9, జూన్ 2021, బుధవారం

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

 సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన ‘గణపతి రామాయణ సుధ’ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు. ఎలా అని గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు. ఇంతవరకు చూడనూ లేదు)

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి