2, సెప్టెంబర్ 2021, గురువారం

ప్రజావైద్యుడు వై.ఎస్.ఆర్.

 

(వై.ఎస్. వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు (02-09-2021) ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో వుండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ వై.ఎస్. మాదిరిగా ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటేకాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను, కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు.
వై ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, వారికి సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు. అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’
ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు “చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది”
వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు.
నా భార్యకు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఐ.సీ.యు.లో వున్నప్పుడు చూడడానికి వెడితే, పక్క బెడ్ మీద మరో అమ్మాయి పడుకుని వుంది. పదిహేను ఏళ్ళు ఉంటాయేమో. చాలా క్రిటికల్ ఆపరేషన్ చేశారు. ఆ అమ్మాయి తండ్రి ఆదిలాబాదు జిల్లాలో ఓ రోజు కూలీ. లక్షల్లో ఖర్చయ్యే ఆ ఆపరేషన్, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ వల్ల ఒక్క రూపాయి ఖర్చు కాకుండా జరిగిందని ఆ తండ్రి నాతో చెప్పాడు. పేదా గొప్పా అనే తేడా లేకుండా అందరికీ వైద్య సౌకర్యం అందించే ఆరోగ్య శ్రీ పధకం మా వంటి పేదల ప్రాణాలను కాపాడుతోందని అన్నాడు.
అలాగే ఓసారి సెలూన్ కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ఓ కుర్రాడి అనుభవం ఒకటి తెలిసి వచ్చింది. వాళ్లది మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కుగ్రామం. పొట్టచేతపట్టుకుని నగరానికి వచ్చి, తనకు ఇలవరుసగా అబ్బిన విద్యతో పొట్టపోసుకుంటున్నాడు. తను పదో తరగతి పాసయాడు. చెల్లెలు చదువులో ఎదిగివచ్చే నాటికి వై.ఎస్. అమలుచేస్తున్న ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకం అమల్లోకి వచ్చింది. ఇంటర్ పాసుకాగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది.
‘నేను ఊరికి పొతే కత్తెర్లు వేసేవాడు అంటారు, అదే మా చెల్లెల్ని ఇంజినీర్ అంటారు. ఈ పధకం వల్ల చదువు అంటడం సంగతి అటుంచి మాలో ఆత్మన్యూనత పోయి మామీద మాకు విశ్వాసం కలుగుతోంద’ని చెప్పుకోచ్చాడా అబ్బాయి.
అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు, హెచ్.ఎం.ఆర్.ఐ. వారు మరో ఆరోగ్య పధకానికి రూపకల్పన చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే సంచార వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం, పేద పల్లెప్రజల ప్రాణాలు జబ్బుల కారణంగా ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే, వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని భావిస్తే, 108 అంబులెన్సు ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ. నిర్వాహకులు ముఖ్యమంత్రి సమయం తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి, మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.
అంతే!
దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.



3 కామెంట్‌లు:

  1. రాజకీయాలలోకొచ్చి ఉన్నది ఊడగొట్టుకున్న చాలా తక్కువమందిలో రాజశేఖర్రెడ్డి గారు ఒకరు అని ఉండవల్లిగారు అన్నారు(ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో). "అదిమాత్రం నిజం"-ఆర్కే రిప్లయ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆమాట నిజం కావచ్చు. కాని ఆయన అధికారాన్ని పుత్రరత్నం గారు మంత్రదండంగా వాడుకున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయమూ ఉంది లోకంలో

      తొలగించండి
  2. అందుకే, వైఎస్ బతికున్నంతకాలమూ కొడుకుని ఆంధ్ర రాజకీయాలకు దూరంగా పెట్టాడన్న అభిప్రాయమూ ఉంది.

    రిప్లయితొలగించండి