1, ఆగస్టు 2021, ఆదివారం

సూటిగా .... సుతిమెత్తగా...

 బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు

'బుడ్గూ' అంటాడు గోపాళం

'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ

'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు

'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణగారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం 

'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ

శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.

అలానే దేవుడు! 

దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అంటారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'

దేవుడి పేరుపెట్టి మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.

దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.

'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని, అన్నీ ఆయనకే ఒదిలి చాప చుట్టేయడం ఇంకా పనికిమాలిన పని.

దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.

వున్నాడని నమ్మేవాళ్ళంటారు.

దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.

వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా  దేవుడిని నమ్మేవారు రెండో రకం. వీరు కూడా తాము నమ్మే భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. టీవీ ఛానళ్ల వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటే వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.

దేవుడున్నాడో లేదో కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.

వ్యర్దవాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ మాటకూడా ఆయనే చెప్పాడు గీతలో. ‘మీ పని మీరు చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి’ అని.

నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు, వారు నాస్తికులయినా సరే, సర్వశక్తి కలిగిన ఓ అగోచర శక్తి ఒకటి  వుండేవుంటుందని  అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు, ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.

ఒక్కోసారి దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు ఆ మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)

‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?

‘చెట్టులో, పుట్టలో అంతటా నేనే’ అన్నా చెవినపెట్టే దెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.

గుడిలో  ఆయన్నికొలువుంచినంతమాత్రాన ఆయన అక్కడే వుండిపోడు. ‘ఇక్కడ వుండే పాండురంగడు అక్కడ వున్నాడు’ అన్నట్టు దేవుడు మందిరంలో ఉంటాడు, నమ్మిన వారి మనోమందిరంలోను ఉంటాడు. మరి ప్రత్యేకంగా ఆయనకు ఓ గుడి ఎందుకు అనే ప్రశ్న వస్తుంది తప్పదు.

దేవుడిమీద గురి కుదరడం కోసం గుడి. ప్రశాంత, ఆధ్యాత్మిక  వాతావరణంలో దేవుడి మీద ఏకాగ్రత నిలుపుకోవడం కోసం. ఆయన అక్కడ వున్నాడు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్లి ఓ దండం పెట్టుకుంటాం.

అసలు గుడి రహస్యం వేరే వుంది అనేవారి  వాదన వేరు.  

మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పరమ పాతరోజుల్లో పులిహారో, పాయసమో చేసి గుడికి వచ్చిన జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.

ఆ పాతకాలపు రోజుల్లో పల్లెల్లోని వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు పైకం చేతిలో పెడితే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో ప్రసాదంగా లభించే పులిహారో, దద్దోజనమో, దాన్నిమించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.

ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.

అలాగే గుడి అనేది తెలియని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చే బడి కూడా. వూరి జనం నలుగురూ అరమరికలు లేకుండా ఒకచోట కలుసుకోవడానికి గుడిని మించిన సామాజిక వేదిక  వేరేమివుంటుంది. పంచాంగ శ్రవణం పేరుతొ  వానలు ఎలా పడతాయి, ఏ పంటలు వేసుకుంటే గిరాకీ వుంటుంది అనే వివరాలు తెలిసేవి. వాటిని నమ్మొచ్చా అంటే మరి ఆ రోజుల్లో పంచాంగమే వారికి గూగులమ్మ. గుడి పూజారే చిన్నాచితకా రోగాలను నిదానం  చేసే వైద్యుడు. వాళ్లకు వైద్యం ఏమి తెలుసు ఇది పూర్తిగా అనాగరికం అంటే మరి  ఆ పల్లె జనం ఏం చేయాలి? ఎక్కడకు పోవాలి? చదువుకున్న డాక్టర్లు పల్లెటూళ్ళకు పోరు. ఊరిజనం పట్నాలకు పోలేరు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే నానుడి లాగా. 

    

గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.

అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే. 

ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. మరో మతానికి చెందిన దైవ మందిరం కావచ్చు.

అవి ఏవైనా, నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.

కాబట్టి దేవుడ్ని గుడికి పరిమితం చేయవద్దు. గుడిని పెత్తందార్లకు వదిలేయవద్దు.

(ఈరోజు ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)


Clipping of Andhra Prabha Telugu Daily - Hyderabad Main (prabhanews.com)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి