“ఇదిగో! పీతాంబరం వచ్చాడు. హడావిడి పడి కాఫీ తేవద్దు” వంటింట్లోకి కేకేసి చెప్పాడు ఏకాంబరం.
తర్వాత గొంతు తగ్గించి పీతాంబరంతో అన్నాడిలా.
“మా ఆవిడ మరీ ఉద్దాలకుడి భార్య లాగా ప్రవర్తిస్తోంది”
“ఉద్దాలకుడా! అతడెవ్వడు” అడిగాడు పీతాంబరం.
“ఉన్నాడులే పురాణ కధల్లో ఒకడు. శుద్ధ బుద్ధావతారం. అతడేమి అన్నా భార్య ఒప్పుకోదు. పైగా తద్విరుద్ధంగా చేస్తుంది. అన్నం పెట్టు అని అడిగితే అన్నం గిన్నె నేలకేసి కొడుతుంది.”
“అది సరే. అది కధ. మీ ఆవిడ సంగతేమిటి ! అది చెప్పు ముందర” అన్నాడు పీతాంబరం, ఏకాంబరం భార్య తెచ్చి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ.
ఆమె లోపలకు వెళ్ళగానే అన్నాడు ఏకాంబరం.
“ఏం చెప్పను! మా ఆవిడదీ అచ్చంగా అదే వరస. నేను ఏది చెప్పినా దానికి విరుద్ధంగా చేస్తుంది. అందుకని ఓ ఉపాయం కనిపెట్టాను”
“ఏమిటది?”
“స్నానానికి నీళ్ళు పెట్టు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు స్నానానికి నీళ్ళు వద్దు అని చెబుతాను. అంతే! ఆవిడ చక్కగా గంగాళం వేన్నీళ్ళు సిద్ధం చేస్తుంది. ఈ కిటుకు తెలిసిన తర్వాత నా పని సులువైంది. నాకు ఏది కావాలో అది వద్దు అని చెబుతాను. దానితో నాకు ఏది కావాలో అది చేసి పెడుతోంది”
“బాగుందే ఈ టెక్నిక్. అధికారంలో వుండే వాళ్ళు కూడా ఇదే పని చేస్తే సరి పోతుంది. వాళ్ళు ఒక పని తలపెట్టి నప్పుడు దానికి విరుద్ధంగా చేయబోతున్నామని చెప్పాలి. ప్రతిపక్షాల వాళ్ళు కాదూ కూడదు అంటారు. పైగా అధికార పక్షం మనసులో పెట్టుకుని బయటకు చెప్పని ఆ పని చేయమని కూడా నానా యాగీ చేస్తారు. అప్పుడు ఆ పని చేసారనుకో, ప్రతిపక్షం చెప్పింది ఒప్పుకున్నట్టు అవుతుంది. తాము చేయాల్సింది చేసినట్టూ అవుతుంది” చెప్పాడు పీతాంబరం తాపీగా కాఫీ తాగి కప్పు కింద పెడుతూ.
(24-06-2021)
చెప్పిన దానికి విరుద్ధంగా చేసే ఆవిడ కాఫీ బదులు కాఫీ కప్పులో చారు పోసి తెస్తుందేమో అనుకున్నా.
రిప్లయితొలగించండిఉద్ధాలకుడు ఒకసారి ఇదేవిధంగా తనతండ్రి తద్దినం శాస్త్రోక్తంగా ఎలానిర్వహించాడో, చివరికి ఒక్కపొరపాటున ఎలా బోల్తా పడ్డదీ మంథనివాళ్లు వైనస్యవైనంగా చెప్పుకుంటారు. కథ వాస్తవమో కాదో కానీ ఇప్పటికీ అటువంటి భార్యలతో వేగుతున్నవారు అనేకమంది...
రిప్లయితొలగించండి