2, జులై 2021, శుక్రవారం

ఆత్మ విశ్వాసం

 ఏకాంబరరానికి దిక్కు తోచడం లేదు. వున్నదంతా వ్యాపారంలో పెట్టాడు. కాలం కలిసిరాలేదు. లాభాలమాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబళ్ళు కూడా  వెనక్కి రాలేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫోను మోగితే అప్పులవాళ్లేమో అని భయం. తలుపు తడితే తీయడానికి సంకోచం, అప్పిచ్చిన వాళ్లు ఏకంగా ఇంటి మీదికే వచ్చేరేమో అని. ఒక్కోసారి ఆర్ధిక  ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా మదిలో మెదిలేది.

దిక్కు తోచని ఏకాంబరం ఓ రోజు మధ్యాన్నం నిర్మానుష్యంగా పార్కుకు వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. మొహం చూస్తే ఎక్కడో చూసిన మొహమే అనిపించేలా వుంది.  సూటూ బూటూ డబ్బున్న వాడి మాదిరిగానే కనిపించాడు. ఆ వచ్చిన వాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏకాంబరానికి అతడెవరో తెలియగానే మతి పోయింది. ఆ వృద్ధుడు ఆ వూర్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే అత్యంత ధనికుడు. దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు వున్నాయి. అతడిలా అన్నాడు.

'చూడండి. మీరేదో ఇబ్బందుల్లో వున్నట్టున్నారు. ఆర్ధిక సమస్య అయితే నాకు ఒదిలేయండి' అంటూ మాట్లాడుతూనే జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి చెక్కుపై సంతకం చేసి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. 'సరిగ్గా ఏడాది తరువాత ఇదే పార్కులో కలుద్దాం. వడ్డీ అవసరం లేదు కాని అసలు మాత్రం ఇవ్వండి చాలు'

చెక్కు చేతిలో పెట్టి అతడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

తీసి చూస్తే పాతిక లక్షలకు రాసిన చెక్కు అది. అప్పులు తీర్చగా  ఇంకా కొంత మిగులుతుంది కూడా. ఏదయితేనేం భగవంతుడు,  వృద్ధుడి రూపంలో వచ్చి  తనకో దారి చూపించాడు.

ఇంటికి వెడుతూ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో అతడికి మరో ఆలోచన వచ్చింది. పాతిక లక్షల చెక్కు. అదీ దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడు ఇచ్చిన చెక్కు. అది తన జేబులో వుంది. ఇక దేనికీ భయపడాల్సిన పనిలేదు. ముందు వ్యాపారవ్యవహారాలు చక్కదిద్దాలి. ఎటొచ్చి ఎటు పోయినా రామబాణం వంటి చెక్కు తన దగ్గరే  వుంది.

ఆ వూహ అతడిలో ఆత్మ విశ్వాసం నింపింది. ఇక ఆ రోజు నుంచి అతడి తరహా తీరు పూర్తిగా  మారిపోయాయి. చెక్కు ఇచ్చిన ఆత్మ బలంతో అతడు ముందుకు అడుగులు వేసాడు. వెనుకటి ఆత్మన్యూనతా భావం మచ్చుకు కూడా కానరాకుండా పోయింది. ఆత్మవిశ్వాసంతో సాగించిన  అతడి వ్యాపారానికి కూడా తిరుగు లేకుండా పోయింది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చాడు.

చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగింది. వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెక్కు తీసుకుని అదే పార్కుకు వెళ్ళి అదే బెంచీ మీద కూర్చుని ఎదురుచూడ్డం మొదలు పెట్టాడు. అనుకున్నట్టే వృద్ధుడు వచ్చాడు. 'మిత్రమా యెలా వున్నావు? కులాసాయేనా'  అని కుశల ప్రశ్నలు వేసాడు. 'మీ దయవల్ల బాగున్నాను. పోతే, మీ చెక్కు ఉపయోగించుకునే అవసరం పడలేదు' అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టి దణ్ణం పెట్టాడు ఏకాంబరం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు మగ నర్సులు వచ్చారు. 'ఇక్కడ వున్నావా మహా ప్రభూ! నీకోసం ఆసుపత్రి అంతా వెతుకుతున్నాం' అంటూ  ఏకాంబరం వైపు చూసి చెప్పారు. 'నేను పలానా పలానా. గొప్ప ధనికుడ్ని. డబ్బేమన్నా కావాలా అని అడిగాడా! అడిగేవుంటాడు. అతడికి ఇది మామూలే. ఎందుకంటే  ఇది మామూలు పిచ్చి కాదు' అంటూ ఆ వృద్ధుడిని బలవంతాన తీసుకుపోయారు.

ఏకాంబరం నివ్వెరపోయాడు. ఎంతో ధనికుడు అనుకున్న ఇతడు పిచ్చివాడా. అతడిచ్చింది చెల్లని చెక్కా!'

కానీ ఆ తరువాత ఆలోచిస్తే ఆ పిచ్చివాడి రూపంలో అతడికో జీవిత సత్యం బోధపడింది.

ఆ చెక్కు వుందన్న భరోసాతో అతడు వ్యాపారంలో ముందుకు సాగాడు. 'అవసరం అయినప్పుడు అదే ఆదుకుంటుంది' అన్న 'నమ్మకం' అతడ్ని ముందుకు నడిపించింది. ఆ ఆత్మ విశ్వాసం ఎంతో కలిసివచ్చింది. పట్టింది బంగారం అయ్యింది. అప్పుడే ఆ చెక్కు బ్యాంకులో వేసి వుంటే అసలు విషయం తెలిసిపోయేది. కధ అక్కడే పూర్తిగా ఆగిపోయేది.

భగవంతుడు కూడా అలాటి భరోసానే. ప్రతిదానికీ దేవుడ్ని వాడుకోవాలని చూడకుండా ఆయన మన వెంటే వున్నాడనే నమ్మకంతో ముందుకు వెడితే అంతా బాగుంటుంది. మనిషి కృషికి దేవుడు అనబడే ఓ కానరాని అదృశ్య శక్తి అండ ఎప్పుడూ  వుంటుంది.

NOTE: పైన కధకి, కింద ఫోటోకి సంబంధం ఏమిటి అనే సందేహానికి నా సమాధానం. Adsense ద్వారా వచ్చే ఆదాయం అంత త్వరగా పెరగదు. సింగిల్ డిజిట్ నుంచి వంద దాటేవరకూ ఎలాంటి పేమెంట్లు ఉండవని ఒక అనుభవశాలి చెప్పారు. చూద్దాం. ఇప్పుడు కాకపొతే, రేపు, రేపు కాకపొతే మరో రోజు. కధలో చెప్పిన ఆత్మ విశ్వాసం వుంటే సాధించడం తేలిక కాకపోయినా మరీ అంత కష్టం కూడా కాదేమో!



 

2 కామెంట్‌లు: