1, జూన్ 2021, మంగళవారం

మరణించే హక్కు

 హిందూ దినపత్రికలో వచ్చిన వార్త ఇది. అంచేత ఉత్ప్రేక్షలకు అవకాశం ఉండకపోవచ్చు.

ఈ పత్రిక రాసిన దాని ప్రకారం, చిత్తూరు జల్లా లోని ఒక పేద కుటుంబానికి ఎక్కడలేని కష్టం వచ్చి పడింది. అయిదేళ్ళ బాలుడికి బోన్ కేన్సర్. ఎక్కడలేని డబ్బు నయం కాని ఆ వ్యాధికి ఖర్చు చేస్తూ ఆర్ధికంగా, మానసికంగా చితికిపోయారు. దానితో తమ కుమారుడికి మరణం ప్రసాదించి అతడు పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయాల్సిందని పుంగనూరు కోర్టు తలుపు తట్టారు. కోర్టు వారి కేసు విచారించి అప్పీలును త్రోసిపుచ్చింది. కాకపోతే ఆ కేసును జిల్లా అధికార యంత్రాంగానికి నివేదించింది. ఇది ఇలా సాగుతుండగానే ఆ పిల్లవాడు గత ఆదివారం రాత్రి మరణించాడు.
అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.
‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.
ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణభీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.
జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు మనిషిని వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.
కొందరి మరణాలు కళ్ళారా చూసినప్పుడు ఇటువంటి చావు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. కొందరు అత్యంత సునాయాసంగా జీవితాన్ని చాలించినప్పుడు ఇలాంటి మరణం సిద్ధిస్తే యెంత బాగుండు అని వయసు పైపడినవారు అనుకోవడం కద్దు.
‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు కావాలి. శతమానం భవతి అంటూ నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.
పొద్దునపొద్దున్నే ఈ వేదాంతపు కబుర్లు చెప్పుకోవడానికి ‘యూధనేసియా’ అనే గ్రీకు పదం కారణం. దీనికి తెలుగు మీడియా చేస్తున్నసమానార్ధక అనువాదం ‘కారుణ్య మరణం’.
ఒక వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు ‘కారుణ్య మరణం ఎంచుకునే అవకాశం అతగాడికి వుండాలనేది ఒక వాదన. వెంటిలేటర్ల వంటి కృత్రిమ వ్యవస్థల ద్వారా అతడి ఆయుర్దాయాన్ని కొంత కాలం పెంచడానికి ఆధునిక వైద్యం ఉపకరించవచ్చు కానీ, తద్వారా ఆ రోగి శారీరక బాధను కూడా పొడిగించినట్టే అవుతుంది. కాబట్టి, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినబడుతోంది. జీవించే హక్కులో, గౌరవంగా మరణించే హక్కు కూడా మిళితమై వుంటుంది కనుక, నయం కాని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి కారుణ్య మరణాలను ప్రసాదించే విధంగా చట్టాలు చేయాలనీ కొన్ని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.
కారుణ్య మరణాలపై దేశ వ్యాప్తంగా చాలా ఏళ్ళుగా చర్చ సాగుతూనే వుంది. వీటిపై అనేక వార్తా కధనాలతో పాటు, ఈ కధాంశంతో కొన్ని నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. కొన్నేళ్ళ క్రితం మరణించిన అరుణా షాన్ బాగ్ అనే మహిళ దీన గాధను కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే వారు ఉదహరిస్తుంటారు. చిన్నవయస్సులోనే దారుణమైన లైంగిక అత్యాచారానికి గురై నలభై రెండేళ్ళ పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవచ్చంలా బతికి కన్నుమూసిన ఈ మహిళ తరపున జరిగిన న్యాయపోరాటం యావత్తు ఈ కారుణ్య మరణాలకు సంబంధించినదే.
సీవీ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే మాదిరి సిఫారసు చేసింది. అరుణా షాన్ బాగ్ అనే ఆ నర్సు మాదిరిగా జీవచ్చవంలా బతుకు ఈడ్చే స్థితికి చేరుకున్నవారికి, కోమాలోకి వెళ్ళిపోయి, తిరిగి ఎంతమాత్రం స్పృహలోకి వచ్చే అవకాశం లేదని నిర్ధారణ అయిన రోగులకి, కారుణ్య మరణం ఎంచుకునే వీలు కల్పించాలని అప్పట్లోనే లా కమిషన్ సూచించింది.
ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.
సరే ఈ విషయం పక్కనబెట్టి అసలు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వడం వల్ల లాభనష్టాలు గురించి ఆలోచిద్దాము. మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు ఇది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో మంచానికి బందీగా మారి కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ కారుణ్య మరణం అనేది ఒక విముక్త మార్గంగా కనిపించవచ్చు.
అయితే కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించడం వల్ల సమాజంలో కొంతమందికి మాత్రమే ఊరట. అదెలా అంటే:
పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంతతత్వం మరింత పెరుగుతూ వుంటుంది. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా మానవ మనస్తత్వం ఈ విధంగానే ఆలోచిస్తూ వుంటుంది అనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్ ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారకుండా వుండే విషం కోసం అన్వేషించి ఒక రకం సర్పాన్ని అందుకోసం ఎంపికచేసుకుంటుంది. చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై, ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.
పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం అందరికీ దక్కదు.
శరీరం రోగగ్రస్తమై, నివారణ కరువై, అహరహం చావుకోసం చకోరపక్షుల వలె కన్నుల్లో వత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూసేవారికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, కోర్టులు పరిశీలిస్తున్న ‘యుధనేసియా’ అంటే సునాయాస మరణ ప్రాప్తి అనేది నిజంగా వరమే.
ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం. ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది గొంతెమ్మ కోరికే. అయినా ఆలోచించాల్సిన విషయం.

ఉపశ్రుతి: మా చుట్టం ఒకరు బీ ఎస్ ఎన్ ఎల్ లో అధికారిగా పనిచేస్తున్నారు. వయసు 57. ఆఫీసులో పై అధికారి సిబ్బందికి ఇచ్చిన లంచ్ మీటింగ్ కు హాజరై ఇంటికి వచ్చారు. దుస్తులు మార్చుకుని వచ్చి టీ తాగుతూ అలాగే పక్కకి ఒరిగిపోయారు. మాసివ్ హార్ట్ అటాక్. అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా లేవు. అయినా కూడా ఆయన జీవన యానం అలా హాయిగా, ప్రశాంతంగా ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని అరుదయిన అవకాశం.
సాధ్యం కాదని తెలిసినా వయసుమళ్ళిన వాళ్ళలో చాలామంది కోరుకునేది ఇదే.
ముఖ్యంగా కరోనా కాలంలో.
(01-06-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి