5, ఆగస్టు 2021, గురువారం

“కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం”

 

(Published in Andhra Prabha Daily)

సూటిగా.. సుతిమెత్తగా... భండారు శ్రీనివాసరావు

“కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం” అంటూ గత కొన్ని దశాబ్దాలుగాఅంతర్జాతీయ వేదికలపై భారత దేశం చేస్తూ వస్తున్న ఈ వాదన రెండేళ్ల క్ర్తితం వాస్తవ రూపంలో మనముందు నిలిచింది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకావడంతో ఇది సాధ్యపడింది.

మనదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇద్దరు ప్రధాన మంత్రులు వుండేవారు అనే సంగతి బహుశా నేటి తరంలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే స్వతంత్ర భారతంలో స్వయంగా రూపొందించుకున్న రాజ్యాంగం అదే దేశంలో ఒక రాష్ట్రం అయిన జమ్మూ కాశ్మీర్ లో వర్తించదు అనే వింత పోకడ ఒకటి ఉండేదని ఆ రోజులు గురించి తెలిసిన వారికి బాగా జ్ఞాపకం.

ఈ విచిత్రమైన రాజకీయ పరిస్థితికి కారణం రాజ్యాంగంలో పొందుపరచిన 370వ అధికరణం. దీనిద్వారా సంక్రమించిన విశేషమైన అధికారాలతో జమ్మూ కాశ్మీర్, భారతదేశంలో అంతర్భాగంగా వుంటూనే కొన్ని ప్రత్యేక హక్కులను దశాబ్దాల తరబడి అనుభవిస్తూ వచ్చింది. ఈ కారణంగానే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రధాన మంత్రి పదవి, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, ప్రత్యేక పౌరసత్వం,  దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోను లేనన్ని ప్రత్యేక హక్కులు.

370 వ అధికరణాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ రకంగా చూసినా చారిత్రాత్మక నిర్ణయమే. ఈ అధికరణం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కలగచేస్తూవచ్చింది. ప్రసిద్ధ రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్టు ‘అందరూ సమానమే, కాకపొతే వారిలో కొందరు ఎక్కువ సమానం” అనే పద్దతిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొన్ని రాజకీయ పరిస్థితులు, మరి కొన్ని రాజకీయ అవసరాలు, ఒత్తిడుల కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే కొన్ని ప్రత్యేక హక్కులను, అపరిమితమైన  అధికారాలను అనుభవిస్తూ వచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దరిమిలా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం కూడా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది. రాష్ట్రాల నడుమ అసమానతలను తొలగించినట్టు అయింది.

370వ అధికరణం వున్న కాలంలో దేశంలో మరెక్కడా లేని విధంగా జమ్మూ కాశ్మీర్ పౌరులు రెండు విధాలైన పౌరసత్వాలను అనుభవిస్తూ వచ్చారు. ఒకటి కాశ్మీర్ పౌరసత్వం కాగా మరోటి భారత దేశ పౌరసత్వం. ఈ అధికరణం తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నివసించే ప్రజలు సైతం ఇతర దేశ ప్రజల మాదిరిగా ఒకే ఒక పౌరసత్వం అదీ భారత పౌరసత్వం మాత్రమే కలిగివుంటారు.

ఈ అధికరణం కారణంగా విచిత్రంగా కానవచ్చే మరో విషయం  ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగాన్ని అనుమతించడం. అంతేకాదు, ఆ రాష్ట్రానికి విడిగా సర్వంసహా అధికారాలు దఖలు పరచడం. సొంత చట్టాలను చేసుకుని అమలుచేసే అవకాశం కల్పించడం. ఆ రాష్ట్రం శాసనసభ అనుమతిస్తే తప్ప కేంద్ర శాసనాలు సైతం అక్కడ అమలుకు నోచుకోని దుస్థితి.

ఒకే దేశంలో ఒక రాష్ట్రంగా వుంటూనే జమ్మూ కాశ్మీర్ ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రత్యేక హక్కులు అనుభవిస్తూ వచ్చింది. మరి ఇన్ని ప్రత్యేకతలను రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రానికి దఖలు పరచిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, భారతదేశంలో అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న వాదనలలో డొల్లతనం వున్నట్టు అంగీకరించడమే అవుతుంది కదా! 

 

 

అంచేతనే, ఈ అసమానతలకు భరతవాక్యం పలుకుతూ మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ అధికరణాన్ని రద్దు చేసింది. తద్వారా, రాష్ట్రాల నడుమ అసమానతలకు స్వస్తి పలికింది.

 

దీనికి పూర్వం అక్కడి ప్రజలకు వున్న ప్రత్యేక హక్కులు ఇన్నీ అన్నీ కావు. ఆ రాష్ట్రంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఆ రాష్ట్ర ప్రజలకే వీలు. బయటివారు జమ్మూ కాశ్మీర్ లో భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయడానికి పూర్తిగా అనర్హులు. ఇప్పుడు ఈ వివక్షకు తెర పడింది.

 

మరో విడ్డూరమైన సంగతి ఏమిటంటే ఆ రాష్ట్రానికి విడిగా ఒక అధికారిక పతాకం వుంది. ఇప్పుడు ఆ రాష్ట్రానికి కూడా మిగిలిన దేశంతోపాటుగా ఒకే ఒక జాతీయ జండా. అది, త్రివర్ణ పతాకం.

లోగడ జమ్మూ కాశ్మీర్ శాసనసభ పదవీ కాలం ఆరేళ్లు. ఈ అధికరణం తొలగింపు తర్వాత అక్కడ కూడా అయిదేళ్లకు పరిమితం అయింది.

దేశం మొత్తంలో ముస్లిం జనాభా అల్పసంఖ్యాక వర్గానికి చెందినది అయితే, జమ్మూ కాశ్మీర్ లో మాత్రం వీరు జనాభాపరంగా అధిక సంఖ్యాకులు. అక్కడ హిందువులు, సిక్కులు అల్ప సంఖ్యాకులు. అధికరణం తొలగించిన తర్వాత  ఈ అల్ప సంఖ్యాకులకు పదహారు శాతం రిజర్వేషన్లకు అవకాశం లభించింది.

సమాచార హక్కు చట్టం దేశం మొత్తంలో వర్తించే శాసనం అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇది వర్తించేది కాదు. ఇప్పుడు ఆ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ లో వర్తించే చట్టంగా మారిపోయింది.

ఇంతకు  ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో లధాక్ అనే ప్రాంతం ఒక భాగంగా వుండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి, విడిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి దాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు చేశారు. కాకపొతే జమ్మూ కాశ్మీర్ కు శాసన సభ వుంటుంది, లదాక్ విషయంలో శాసన సభ అంటూ వుండదు. అంతే తేడా!

 

తోకటపా:

ఎటూ కాశ్మీర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక జోక్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.

కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత పౌరాణిక ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో సంచారం చేస్తుండగా ఒకచోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి, అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”

భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.

అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”

అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”

ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు. (05-08-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి