10, జూన్ 2021, గురువారం

కలల లోకంలో కాసేపు – భండారు శ్రీనివాసరావు

 

పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. 2010లో  ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది. 

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.


ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి. 

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు. 

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?


(మా మనుమరాళ్ల స్కూలు వద్ద నేనూ, మా ఆవిడా. ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్ధులు)

(2010)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి