29, జూన్ 2021, మంగళవారం

84 ఏళ్ళ క్రితం ఎన్నికల ప్రచార కరపత్రం

 1937 అంటే స్వాతంత్రానికి పదేళ్లు పూర్వం బ్రిటిష్ హయాములో జరిగిన ఎన్నికల్లో పంచిన ప్రచార పత్రం.

పోటీ చేసే అర్హత నాకు వుంది, నాకు ఓటు వేసే బాధ్యత మీకు వుంది అనే తరహాలో సాగిన ప్రచారం. ఇప్పుడో. మీరు ఓటరు దేవుళ్ళు. మీరు ఓటు వేస్తె నేను గెలిచి మీకు సేవ చేసుకుంటా అనే తీరులో వుంటాయి, ప్రచారాలు.
Note: పైన ఎన్నికల కరపత్ర నమూనా అంటున్నారు. కొంచెం Fact Check చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది



ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. ని కడుపుబ్బ నవ్వించిన 104 కాల్ సెంటర్ ఉద్యోగిని


ఈరోజు చాలా ఛానళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన దిశ యాప్ ప్రచారకార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నప్పుడు, ఎప్పుడో పుష్కర కాలానికి ముందు రాజశేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్యక్రమం గుర్తుకు వచ్చింది. సత్యం ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో హెచ్.ఎం.ఆర్. ఐ. రూపకల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వచ్చారు.
ముందుగా అసలు ఏమిటి ఈ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా వుంటుంది.
సమస్యలు అనేకం – సమాధానం ఒక్కటే!
ఆ జవాబే 104
కాంతమ్మకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. యెంత పట్టుకున్నా వంకర్లు తిరిగిపోతోంది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేడు. టైము చూస్తే అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కాని డాక్టరు దొరకడు. దిక్కు తోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు.
మూర్తికీ శైలజకూ కొత్తగా పెళ్లయింది. హానీమూన్ కి వెళ్లి వస్తుంటే దారిలో కారు చెడిపోయింది. దానికి తోడూ వర్షం. ఏం చెయ్యాలో తెలియని స్తితిలో దగ్గరలో వున్న టీ స్టాలుకు వెళ్ళారు. కారు రిపేరు పూర్తయ్యే సరికి తాగిన టీ వికటించిందేమో మూర్తికి వాంతులు మొదలయ్యాయి. కొత్త పెళ్లి కూతురికి భయంతో చెమటలు పట్టాయి. ఏడవడం తప్ప ఏం చెయ్యాలో తెలియని పరిస్తితి.
రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వచ్చింది. వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుందన్నమాటే కాని, డాక్టరు కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది కూడా యధా రాజా తధా ప్రజా బాపతు. మందులు మచ్చుకు కూడా దొరకవు. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క మనుమడికి కాలిపోయే జ్వరం. చూపిద్దామంటే డాక్టరు లేడు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. కానీ ఎవరి మీద చూపించాలి ఆ కోపం? ఎవరికి పిర్యాదు చేయాలి పాపం.
వెంకటరావు వుంటున్న ఊరు ఓ మోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద డాక్టర్లు వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే పెద్ద డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్లి, పెద్ద ఫీజు చెల్లించి, పెద్దవైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని మందులు ఆ వూళ్ళో యెంత ప్రయత్నించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలవక తల పట్టుకున్నాడు వెంకటరావు.
ఇలాంటి కాంతమ్మలూ, మూర్తులూ, శైలజలూ, రామనాధాలు, వెంకటరావులు ఇంకా ఎంతమందో. అందరిదీ ఒక సమస్య కాదు. కానీ ఏం చెయ్యాలి అన్నదే అందరి సమస్య.
అప్పటి ప్రభుత్వం నిపుణులను సంప్రదించి, ఎంతో ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుంది. అదే 104.
ఇదొక టోల్ ఫ్రీ నెంబరు. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నెంబరుకు ఉచితంగా ఫోను చేయవచ్చు. ఈ కేంద్రంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వుంచారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్సరే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగు హోములు, ఇలా అన్ని వివరాలు సిద్ధంగా వుండడం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ, ఎక్సరే, స్కానింగు వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ, ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు వున్నదీ ఇటువంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం వున్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసుకుని ఒక నెంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కేంద్రంలో కంప్యూటర్ తెరపై సిద్ధంగా వుంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుంటుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటికప్పుడు చేయాల్సిన ప్రధమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియపరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108 కి తెలియపరచి అంబులెన్సు పంపిస్తారు.
స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు.
ఇక అసలు విషయం చెప్పుకుందాం.
ముఖ్యమంత్రి రాజేఖర రెడ్డి గారు సమయానికి వచ్చారు. ఈ పధకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నెంబరుకు ఫోన్ చేశారు.
అవతల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది.
“104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?”
ముందు కంగు తిన్నా ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది.
“ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?”
వై.ఎస్. ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వులతో నిండిపోయింది.
(29-06-2021)

సంతకం ఖరీదు అయిదు రూపాయలు – భండారు శ్రీనివాసరావు

ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..

అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరికలేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.
తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.
కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.
నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.
నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.
కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.
తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’

28, జూన్ 2021, సోమవారం

చూసయినా నేర్చుకుందామా?- భండారు శ్రీనివాసరావు

 

ఇది జరిగి చాలా ఏళ్ళయింది.
అదొక సువిశాల భవన ప్రాంగణం.
సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు. ఇంతలో ఓ పొడవాటి నల్లటి మోటారు వాహనం అక్కడికి చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు. కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి, రెండు అడుగులు ముందుకు వేసి కారులోనుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ద్వారం వైపు చేయి చూపించి ఇతర అతిధుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న అనేక టెలివిజన్ కెమెరాలు దాన్ని ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. (రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో 2013 లో జరిగిన ఇరవై దేశాల అగ్ర నాయకుల సదస్సు (G-20) లో పాల్గొనడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అక్కడికి వెళ్ళినప్పటి ముచ్చట ఇది)
ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే చెప్పనక్కరలేదు కూడా.
మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది. ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు సయితం కళ్ళు తిరిగే హడావిడి. మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే.

27, జూన్ 2021, ఆదివారం

ఆడవారికి అంకితం – భండారు శ్రీనివాసరావు

 

యావత్ ప్రపంచంలో అతి గొప్ప సంపద సృష్టిస్తోంది ఆడవాళ్ళు. సందేహపడనక్కరలేని వాస్తవం ఇది.

ఎప్పుడో మూడేళ్ల క్రితం నేను  పాల్గొన్న ఓ టీవీ చర్చ వీడియో ఎవరో పంపగా చూశాను. వారికి కృతజ్ఞతలు.

ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అనే అంశంపై చర్చ. దురదృష్టం, ఆ చర్చలో ఒక్క మహిళ కూడా లేరు. అలా కావాలని చేయరు. పత్రికల్లో వచ్చే వార్తల మీద చర్చ కాబట్టి, పాల్గొనే వాళ్ళను అంతకు ముందు రోజే నిర్ణయించుకుని పిలుస్తారు.

సరే! విషయానికి వస్తే ..

మన దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచదేశాల్లో అత్యధిక సంఖ్యలో పనివాళ్లు పనిచేస్తోంది వంటిళ్ళలో ఆడవాళ్ళు. అదీ జీతం భత్యం లేకుండా. పైగా ఒక ఉద్యోగం కాదు. తల్లి, వంటలక్క, పనిమనిషి, ఆయా, స్కావెంజర్, ఇలా ఎన్నో రకాల పనులు ఒంటి చేత్తో చేస్తోంది ఆడవాళ్ళు మాత్రమే. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా. వీరి కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేడు.

అటువంటి వారిపై అత్యాచారాలు అనే మాటపై ఇలా ప్రతిసారీ చర్చలు జరగకుండా వుండే రోజుకోసం ఎదురు చూద్దాం.

ఇదే నేను  ఈ వీడియోలో ఒకటి, రెండు నిమిషాల్లో చెప్పింది.

అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి కృతజ్ఞతలు.

ధన్యవాదాలు చెప్పాల్సిన మరో మిత్రుడు 

Video LINK

https://www.facebook.com/100009070493506/videos/2823189941326661/



26, జూన్ 2021, శనివారం

నాసికాశాస్త్రం – భండారు శ్రీనివాసరావు

 ముక్కు వుంది చీదడానికే అని అదేపనిగా చీదేయకండి. ముక్కుతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయని ఓ ముక్కు శర్మగారు సెలవిస్తున్నారు. తలనొప్పిని అయిదే అయిదు నిమిషాల్లో ఎగరగొట్టే మహత్తర శక్తి ముక్కుకు వుందన్నది ఆయన మాటల తాత్పర్యం.

ఇంతకీ విషయం ఏమిటంటే -

ముక్కుకు రెండు రంధ్రాలు వుంటాయి. ఈ నిజం తెలుసుకోవడానికి ముక్కు శర్మగారు అవసరం లేదు. కానీ ఆయన చెప్పేది ఇంకా వుంది. ఆ రెండు రంధ్రాల్లో ఎడమవైపుది చంద్రుడి స్థానం అయితే, కుడి వైపుది సూర్యుడి స్థానం. బాగా తలనొప్పిగా వున్నప్పుడు కుడి రంధ్రాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మూసివుంచి ఒక్క ఎడమవైపు రంధ్రం ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటే తలనొప్పి గాయబ్.

అంతేనా అంటే అంతే కాదు అంటున్నారు ముక్కు శర్మగారు.

బాగా అలిసిపోయినప్పుడు ఎడమవైపు రంధ్రాన్ని చేతి వేలితో మూసి, కుడి వైపు రంధ్రం నుంచి శ్వాస పీల్చి చూడండి. ఇక చూడండి, రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు మనస్సు పాతిక లైకులు చూసినంత హాయిగా తాజాగా అయిపోతుంది (ట)

ప్రయత్నించి చూస్తే పోయేదేమీ లేదు ఓ అయిదు నిమిషాలు టైం తప్ప.

స్టార్ట్ ....వన్ టూ త్రీ....

తోకముక్క: నెట్లో ఈ సమాచారం ఇంగ్లీషులో పంపిణీ చేసిన దేవినేని మధుసూదన రావు గారికి కృతజ్ఞతలు. దాన్ని స్వేచ్చగా తెలుగులోకి మార్చిన భవదీయుడికి (అంటే నేనే) అభినందనలు.

Prashant Kishor Master Plan To Defeat Modi Govt || Third Front Against B...

అప్పుడప్పుడు కొన్ని వెబ్ ఛానల్స్ వాళ్ళు నా ఇంటర్వ్యూకి ఇలా శీర్షికలు పెట్టి సంతోషపడుతుంటారు. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి?



హుజూరాబాద్ లో ఈటలకు ఓటమి తప్పదా ? || Big Shock To Etela Rajender || Hash...

అప్పుడప్పుడు కొన్ని వెబ్ ఛానల్స్ వాళ్ళు నా ఇంటర్వ్యూకి ఇలా శీర్షికలు పెట్టి సంతోషపడుతుంటారు. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి?



25, జూన్ 2021, శుక్రవారం

ఎమర్జెన్సీ గుణపాఠాలు - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

1975 జూన్ 25
దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజది.
బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరి అప్పటికి నాలుగేళ్ళు గడిచాయి. వున్నట్టుండి 'ఎమర్జెన్సీ' అనే కొత్త పదం పత్రికాపారిభాషిక పదకోశంలో చేరింది. ఇంగ్లీష్ పత్రికలకు పరవాలేదు. తెలుగులో ఏమి రాయాలి. కొన్ని తెలుగు దినపత్రికలు 'అత్యవసర పరిస్తితి' అని అనువాదం చేసాయి. కానీ ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారిది ప్రత్యేక బాణీ. అందుకే ఆయన, అ కు దీర్ఘం పెట్టి, 'ఆత్యయిక పరిస్తితి' అని నామకరణం చేశారు.
జరిగి నలభయ్ ఆరేడేళ్ళయినా ఇంకా ఆనాటి జ్ఞాపకాలు మనసులో పదిలంగానే వున్నాయి.
ఆనాటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్తితి విధించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రిమండలి జూన్ ఇరవై ఐదో తేదీ రాత్రి అత్యవసరంగా సమావేశమై ఎమర్జెన్సీ విధిస్తూ తీర్మానించింది. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన ఆర్డినెన్స్ పై నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జూన్ ఇరవై అయిదు అర్ధరాత్రి అంటే మరి కాసేపట్లో ఇరవై ఆరో తేదీ ప్రవేశించే ఘడియకు కొన్ని నిమిషాల ముందు దానిపై సంతకం చేశారు. ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీ ఛానల్లు లేవు. 'ఆకస్మిక సమాచారం' లేదా 'ఇప్పుడే అందిన వార్త' తెలుసుకోవాలన్నా, వినాలన్నా రేడియో ఒక్కటే దిక్కు. అంచేత ఆ అర్ధరాత్రి నిర్ణయం గురించి మరునాడు ఉదయం ఆరుగంటలకు ప్రసారం అయ్యే రేడియో ఇంగ్లీష్ వార్తల్లో కాని యావత్ దేశానికి తెలియని పరిస్తితి. మరునాడు పత్రికలన్నింటిలో 'ఎమర్జెన్సీ' అనేదే పతాక శీర్షిక. బెజవాడలో చాలామంది మిలిటరీ ప్రభుత్వం వచ్చిందని అనుకున్నారు కూడా.
దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను వేల సంఖ్యలో అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ విధించారు. పత్రికల సెన్సార్ షిప్ అంటే ఏమిటో అప్పటిదాకా పత్రికలకీ తెలియదు. అధికారులకీ తెలియదు. ఆ రోజుల్లో పత్రికలకి ప్రత్యేకించి తెలుగు దినపత్రికలకి నేటి మాదిరిగా అధునాతన ముద్రణాయంత్రాలు లేవు. ప్రతి అక్షరం ఏర్చి కూర్చి అచ్చుకు పంపాల్సిన రోజులు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారి పనుపున ఆనాటి సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు సెన్సార్ పనులు పర్యవేక్షించేవారు. ఏవార్త పత్రికలో ముద్రించాలి ఏది రాకూడదు అని ఆయనే నిర్ణయించేవారు. ఆ అధికారి కార్యాలయం గాంధీ నగర్ లో వుండేది. ఆంధ్రజ్యోతి ఆఫీసు లబ్బీపేటలో. ప్రతిరోజూ సాయంత్రం ప్రచురించే వార్తల్ని అచ్చులో కూర్చి అక్కడికి పట్టుకెళ్ళేవాళ్లు. కొన్నాళ్ళ తరువాత ఏది వేయాలో ఏది వేయకూడదో పత్రికలకే అలవాటు కావడంతో రోజూ తీసికెళ్ళే శ్రమ తగ్గిపోయింది. ఈలోపల ఇండియన్ ఎక్స్ ప్రెస్ అందరికీ ఓ దోవ చూపింది. వాళ్లు సంపాదకీయం ప్రచురించే జాగాను ఖాళీగా ఒదిలేయడం మొదలెట్టారు. దాంతో మిగిలిన వాళ్లు అందిపుచ్చుకుని సెన్సార్ అయిన వార్తల జాగాను ఖాళీగా తెల్లగా కనబడేట్టు ఒదిలేసి పత్రికలు ప్రచురించడం ప్రారంభించారు. ఈ నిరసన సులభంగానే ప్రజల్లోకి చేరింది. పత్రికలపై సెన్సార్ షిప్ గురించి జనం మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇదో కధ.
మరో వైపు ఎమర్జెన్సీ దమన కాండ ఉత్తర భారతంలో అమలు జరుగుతున్న తీరు గురించి పుంఖానుపుంఖాలుగా వదంతులు వ్యాపించేవి. దక్షిణ భారతంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పాలనలో వున్న ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకల్లో పరిస్తితి కొంత మెరుగు. ఈ రాష్ట్రాల్లో కూడా రాజకీయ అరెస్టులు బాగానే జరిగాయి. కానీ ఉత్తర భారతంలో మాదిరిగా నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ఇళ్ళ కూల్చి వేతలు జరగలేదు. పైపెచ్చు, ప్రజానీకంలో ముఖ్యంగా బీదాబిక్కీకి అసలీ గొడవే పట్టలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగడానికీ, తీసుకోవడానికీ భయపడిపోయేవాళ్ళు. ఫైళ్ళు చకచకా కదిలేవి. తెల్లవారుతూనే రోడ్లు శుభ్రంగా వూడ్చేవాళ్ళు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన అనేది కలికానికి కూడా కానరాకుండా పోయింది. ఎమర్జెన్సీ బాగా వుందని కూడా జనం అనుకోవడం ప్రారంభించారు. మొదట్లో ధరవరలు కూడా ఆకాశం నుంచి దిగివచ్చాయి. బ్లాకు మార్కెట్ మాయమయింది.
అయితే ఏ భయం అన్నా కొన్నాళ్ళే అని తర్వాత తేలిపోయింది. జనంలో అంతకు ముందు వున్న బెరుకు పోయింది. అధికారుల్లో అది అంతకు ముందే పోయింది. దాంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదో కధ. ఒదిలేద్దాం.
అసలీ ఎమర్జెన్సీ ఏమిటి? ఏమిటి దీని కదాకమామిషు అని ప్రశ్నించుకుంటే-
భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాటి సోవియట్ యూనియన్ తాష్కెంట్ లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధి ఆయన స్తానంలో ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మొరార్జీ దేశాయ్ వంటి కాకలు తీరిన కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇష్టం లేకపోయినా ఆమె కింద పనిచేయాల్సిన పరిస్తితి. 1969 లో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయింది. అయినా శ్రీమతి గాంధి తనదే పైచేయి అనిపించుకుంది.
1971 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధి ప్రజల్లోకి ఒదిలిన 'గరీభీ హఠావో' నినాదం పాశుపతాస్త్రం మాదిరిగా పనిచేసి ఆమె నాయకత్వం లోని కాంగ్రెస్ (ఆర్) కు అఖండ విజయాన్ని కట్టబెట్టింది. మొత్తం లోకసభలోని 518 సీట్లలో 352 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఆ తదుపరి అదే ఏడు డిసెంబరులో బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) విమోచన యుద్ధంలో సాధించిన అపూర్వ విజయం కూడా ఆమె ఖాతాలోకే చేరింది. అనంతరం ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ప్రభలు యావత్ విశ్వంలో మిన్నంటాయి. అపర కాళికగా ఆమెను దేశంలో జనం కీర్తించడం మొదలెట్టారు. దానితో అధికారం మొత్తం తన చెప్పుచేతల్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనకు అడ్డువచ్చే కాంగ్రెస్ శక్తుల్ని అడ్డు తొలగించుకోవడం కూడా ఇందిరా గాంధి వ్యూహాల్లో భాగం. ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ గా వున్న పీ.ఎన్. హక్సర్ తోడుగా నిలిచారు. అంతవరకూ ప్రభుత్వాధికారులకి రాజకీయనాయకుల పట్ల ప్రత్యేకించి వ్యక్తిగత అభిమానాలు వుండేవి కావు. హక్సర్ ఆ సంస్కృతికి మంగళం పాడి ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా విధేయులుగా వుండే అధికారులని ఎంపిక చేసి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఆ విష సంస్కృతి ఈనాడు వేళ్ళూనుకుని పోయి, అడిగింది చేయించుకునే రాజకీయనాయకులు, వాళ్లకు చెప్పింది చేసిపెట్టే అదికారగణం కింద మారిపోయి మొత్తం వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. దీనికి బీజాలు వేసింది హక్సర్ మహాశయులు.
అధికారం చెడగొడుతుంది. అపరిమితమైన అధికారం తిరిగి బాగుచేయలేనంతగా చెడగొడుతుంది. ఇందిరా గాంధి విషయంలో అదే జరిగింది. 'ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర' అంటూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా పొగిడే స్థాయికి భజన బృందాలు ఎదిగిపోయాయి. దీనికి మొదటి అడ్డుకట్ట రాజ్ నారాయణ్ అనే సోషలిష్టు నేత రూపంలో పడింది. ఇందిరపై పోటీ చేసి ఓడిపోయిన ఆ పెద్దమనిషి ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేసాడు. అధికార దుర్వినియోగం చేసి ఇందిర గెలిచిందని ఆయన వాదన. ఇప్పుడు ప్రముఖ న్యాయవాదిగా వున్న శాంతి భూషణ్ అప్పుడు రాజ్ నారాయణ్ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఇందిరాగాంధీ ఎన్నికల సభలకు పోలీసులు వేదికలు నిర్మించారనీ, యశ్ పాల్ కపూర్ అనే ప్రభుత్వ ఉద్యోగి సేవలను ప్రధాని ఎన్నికల సమయంలో వాడుకున్నారని అభియోగాలు మోపారు. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద వస్తున్న ఆరోపణలతో పోలిస్తే ఇవి ఏపాటి. కానీ, తాడే పామై కరుస్తుందంటారు కదా! ఈ అభియోగాలనే ఆనాటి అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ సిన్హా నమ్మారు. 1975 జూన్ 12 వతేదీన చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఇందిరా గాంధి ఎన్నిక చెల్లదని కొట్టివేశారు. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించారు. అంతే కాదు ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరాగాంధీపై నిషేధపు వేటు వేసారు. ఇంత పెద్ద శిక్ష వేయడానికి చూపిన కారణాలు వివాదాస్పదం అయ్యాయి. 'ట్రాఫిక్ నిబంధన ఉల్లఘించిన చిన్న తప్పుకు ప్రధానిని పదవి నుంచి తొలగించినట్టుగా ఈ తీర్పు వుంద'ని 'ది టైమ్స్' పత్రిక ఎద్దేవా చేసింది.
ఇందిరా గాంధీ హయాములో ఎమర్జెన్సీ అమలు జరిగిన తీరు, దానివల్ల కలిగిన లాభాలను ఆమె అనుయాయులు నోరారా పొగిడారు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ వినోబా భావే అంతటి మహనీయుడు ఎమర్జెన్సీ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించడం మామూలు విషయం కాదు.
కోర్టు తీర్పు రాజకీయ తుపాను సృష్టించింది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో యావత్ పతిపక్ష నాయకులందరూ ఇందిర రాజీనామా చేయాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా విద్యార్ధులు ఆందోళనలతో వీధుల్లోకి దిగారు.
అలహాబాదు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రధాని ఇందిర సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అక్కడా ఆమెకు చుక్కెదురయింది. కేసు విచారించిన జస్టిస్ వీ.ఆర్. కృష్ణయ్యర్, జూన్ ఇరవై నాలుగున కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఇందిరాగాంధీకి అన్ని దారులూ మూసుకుపోయాయి. కృష్ణయ్యర్ తీర్పు మరింత ఘాటుగా వుంది. ఒక పార్లమెంటు సభ్యురాలిగా ఇందిరాగాంధీ అనుభవిస్తున్న అన్ని ప్రత్యేక సౌకర్యాలను రద్దుచేసారు. అంతే కాదు ఎన్నికల్లో ఓటు చేసే హక్కును కూడా తొలగించారు. అయితే విచిత్రంగా ప్రధాని పదవిలో కొనసాగడానికి న్యాయమూర్తి ఆమెను అనుమతించారు.
మరునాడు జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. 'ఏ పోలీసు అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను శిరసావహించరాద'ని పిలుపు ఇచ్చారు.
ఆ తరువాత ఇందిరాగాంధీ తన నమ్మకస్తులతో సమావేశమై చక చకా పావులు కదిపారు. రాష్ట్రపతిని ఎమర్జెన్సీ విధింపు విషయంలో సంప్రదించారు. ఈ విషయాన్ని తన మంత్రివర్గ సహచరులకు తెలియచేసారు. వారి ఆమోదాన్ని మరునాడు లాంఛనంగా తీసుకున్నారు. ఎమర్జెన్సీ ముసాయిదాను సిద్ధార్ద్ శంకర్ రాయ్ తయారు చేశారు. అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపారు. పన్నెండు గంటలు కొట్టడానికి కొన్ని నిమిషాలు ముందు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ దానిపై సంతకం చేశారు. అంతకు ముందు మధ్యాన్నం ఢిల్లీలోని పత్రికా కార్యాలయాలకు కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్టుకు ఆదేశాలు వెళ్ళాయి.
ఎమర్జెన్సీ ప్రకటనతో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన కొన్ని ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లింది. పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. కేవలం కార్టూన్లతో పత్రిక నడుపుతూ జవహర్ లాల్ నెహ్రూ మన్ననలు పొందిన ప్రముఖ కార్టూనిష్ట్ శంకర్, ప్రభుత్వ అనుకూల కార్టూన్లు వేయలేనని ప్రకటించి 'శంకర్స్ వీక్లీ' అనే పేరుతొ వెలువడుతున్న తన పత్రిక ప్రచురణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వపరంగా సాగిన దాష్టీకం ఉత్తర భారతానికి పరిమితమయింది. దక్షిణ భారతంలో దాని ప్రభావం స్వల్పమేనని చెప్పాలి. ప్రధాని రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా భాసిల్లాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఆయన ఆదేశాలకోసం మోకరిల్లేవారని రకరకాల వదంతులు షికారు చేసేవి.
మనదేశం స్వాతంత్రం పొందిన తరువాత మూడు ఎమర్జెన్సీ దశలను చవిచూసింది.1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్ చైనాల నడుమ చెలరేగిన యుద్ధం కారణంగా ఎమర్జెన్సీ విధించారు. అలాగే, 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు ఇండో పాక్ యుద్ధం సందర్భంగా విదేశీ దురాక్రమణ బెదిరింపు కారణంగా. అయితే ఇక మూడోసారి ఇందిరాగాంధి హయాములో దేశ భద్రతను, ఆంతరంగిక కల్లోలాలను బూచిగాచూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు విధించింది ఆంతరంగిక ఎమర్జెన్సీ. మొదటి రెండూ అంతగా ప్రాచుర్యం పొందలేదు. రాజకీయం ఇమిడి వుండడంవల్ల మూడోది బాగా ప్రచారం పొందింది.
ఎమర్జెన్సీ పేరుతొ ఇందిరాగాంధీ తాత్కాలికంగా కొన్నాళ్ళు అధికారంలో కొనసాగి వుండవచ్చు కాని, అంతకు పూర్వం ఆమె సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మసకబారాయి. తెలివిన పడిన తరువాత ఆమె ఎమర్జెన్సీ ఎత్తి వేసారు. ప్రజాస్వామ్యబద్ధంగా సార్వత్రిక ఎన్నికలకు పచ్చ జెండా చూపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందిరను ఓడించడానికి పార్టీలన్నీ ఏకమై, ఒకే పేరుతొ, ఒకే ఎన్నికల గుర్తుతో బరిలోకి దిగాయి. జనత పార్టీ రూపంలో పెల్లుబికిన జనాభిప్రాయం ఇందిరకు ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. స్వయంకృతం అంటారే దానికి ఇది మంచి ఉదాహరణ.
ఇక ఇందిరను ఓడించి అధికారానికి వచ్చిన జనత పార్టీ, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా, స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. రాజకీయ విలువలకూ, విలువల రాహిత్యానికీ నడుమ సాగిన పోరాటంలో విలువల్ని నిలువు పాతర వేసారు. జయప్రకాష్ నారాయణ్ కలలు కన్న సంపూర్ణ విప్లవం వాస్తవ రూపం ధరించకుండానే 'జనత ప్రయోగం' విఫలం అయింది. రాజకీయ స్వలాభాలకోసం చేతులు కలిపిన వివిధ పార్టీలన్నీ అవే చేతులతో కత్తులు దూసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫలితం రాజకీయంగా పూర్తిగా మసకబారిన ఇందిరాగాంధీకి రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు. స్వయంకృతానికి ఇది మరో మంచి ఉదాహరణ.
ఏ ప్రజలైతే తిరస్కరించారో, వారే తిరిగి ఇందిరాగాంధీకి అధికారం అప్పగించారు. ప్రధాని అయిన తరువాత ఇందిరాగాంధీలో మునుపటి తెంపరితనం తగ్గిపోయింది. కర్కశ రాజకీయం కూడా ఆమెలో కానరాకుండా పోయింది. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఆమె దురదృష్టం. పదవిలో పూర్తికాలం గడపక ముందే అంగరక్షకుల తుపాకీ తూటాలకు బలి అయిపోయారు. ఆవిధంగా భారత రాజకీయాలను తనదయిన రీతిలో ప్రభావితం చేసిన ఇందిరాగాంధీ, తన జీవితకాలంలోనే అనేక ఎగుడుదిగుళ్ళను కళ్ళారా చూసి కన్ను మూశారు.
ఈనాటి రాజకీయ నాయకులు ఎమర్జెన్సీ నుంచి, ఇందిరాగాంధీ అనుభవాలనుంచి, జనత ప్రయోగం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగే వాళ్ళకు గుణపాఠం. అధికారం ఎప్పటికీ శాశ్వితం అనుకునే వాళ్లకు నీతిపాఠం.





ప్రజలు కొందర్ని కొన్నాళ్ళు నమ్ముతారు. అందర్నీ ఎల్లకాలం నమ్మరు.

24, జూన్ 2021, గురువారం

అభినవ ఉద్దాలకులు – భండారు శ్రీనివాసరావు

 

“ఇదిగో! పీతాంబరం వచ్చాడు. హడావిడి పడి కాఫీ తేవద్దు” వంటింట్లోకి కేకేసి చెప్పాడు ఏకాంబరం.
తర్వాత గొంతు తగ్గించి పీతాంబరంతో అన్నాడిలా.
“మా ఆవిడ మరీ ఉద్దాలకుడి భార్య లాగా ప్రవర్తిస్తోంది”
“ఉద్దాలకుడా! అతడెవ్వడు” అడిగాడు పీతాంబరం.
“ఉన్నాడులే పురాణ కధల్లో ఒకడు. శుద్ధ బుద్ధావతారం. అతడేమి అన్నా భార్య ఒప్పుకోదు. పైగా తద్విరుద్ధంగా చేస్తుంది. అన్నం పెట్టు అని అడిగితే అన్నం గిన్నె నేలకేసి కొడుతుంది.”
“అది సరే. అది కధ. మీ ఆవిడ సంగతేమిటి ! అది చెప్పు ముందర” అన్నాడు పీతాంబరం, ఏకాంబరం భార్య తెచ్చి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ.
ఆమె లోపలకు వెళ్ళగానే అన్నాడు ఏకాంబరం.
“ఏం చెప్పను! మా ఆవిడదీ అచ్చంగా అదే వరస. నేను ఏది చెప్పినా దానికి విరుద్ధంగా చేస్తుంది. అందుకని ఓ ఉపాయం కనిపెట్టాను”
“ఏమిటది?”
“స్నానానికి నీళ్ళు పెట్టు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు స్నానానికి నీళ్ళు వద్దు అని చెబుతాను. అంతే! ఆవిడ చక్కగా గంగాళం వేన్నీళ్ళు సిద్ధం చేస్తుంది. ఈ కిటుకు తెలిసిన తర్వాత నా పని సులువైంది. నాకు ఏది కావాలో అది వద్దు అని చెబుతాను. దానితో నాకు ఏది కావాలో అది చేసి పెడుతోంది”
“బాగుందే ఈ టెక్నిక్. అధికారంలో వుండే వాళ్ళు కూడా ఇదే పని చేస్తే సరి పోతుంది. వాళ్ళు ఒక పని తలపెట్టి నప్పుడు దానికి విరుద్ధంగా చేయబోతున్నామని చెప్పాలి. ప్రతిపక్షాల వాళ్ళు కాదూ కూడదు అంటారు. పైగా అధికార పక్షం మనసులో పెట్టుకుని బయటకు చెప్పని ఆ పని చేయమని కూడా నానా యాగీ చేస్తారు. అప్పుడు ఆ పని చేసారనుకో, ప్రతిపక్షం చెప్పింది ఒప్పుకున్నట్టు అవుతుంది. తాము చేయాల్సింది చేసినట్టూ అవుతుంది” చెప్పాడు పీతాంబరం తాపీగా కాఫీ తాగి కప్పు కింద పెడుతూ.
(24-06-2021)

రాజకీయ దత్తతలు - భండారు శ్రీనివాసరావు

 “ఒక కుర్రాడు నేరేడు చెట్టుకింద నిలబడి వున్నప్పుడు నిగనిగలాడే నల్లటి నేరేడు పండు కింద పడుతుంది. వంగి దాన్ని తీసుకుని రుచి  చూస్తాడు. బ్రహ్మాండం అనుకుంటూ ఉండగానే మరోటి రాలి పడుతుంది. వంగి చేతిలోకి తీసుకుంటాడు. అలా ఒకటి కాదు పాతిక నేరేడు పండ్లు  నాలుక ముదురు నీలం రంగుకు మారే వరకు, ఆవురావురుమని నోరారా  తింటాడు. ఇంతలో  మళ్ళీ ఒకటి రాలుతుంది. ఈసారి బద్దకంగా వంగి తీసుకుంటాడు. మునుపటి రుచి లేదేమిటి అనుకుంటాడు. ఇంకోటి , మరొకటి తిన్న తరువాత నేరేడు పండు మీద యావ తగ్గిపోతుంది.

“దీన్ని ఇంగ్లీష్ వాడు డిమినిషింగ్ రిటర్న్స్ (Diminishing Returns) అంటాడు”

ఇలా సాగేది చతుర్వేదుల రామనసింహం గారి పాఠం.

ఇలా కధలు కధలుగా పాఠాలు చెబుతుంటే విద్యార్ధులు వినకేం చేస్తారు? మా బీ కాం తరగతి వాళ్ళే కాదు, మిగిలిన తరగతుల వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వినేవారు. ఆయన క్లాసులో అటెండెన్స్ రిజిస్టర్ కూడా వుండదు. అయినా ఒక్కళ్ళు కూడా డుమ్మా కొట్టరు. రామనరసింహం గారు పాఠం చెప్పే తీరు అలాంటిది.

ఎస్సారార్ కాలేజీలో రామనరసింహం గారు మాకు లెక్చరర్. క్లాసు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి మాటలు బాగా గుర్తుండిపోయేవి. యాభయ్ ఏళ్ళు దాటిన తదుపరి కూడా అవి అలా మనసులో వుండిపోయాయి.

రాజకీయ దత్తతలు అని మొదలు పెట్టి ఈ నేరేడు పండ్ల కధ ఏమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను.

ఇప్పుడు మరో పాఠం చెప్పుకుందాం.

“గ్రామస్తుల మధ్య ప్రేమ భావం వుండాలి. పోలీసు కేసులు ఉండొద్దు. కేసులు వున్నా వాటిని వెనక్కి తీసుకోండి. ఒకళ్ళ నొకళ్ళు దూషించుకోవడం ముందు మానేయండి. అందరం ఒకటే అనుకోండి.

“అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోండి. అక్కడివాళ్లు బంగ్లాలు కట్టుకుని హాయిగా వుంటున్నారు. ఆ వూరి గ్రామ కమిటీ చెబితే సుప్రీం కోర్టు చెప్పినట్టే. నలభయ్ ఐదేళ్ల నుంచి ఆ ఊరిలో ఒక్క పోలీసు కేసు లేదు. మీ ఊళ్ళో

రెక్కల కష్టం మీద బతికే వారిని గురించి తోటి గ్రామస్తులు ఆలోచించాలి. మీ ఊళ్ళో పనిచేయగలిగిన  వాళ్ళందరూ వాళ్ళ రెండు చేతులతో వారానికి రెండు గంటలు ఉచితంగా శ్రమిస్తే మీ ఊరిలో మీరే అద్భుతాలు సృష్టించగలరు” 

ఈ సుద్దులు చెప్పింది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరితో? తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామస్తులతో.

ఇంకా చాలా చెప్పారు.

ఆ వూరిలో పదో తరగతి  అమ్మాయి సుప్రజకు   డాక్టర్ చదువు పట్ల వున్న మమకారం వున్నా ఆర్ధిక పరిస్థితులు సహకరించడం లేదని  తెలుసుకుని ఆ బాధ్యత తనదేని ఆ అమ్మాయి తండ్రికి హామీ ఇచ్చారు.

2600 మంది జనాభా కలిగిన వాసాలమర్రి  గ్రామాభివృద్ధికి నూట యాభయ్ కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామ రూపురేఖలు సమూలంగా మార్చి వేయడానికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు.

గ్రామంలోని అందరి భూములకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేశారు.

జిల్లాలోని ప్రతి పంచాయితీకి పాతిక లక్షలు, భువనగిరి మునిసిపాలిటీకి కోటి, ఇతర మునిసిపాలిటీలకు యాభయ్ లక్షల చొప్పున అందచేస్తామని అన్నారు. 

ఇలా తను దత్తత తీసుకున్న వాసాల మర్రి గ్రామం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ పోయారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎందుకిలా అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎన్నికలు లేవు. వాసాల మర్రి అంటే దత్తత తీసుకున్న గ్రామం కనుక అంతగా తప్పు పట్టడానికి ఏమీ ఉండక పోవచ్చు.

గ్రామాలను, లేదా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకున్న ఉదాహరణలు ఉమ్మడి రాష్ట్రంలోను  కనిపిస్తాయి.

మహబూబ్ నగర్ జిల్లాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. పైకి దత్తత గురించి ప్రకటించక పోయినా ఖమ్మం జిల్లాలో జరిగి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇటుక మీద తన పేరే ఉంటుందని అలనాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చెప్పేవారు. అలాగే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాములో పులివెందులలో జరిగిన అభివృద్ధి ఎవరూ కాదనలేనిది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన నియోజకవర్గం వారణాసిని దత్తు తీసుకున్న మాదిరిగానే అభివృద్ధి చేస్తున్నారు.

అయితే, రాజకీయ నాయకులు ప్రాంతాలను దత్తు తీసుకోవడం అనే అంశం చర్చకు వచ్చినప్పుడు మన పార్ల మెంటు సభ్యుల నిర్వాకం గురించి కూడా చెప్పుకోవాలి.

నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, మాజీ కేంద్ర మంత్రి  అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది  ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.

(24-06-2021)

ఆంధ్ర అభ్యసన పరివర్తన

 ఇంగ్లీష్ భాషలో వున్నవి ఇరవై ఆరు అక్షరాలే. అంచేత కాబోలు ఇతర భాషలలోని ముఖ్యంగా లాటిన్ వంటి భాషలోని  పదాలను చేర్చుకుని ఆ భాష పరిపుష్టం అయిందంటారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త కొత్త పదాలు అనుభవంలోకి వస్తుంటాయి. ఇది తప్పనిసరి పరిణామం.

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఒక తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు ఘెరావ్, ధర్నా అనే పదాలు మొదటిసారి వాడుకలోకి వచ్చాయి. మొదట్లో వీటిని రకరకాలుగా రాసేవారు. ఘెరావో, ధరణ ఇలా. అవి తెలుగు పదాలు కావు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పలికేవాళ్ళు, రాసేవాళ్ళు. తొలి రోజుల్లో వీటిని  తెలుగులోకి అనువదించే ప్రయత్నం జరిగింది. కానీ అది సఫలం కాలేదు. దరిమిలా, కాలం గడిచిన కొద్దీ అవి వ్యావహారిక పదాలుగా మారిపోయాయి. ఇలాటి ఉదాహరణలు చాలా వున్నాయి. రైలు స్టేషన్, సిగ్నల్, బస్ స్టాండ్, సిటీ బస్సు, ఆటో ఇలా చాలా చెప్పుకోవచ్చు. పైన తెనిగించినట్టు “ఆంధ్ర అభ్యసన పరివర్తన” మాదిరిగా అదే పత్రికలో ఈ పదాలను తర్జూమా చేసి రాస్తున్నారా! లేదే! లేనప్పుడు ఈ కొత్త పదసృష్టి దేనికోసం? ఎవరి కోసం?

నేను మొదటి నుంచి చెబుతున్నది ఒక్కటే. మీరు తెలుగులో అనువాదం చేయండి. కానీ చదువరికి అర్ధం అవుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా అనువాదాలు చేసేవాళ్ళు ఏసీ గదులు వదిలి, బొత్తిగా ఇంగ్లీష్ తెలియని పల్లె ప్రాంతాలలో వాటిని ఎలా పలుకుతున్నారో అధ్యయనం చేయండి. ఉదాహరణకు మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో కిరోసిన్ ను మట్టినుంచి తీసే నూనె కాబట్టి  మట్టి నూనె (చమురు) అనేవారు. అలాగే పొగబండి. ఇప్పుడా ఇంజిన్లతో నడిచే బండ్లు లేవు కాబట్టి రైలు అనక తప్పదు. విశాఖ పట్నంలో డ్రెడ్జింగ్  యంత్రాలతో పనిచేయిస్తున్నప్పుడు అక్కడి పని వారు దాన్ని తవ్వోడ అని పిలిచేవారని కలం కూలీ జి. కృష్ణ గారు చెప్పేవారు. పాశం యాదగిరిని అడిగితె లక్ష ఉదాహరణలు చెబుతాడు. ఒక తెలుగు వాక్యంలో ఒక్కటంటే ఒక్క తెలుగు పదం లేని వాక్యాలు తెలుగునాట అందరూ పలుకుతుంటారని సోదాహరణంగా పేర్కొంటాడు.

ఈ విధంగా పల్లెల్లో పుట్టే పలుకుబడులను ఈ అనువాద మేధావులు పట్టించుకోరు. పైగా అనువాదం కోసం అనువాదం అనే పద్దతిలో తెలుగును నానా హింస పెడుతున్నారు.

“ఆంధ్ర అభ్యసన పరివర్తన” వంటి ప్రయోగాలతో తెలుగును క్లిష్టతరం చేయడం, ఇదేమైనా భావ్యమా! అని మనం ప్రశ్నిస్తే తప్పేమిటి?



(24-06-2021)  

ఎమర్జెన్సీ ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 నలభయ్ ఆరేళ్ల కిందటి మాట.

ఎమర్జెన్సీతో పాటే పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు.
ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలు, ఫోటోలను ముందుగా సెన్సార్ అధికారికి చూపించి, ఆయన అనుమతి లభించిన తరువాతనే వాటిని ప్రచురించాల్సిన పరిస్తితులు ఉండేవి.
ఢిల్లీ స్టేట్స్ మన్ పత్రికలో ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అయన పేరు రఘురాయ్ . ఎమర్జెన్సీ విధించిన తరువాత నగరంలో పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు చూపే ఒక ఫోటో తీసాడు.
ఒకతను సైకిల్ పై ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ వెడుతుంటాడు. వెనకనే అతడి భార్య నడిచి వస్తుంటుంది.
ఆ ఫోటోకి కింద పెట్టిన క్యాప్షన్ ఇలా వుంటుంది.
“చాందినీచౌక్ ప్రాంతంలో జనజీవనం చాలా సాధారణంగా వుంది”
సెన్సార్ అధికారికి అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ కనిపించలేదు. దాన్ని ఓకే చేసాడు. ఫోటోగ్రాఫర్ తెలివి అతడ్ని పప్పులో కాలేసేలా చేసింది. ఆ ఫోటో చూస్తే జనజీవనం సాధారణంగా సాగిపోతున్న భావన కలిగే మాట నిజం. కానీ అదే వీధిలో గుంపులు గుంపులుగా గస్తీ తిరుగుతున్న పోలీసులు కూడా ఆ ఫోటోలో లీలగా కనిపిస్తారు. ఆ అధికారి ఆ విషయం గమనించలేదు. అంచేత మరునాడు పత్రికలో ఆ ఫోటో అచ్చయింది.
సెన్సార్ అధికారులు తరువాత నాలుక కరుచుకున్నారు. ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.

ముఖ్యమంత్రి కితాబు

 (జిల్లా కలెక్టర్ ను ఒక గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపధ్యంలో గుర్తుకొచ్చిన పాతికేళ్ళ నాటి జ్ఞాపకం) 

విరిగిన కాలుతో ఇంట్లో ‘కాలుక్షేపం’ చేస్తున్న రోజుల్లో నా కాలక్షేపం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

(23-06-2021)

 

22, జూన్ 2021, మంగళవారం

విని తీరాల్సిన కేసీఆర్ ప్రసంగం – భండారు శ్రీనివాసరావు

 ఉద్యమ కాలంలో సరే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాసనసభలోను, బహిరంగ సభలలోను అనేకానేక అద్భుత ప్రసంగాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు వాసాలమర్రి గ్రామ సభలో చేసిన ప్రసంగం ఒక ఎత్తు.

ఆయన ఈ సభలో కేవలం ప్రసంగం మాత్రమే చేశారని నాకు అనిపించలేదు.

దత్తత తీసుకున్న తీసుకున్న తండ్రి పిల్లవాడికి సుద్దులు చెప్పినట్టు ప్రజలకు  అనేక హిత బోధలు చేశారు.  ఒకరకంగా చెప్పాలంటే అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో సూక్తులు వున్నాయి. సలహాలు వున్నాయి. హితోక్తులు వున్నాయి. హెచ్చరికలు వున్నాయి. హామీలు వున్నాయి. వరాల జల్లులు  వున్నాయి. సుతిమెత్తని చీవాట్లు వున్నాయి. కానీ ఎక్కడా దాష్టీకం లేదు. పైపెచ్చు అధికారులని, అనధికారులని పేర్లతో సంబోధిస్తూ, వారి సేవలని ప్రశంసిస్తూ అందరినీ కలుపుకుపోయే ఒక సమర్ధ నాయకుడిగా ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఆసాంతం చూడని వారికి ఈ వాక్యాల్లో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు. చూడకపోతే నేనూ అలాగే అనుకునేవాడిని.

బహుశా ఆయన ప్రసంగం రేపు పత్రికల్లో వివరంగా రావచ్చు. ఆయన చెప్పినవన్నీ ఇక్కడ రాయడం సాధ్యం కాని పని.

అయినా ఒక విషయంతో ముగిస్తాను.

ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు.

ఇలాంటివి ఒక్క కేసీఆర్ కే సాధ్యం. సందేహం లేదు.

తోకటపా: సుదీర్ఘ ప్రసంగ సమయంలో, ఉక్కపోతకు చేతిలో వున్న కాగితాలతో విసురుకున్నారే కానీ, అక్కడ ఎవరిమీదా విసుక్కోలేదు.

(22-06-2021)