15, ఆగస్టు 2021, ఆదివారం

ఇలా కూడా చెప్పొచ్చు

 

డెబ్బయ్యవ దశకంలో నేను నార్ల వారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నాకు తొలి గురువు నండూరి రామమోహన రావు గారు. ఆయనా, పురాణం గారు అవ్యాజానురాగంతో నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించారు.
ఈ క్రమంలో నండూరి వారు కొన్ని అదనపు బాధ్యతలు నా భుజంపై మోపారు. కానీ నాకు అదనపు భారం అనిపించలేదు. సంతోషపడ్డాను కూడా.
ఆరోజుల్లో ఇప్పటిలా కంప్యూటర్లు లేవు. ఏ రచన అయినా చేతి రాతే. ఆఫీసులో కింద కంపోజింగ్ విభాగం వుండేది. చిన్న చిన్న అరలతో కూడిన నిలువెత్తు చెక్క బల్లల ముందు నిలబడి అక్షరాలు కూర్చేవారు. ఆ అరల్లో సీసంతో తయారు చేసిన తెలుగు అక్షరాలు, వత్తులు, దీర్ఘాలతో సహా అన్ని సైజుల్లో ఉండేవి. మేము పంపించిన వ్యాసాలు లేదా రచనల కాగితాలను చిన్న చిన్నగా కత్తిరించి వాటిని ముందు పెట్టుకుని కళ్ళు చికిలించుంటూ పేరాలు పేరాలుగా కంపోజ్ చేసేవారు. వార్తలకు ఒక సైజు అక్షరాలు, హెడ్డింగు లకు ఒక సైజ్, సబ్ హెడ్డింగులకు మరో సైజు ఇలా అన్నమాట. ఆ సైజుల్ని పాయింట్లు అనేవారు. 36 పాయింట్ 24 పాయింటు 16 పాయింట్, 12 పాయింట్ ఇలా ఉండేవి. తరువాత వాటిని న్యూస్ ప్రింట్ కాగితాలపై రోల్ చేసి, ప్రింట్ వేసి ప్రూఫ్ రీడర్లకు పంపేవారు. ప్రూఫ్ దిద్దిన వాటిని పొడవాటి ఎస్ గ్యాలీల రూపంలో సబ్ ఎడిటర్లకు పంపేవారు. వాళ్ళు సరిదిద్దిన వాటిని మళ్ళీ రోల్ ప్రింట్ వేసి నండూరి వారి టేబుల్ వద్దకు చేర్చేవాళ్ళు. ఆయన చూసిన తర్వాత ఇక ఫైనల్. వాటిని పేజి మేకింగ్ సెక్షన్ కు పంపడం జరిగేది.
రామ్మోహన రావు గారు సంపాదకీయం రాసేవారు. అదే ఎడిట్ పేజీలో, సంపాదకీయం కింద రోజువారీగా నేను రాసే వాక్టూన్లు, బయటివారు రాసిన ఆర్టికిల్స్ ప్రచురించేవారు. అప్పుడప్పుడు వాటిని కంపోజ్ చేయించి పేజీలో పెట్టే బాధ్యత నామీద పడేది. ఒక్కోసారి ఆర్టికిల్ సైజ్ ఎక్కువ కావడం వల్ల పేజీలో సరిపోయేది కాదు, మరో పేజీలో తరువాయి భాగం అని రాయడానికి నార్ల వారి నిబంధనలు ఒప్పుకునేవి కావు. మధ్య మధ్యలో కొన్ని పదాలు, మార్చడం, లేదా వాక్యాలు తీసివేయడం చాలా కష్టంగా వుండేది. అనుభవలేమి కారణంగా, రచయితలు పంపిన వ్యాసాలలో చివరి పేరాలు తీసేసేవాడిని, పేజీలో పట్టడానికి వీలుగా.
ఈ విషయం నండూరి వారి దృష్టికి వచ్చినట్టుంది. నన్ను పిలిచి చెప్పారు.
‘శ్రీనివాసరావు గారు! ఒక విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ప్రతి రచయితకు తాను రాసిన ప్రతి రచన సొంత బిడ్డలాంటిది. వాటిని మన వీలుసాలు కోసం ఇష్టం వచ్చినట్టు మారిస్తే వాళ్ళ మనసు బాధ పడుతుంది. కావాలంటే నా ఎడిటోరియల్ తగ్గిద్దాము. అంతే కాని రచయితలను మనస్తాపానికి గురిచేయవద్దు’
ఆయన ఇదే విషయాన్ని మరోలా అంటే దాష్టీకంగా చెప్పవచ్చు. కానీ ఆయన తరహా వేరు. చాలా సూటిగా, సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ రోజులకు, అలాంటి ఎడిటర్లకు శత సహస్ర వందనాలు
(15-08-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి