26, జులై 2021, సోమవారం

దేవుడ్ని ఒదిలేయండి! - భండారు శ్రీనివాసరావు

 బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు

'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం
'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
అలానే దేవుడు!
దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అంటారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'
దేవుడి పేరుపెట్టి మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే, చాలు మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.
'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని అన్నీ ఆయనకే ఒదిలి చాప చుట్టేయడం ఇంకా పనికి మాలిన పని.
గజేంద్ర మోక్షం పద్యాలు రాస్తున్నప్పుడు భక్త పోతన్న గారికే అనుమానం వచ్చింది, 'కలడు కలండనెడి వాడు కలడో లేడో' అని.
మనమనగానెంత?
వ్యర్దవాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ దేవుడే చూసుకుంటాడు.
అంచేత ఆయన మానాన ఆయన్ని ఒదిలేయండి.
ఎందుకంటే,
దేవుడు మనలాగా కాదు. ఆయనకి బోలెడు పనులుంటాయి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి