6, మే 2021, గురువారం

నాకు తెలుసు నాకే తెలుసు

“నాకు అంతా తెలుసు అనుకోవడంలోనే తెలుస్తోంది అంతగా ఏమీ తెలియదని. I am sure.” అని నా పాత్రికేయ మిత్రుడు శ్రీ బుద్ధవరపు రామకృష్ణ నిన్న ఒక చిన్న పోస్టు పెట్టాడు. నేను దానికి “'నాకూ తెలుసు', 'నాకే తెలుసు' ఈ రెంటికి తేడా తెలిస్తే అంతా తెలిసినట్టే!” అని కామెంటు పెట్టాను. నిజానికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ పోస్టుకు, రాజకీయ రంగులు ఏమాత్రం లేని కామెంటు.

దురదృష్టం ఏమిటంటే కొందరికి అవే కనిపించాయి. తప్పు లేదు, సహజం కూడా. వాటికి జవాబుగా అనికాదు కానీ ఎందుకో ఈ పోస్టు పెట్టాలని అనిపించింది.
ఇప్పుడు యాభయ్యవ పడిలో ఉన్న టీడీపీ అభిమానులను ఆ పార్టీకి ఎవరు శ్రీరామరక్ష అని అడిగితే యన్టీ రామారావు, చంద్రబాబునాయుడు అని చెబుతారు. అదే ప్రశ్నను ముప్పయ్యేళ్ళ వయస్సులో ఉన్న ఆ పార్టీ అభిమానులను అడిగితే ప్రాధాన్యతలు మారి, చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ అని వరస మార్చి చెబుతారు. కాలగతిలో వచ్చే మార్పు ఇది.
నా యాభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగగలిగే అరుదైన అవకాశాన్ని నా వృత్తి నాకు అందించింది. ఇది నా గొప్ప కాదు, నేను చేసిన ఉద్యోగం మరెవరు చేసినా వారికీ ఈ అవకాశం లభించి వుండేది.
ఆ అవకాశం ఇచ్చిన అనుభవంతో చెప్పగలను, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటారు. వాటిపై పత్రికల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు చివరికి ప్రకటిస్తారు. నిజానికి ఇది ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియే. దానికి విరుద్ధం కాదు. కానీ ఆ నిర్ణయానికి ప్రజామోదం వున్నట్టు తెలిసేలా జాగ్రత్త పడతారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేయక తప్పని పరిస్తితులు ఏర్పడ్డప్పుడు కూడా ఆయన ఇదే విధానాన్ని పాటించారు. పత్రికల్లో ప్రచారం ద్వారా ప్రజలను మానసికంగా అందుకు సంసిద్ధులను చేసిన తర్వాతనే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచారు. అందువల్లనే మద్యనిషేధం తొలగించినా ప్రజల్లో వ్యతిరేకత కానరాలేదు.
ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ మహానాడు జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ పార్టీ అభిమానులు పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు. వాటి గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ కటౌట్లు, బ్యానర్లు తొలగించాలని ఆగ్రహంతో ఆదేశించినట్టు కూడా మళ్ళీ పత్రికల్లో వచ్చింది. మధ్యాన్న భోజన సమయంలో కాబోలు నేను ఆయన్ని కలిసి సూటిగానే అడిగాను, ఇంత తంతు అవసరమా అని. ఆయన తనదైన శైలిలో నవ్వి ఊరుకున్నారు. అదే విలేకరుల సమావేశంలో ఇలా ఇబ్బంది పెట్టె ప్రశ్న వేస్తె ‘ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు అని గద్దించేవారు. విడిగా అడిగితే సౌమ్యంగా నవ్వి ఊరుకునేవారు. అది ఆయన స్వభావం.
ప్రతి దానికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఆయన కొత్తగా చేసుకున్న అలవాటు కాదు.
1978 లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఆయన చిత్తూరు జిల్లాలో పులిచర్ల సమితికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ ఎన్నికల్లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బెడద లేదు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్ధులు వున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఏర్పడ్డ ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)కి అభ్యర్ధులే కరువయ్యారు. చంద్రబాబుకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అదే మొదటిసారి. అందువల్ల ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అసలే కొత్త పార్టీ. ప్రత్యర్ధులు బలమైన వాళ్ళు. అంచేత ఆయన ముందు జాగ్రత్తగా ఆలోచించి తన విజయావకాశాలు ఎలా వుంటాయి అనే విషయం మీద ఒక అవగాహన కోసం చంద్రగిరి అసెంబ్లీలో ఒక సర్వే జరిపించారు. ఒకరకంగా అదే మొదటి పోల్ సర్వే అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది.
(ఈ సర్వే సంగతి శ్రీ కే. లక్ష్మినారాయణ వల్ల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసారు. సమర్దుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనతికాలంలోనే చక్కటి పేరు రావడానికి శ్రీ లక్ష్మీనారాయణ వంటి అధికారుల పాత్ర చాలా వుంది. ప్రముఖ సంపాదకులు శ్రీ ఇనగంటి వెంకట్రావు చంద్రబాబును గురించి రాసిన “ఒక్కడు- The Leader” అనే పుస్తకంలో ఈసర్వే సంగతి ఉదహరించారు)
(06-05-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి