20, జూన్ 2021, ఆదివారం

మా నాన్నగారు – కాఫీ మిషన్ - భండారు శ్రీనివాసరావు

 

మా నాన్నగారు  భండారు  రాఘవరావు గారు నా నాలుగో ఏటనే మరణించడం వల్ల ఆయన జ్ఞాపకాలు అంటూ ఏమీ లేవు. అది నా దురదృష్టం. కాకపోతే ఆయన గురించి మా కుటుంబంలోని ఇతర పెద్దలు చెప్పిన విషయాలే కొన్ని గుర్తు వున్నాయి.

వాటిల్లో ఇదొకటి. 

“.......మా నాన్నగారు కాఫీని మొదటిసారి మా వూళ్ళో ప్రవేశపెట్టారనవచ్చు. 

మా ఇంట్లో కాఫీ పొడి మిషన్ వుండేది.  ఓసారి చెన్నపట్నం  వెళ్ళినప్పుడు  మా నాన్నగారు దాన్ని కొనుక్కుని వచ్చారని మా పెద్దవాళ్ళు చెప్పుకోగా విన్నాను.


బెజవాడ వెళ్లినప్పుడల్లా ఆయన అక్కడనుంచి  కాఫీ (గుండ్లు) గింజల్ని కొని తీసుకువచ్చి, ఆ పచ్చి గింజల్ని వేయించి, ఏరోజుకారోజు ఆ మిషన్లో వేసి, చేత్తో తిప్పేవారట. కొంత బరకగా వున్నా, మొత్తం మీద కాఫీ పొడుం ఇంట్లోనే తయారయ్యేది. ఆరోజుల్లో ఫిల్టర్లు లేవు. వేన్నీళ్ళలో ఆ కాఫీపొడుం వేసి, గిన్నెలో  మరిగించి, గుడ్డలో వడపోసి పాలూ పంచదార వేసుకుని ఇత్తడి జాంబు (గ్లాసు)లో పోసుకుని తాగేవారు.

మా నాన్నగారే పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకుని తాను  తాగి కొంత మా అమ్మగారికి ఉంచేవారట.

తోకటపా: సుధామ గారు మా నాన్నగారి ఫోటో అడిగారు. డెబ్బయి ఏళ్ళకు పూర్వం మా వూర్లో ఫోటోగ్రఫీ అంటే ఏమిటో తెలియదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు హైదరాబాదులో ఒక ఆర్టిస్టును వెతికి  పట్టుకుని, మా నాన్నగారు ఎలా ఉంటారో, ఆ రూపురేఖలు ఉజ్జాయింపుగా చెప్పి, ,ఆయన చేత ఒక  ఊహాచిత్రం గీయించారు.

అదే ఇది:



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి