలనుకుని వీళ్ళు బెజవాడ తిరిగి వెళ్ళారు.
బెజవాడలో కచేరీ చాలా గొప్పగా జరిగింది. గవర్నర్ పేట, రాజగోపాలచారి వీధిలో మా బావగారు, సీనియర్ వకీలు తుర్లపాటి హనుమంత రావు గారు చాలాకాలం నివసించిన ఇంటి ఎదురుగా ఒక పెద్ద శ్వేత సౌధం వుండేది. చక్రవర్తి అనే లాయరు గారిది. ఆ భవనంలోనే సుబ్బులక్ష్మి గారి విడిది చేసారని చెప్పారు కృష్ణారావు గారు. ( ఇప్పుడు ఆ వైట్ హౌస్ లేదు, పడగొట్టి ఏదో కాంప్లెక్స్ కట్టినట్టున్నారు)
తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక. హాలు కిటకిట లాడింది. బెజవాడలో సంగీత శ్రేష్ఠులు అయిన వారంతా మొదటి వరుసలో వున్నారు. అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహన్ రావు, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎన్.సి. హెచ్. కృష్ణమాచార్యులు,మల్లిక్ మొదలయిన వాళ్ళు ఎమ్మెస్ వేదిక మీదకి రాగానే వారంతా లేచి గౌరవపురస్సరంగా నిలబడి అభివాదం చేశారు.
ఆవిడ చేతులు జోడించి వారందరికీ నమస్కారాలు చేసి కచేరీకి సిద్ధం అవుతూ వేదిక మీద నుంచే కనక దుర్గ గుడి దిశగా ఓ నమస్కారం పెట్టి కచేరీ మొదలు పెట్టారు. ప్రేక్షకుల్లో కృష్ణారావు గారు ఒడిలో టేప్ రికార్డర్ పెట్టుకుని సిద్ధంగా వున్నారు.దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభించి, ఏకబిగిన మూడుగంటలు కూర్చున్న భంగిమ మార్చకుండా కచేరీ ఇచ్చారు. సభికులూ అంతే. పారవశ్యం తప్ప మరో కదలిక లేదు. ముందు కూర్చున్న సంగీతకారులను, వెనుక వరసల్లో వున్న సాధారణ సంగీత అభిమానులను ఆవిడ ఒకే స్థాయిలో అలరింప చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి