21, మే 2021, శుక్రవారం

తరుముకొచ్చిన మృత్యువు

 (రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో నా వ్యాసం)

మృత్యుపాశం చాలా బలమైనది. పలానా చోట చావు రాసిపెట్టి వుంటే, వేల మైళ్ళ దూరంలోని వ్యక్తిని కూడా ఆ పాశం పట్టేసి అక్కడికి లాగేస్తుంది. రాజీవ్ విషయంలో అదే జరిగింది.
1991 లో లోకసభకు మధ్యంతర ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచి మరోమారు ప్రధాని కాగలనే నమ్మకంతో నాటి కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధి దేశ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై వున్నారు. అందులో భాగంగా హైదరాబాదు, విశాఖ పట్నాల్లో ఎన్నికల ర్యాలీలు పెట్టుకున్నారు. మే నెల ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఆరుగంటలకు విశాఖ నుంచి మద్రాసు వెళ్ళాల్సి వుంది. గెస్ట్ హౌస్ నుంచి విమానాశ్రయానికి వెడుతుండగా పైలట్ నుంచి మెసేజ్ వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ప్రయాణం వీలుపడదని. రాజీవ్ నిరుత్సాహంగా వెనుదిరిగారు. ఆ రాత్రి విశాఖ గెస్ట్ హౌస్ లో వుండి మర్నాడు మద్రాసు వెళ్ళాలి. ప్రయాణం ఇలా వాయిదా పడడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఏమైనా సరే వెళ్లి తమిళనాడులో ఎన్నికల ప్రచారం కొనసాగించాలని ఆయనకు మనసులో బాగా కోరిక. కానీ ఏం చేయాలి.
ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓ మెసేజ్. లోపం సరిచేసారు, ఎయిర్ పోర్టుకు వస్తే మద్రాసు వెళ్ళ వచ్చని. రాజీవ్ మనసులో కోరుకున్నట్టే జరిగింది కాబట్టి క్షణం ఆలస్యం చేయకుండా కారును వెనక్కి తిప్పమని ఆదేశించారు. ఈ తొందరలో మరో వాహనంలో వస్తున్న తన ప్రధాన భద్రతాదికారి ఓపీ సాగర్ కి ప్రయాణంలో మార్పు గురించి తెలియచెప్పలేదు.
చివరికి సొంత సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే రాజీవ్ మద్రాసు వెళ్ళిపోయారు. (చాలా మందికి సందేహం కలిగే విషయం. మాజీ ప్రధాన మంత్రి సెక్యూరిటీ విషయంలో పైకి కనపడని లోపం ఏదో జరిగినదని అనిపిస్తుంది, ప్రయాణం చేస్తున్నది ప్రత్యేక విమానం అయినప్పుడు వ్యక్తిగత భద్రతాసిబ్బందికి కబురు చేసి వెంట తీసుకు వెళ్ళవచ్చు కదా అని. అధికారిక ఏర్పాట్ల పరంగా చూస్తే ఇదో లోపం. కర్మను నమ్మేవారికి విధి ఆడిన నాటకం)
రాజీవ్ మద్రాసు చేరుకొని అక్కడినుంచి ఎన్నికల సభ జరిగే శ్రీ పెరంబదూర్ చేరుకునే సరికి రాత్రి పది గంటలు దాటింది. సభికులవైపు చేయి ఊపుతూ రాజీవ్ వేదిక వైపు వెడుతున్నారు. మహిలళ గేలరీలో స్త్రీలు రాజీవ్ ను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ సందడిలో ఓ ముప్పయ్యేళ్ల మహిళ రాజీవ్ వైపు దూసుకురాబోయింది. ఈ లోగా అనసూయ అనే లేడీ పోలీసు ఆమెను అడ్డగించింది. ఇది గమనించిన రాజీవ్ ‘ఏం పర్వాలేదు, రానివ్వు’ (Don’t worry, relax!) అంటూ ఆ పోలీసును వారించారు.
రాజీవ్ గాంధి జీవితంలో ఆఖరుసారి మాట్లాడిన మాటలు ఈ రెండే.
తన మరణం గురించి ఏడేళ్ల నాడు రాజీవ్ చెప్పిన మాటలు మరుక్షణంలోనే నిజమయ్యాయి. రాజీవ్ గాంధీ పాదాలకు నమస్కారం చేయడానికి ఆ మహిళ ముందుకు వంగింది. రాజీవ్ వద్దని వారిస్తూ పైకి లేపుతున్నప్పుడు తన శరీరానికి అమర్చుకున్న బాంబులు పేలేలా మీటను నొక్కింది. అంతే! భయంకర విస్పోటనం. ఏం జరిగిందో తెలిసేలోగా జరగరానిది జరిగిపోయింది. రాజీవ్ శరీరం దూరంగా ఎగిరిపడింది. తల గుర్తు పట్టడానికి వీల్లేకుండా పేలిపోయింది. ఆ ప్రాంతం అంతా ఏడ్పులు, రోదనలతో రణరంగాన్ని తలపించింది.
అదే రాత్రి ఢిల్లీలో నిద్ర పోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో సోనియా గాంధీకి ఒక ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘అంతా కులాసే కదా!’ అని అడిగి ఫోన్ పెట్టేయడంతో ఆవిడ కంగారు పడింది. కొద్దిసేపటి క్రితమే ఆమె వ్యక్తిగత కార్యదర్శి జార్జ్ ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తే అది ఎంగేజ్. ఆ సమయంలో మద్రాసు నుంచి జార్జికి కబురు తెలిసింది. వెంటనే జార్జ్ 10 జనపద్ నివాసానికి వెళ్ళాడు. విషయం తెలిసి సోనియా దుఖం కట్టలు తెంచుకుంది. ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ దుఃఖంలో ఉండగానే ఆమెకు అస్తమా అటాక్ వచ్చింది. ముందుగా తేరుకున్నది ప్రియాంక గాంధీ. వెంటనే మద్రాసు పోవడానికి ఏర్పాట్లు చూడమని జార్జ్ తో చెప్పింది. ఈలోగా రాజీవ్ హత్య సంగతి తెలుసుకున్న రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సోనియాను ఫోనులో పరామర్శించారు. మద్రాసులో పరిస్థితులు బాగాలేవని, ప్రయాణం మానుకొమ్మని సలహా చెప్పారు. కానీ భర్త మరణ వార్త తెలిసిన తర్వాత ఉండబట్టలేక సోనియా ప్రియాంకను వెంటబెట్టుకుని మూడుగంటల్లో మద్రాసు చేరుకున్నారు. కానీ ఏం లాభం. రాజీవ్ శరీర భాగాలను శవపేటికలో భద్రపరచి ఉంచారు. గుర్తు పట్టడానికి తల కూడా లేదు.
తన మరణం గురించి రాజీవ్ జోస్యం
ఇందిరాగాంధి వద్ద చిరకాలం పనిచేసిన పీసీ అలగ్జాండర్ My Days With Indira అనే పుస్తకం రాసారు. ఇందిరాగాంధి తన సొంత సెక్యూరిటీ చేతుల్లో దారుణ హత్యకు గురైన తర్వాత ఆమెను హుటాహుటిన ఆలిండియా మెడికల్ సైన్సెస్ సంస్థకు తరలించారు. ఇందిర మరణించిన విషయం అప్పటికి వెల్లడి కాలేదు. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ లో సోనియా, రాజీవ్ గాంధీ నడుమ జరిగిన సంభాషణను యధాలాపంగా విన్నట్టు ఆయన ఆ పుస్తకంలో ఉటంకించారు.
ఇందిరాగాంధి మరణానంతరం తాను ప్రధాని కాగోరుతున్నట్టు రాజీవ్ తన మనసులోని మాట బయట పెట్టారు. దాన్ని సోనియా ససేమిరా కాదన్నారు. ‘వద్దు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు.వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు”
రాజీవ్ ఇలా బదులిచ్చారు. “అవును చంపేస్తారు. అది తథ్యం. మరి మార్గాంతరం ఏమిటి? ప్రధానిని కాకపోయినా చంపేస్తారు”
సరే! ఈ సంభాషణలో నిజమెంత అనేది తెలియదు. ఎందుకంటే సోనియా మీద అలగ్జాండర్ మహాశయులకు కొంత కినుక వుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనను పార్టీ తరపున నామినేట్ చేయడాన్ని సోనియా వ్యతిరేకించిన విషయం ఆయన మనసులో పెట్టుకున్నారని, అంచేతనే ఇలాంటి కధలు సృష్టించారని అనేవాళ్ళు కూడా వున్నారు.
ఈ మొత్తం కధనంలో పేర్కొన్న వ్యక్తులు సోనియా, ప్రియాంక, మినహా ఎవ్వరూ ప్రస్తుతం జీవించి లేరు కాబట్టి ఇందులో రంధ్రాన్వేషణకు తప్ప సత్యాన్వేషణకు అవకాశం లేదు.
కావున, కాబట్టి చర్చించి వగచిన ఏమి ఫలము?

https://epaper.prabhanews.com/c/60583698

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి