3, ఏప్రిల్ 2021, శనివారం

పరిషత్ ఎన్నికల బహిష్కరణ సబబేనా ?

 ఎన్నికల బహిష్కరణ అనేది రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. గతంలో జరిగింది. భవిష్యత్తులో పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రస్తుతం ఏపీ పరిషత్ ఎన్నికల విషయంలో తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

కాకపోతే ఇటువంటి నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుపై  ప్రభావం చూపుతాయని అనేంతవరకు చర్చలు సాగుతుండడం కొంత వింతగా వుంది. నిజంగా అలాంటి అవకాశం ఉందా!

చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఏ నిర్ణయం అయినా ఆచితూచి  తీసుకుంటారు అనేది ప్రతీతి. అందుకు గతంలో యాక్టివ్ జర్నలిజంలో వున్నప్పుడు నేను కూడా ఒక సాక్షిని. ఎన్టీఆర్  నాయకత్వాన్ని కాదని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు ఎంతగా తటపటాయించారో  ఆనాటి జర్నలిస్టులకు బాగా తెలుసు. అలాగే వాజ్ పాయ్ కాలంలో బీజేపీతో జత కట్టే విషయంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి కూడా తెలుసు. ఇక లోకేష్ రాజకీయ రంగప్రవేశం సందర్భంలో జరిగిన తర్జనభర్జనలు ఇన్నీఅన్నీ కావు. అలాగే 2018లో మోడీతో విబేధించి బీజేపీకి రాం రాం చెప్పిన సందర్భంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరించారు. ఈ నిర్ణయాన్ని, మరీ ముఖ్యంగా టీడీపీకి ఆగర్భ రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే పార్టీ  నిర్ణయాన్ని  తమ పార్టీలోనే  చాలామంది  స్వాగతించడం లేదు అనే సమాచారం క్షుణ్ణంగా తెలిసికూడా ఆయన ముందుకు వెళ్ళారని చెప్పుకుంటారు.    

రాజకీయ నాయకులకు ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అలాగే చంద్రబాబుది కూడా విభిన్నమైన బాణీ.

తను నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తనది కాదు, మొత్తం పార్టీది అనే అభిప్రాయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పార్టీలో అన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అనే సానుకూల సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈ రకమైన చర్చల ప్రక్రియ ఉపయోగపడ్డ మాట కూడా వాస్తవమే.

సరే! ప్రస్తుతానికి వస్తే, పరిషత్ ఎన్నికల విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ముందు ముందు ప్రభావితం చేయబోయే రాజకీయ అంశాల మీద ఈనాడు విస్తృతంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య జనంలో చర్చలు సాగుతున్నాయి. ఇదేమంత కొత్త విషయం కాదని వాదించేవారు గతంలో జరిగిన బహిష్కరణలను ప్రస్తావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో జయలలిత  అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.   అయితే ఇక్కడ స్థూలమైన తేడా ఒకటి వుంది. 

ఇక తమిళనాడులో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఎన్ని పార్టీలు వున్నా కూడా ప్రధానమైన పోటీ రెండు పార్టీల నడుమనే. ఒకరు పోటీ నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీకి, లేదా వేరే పార్టీలకూ మళ్లిపోయే అవకాశం అక్కడ బొత్తిగా లేదు.

టీడీపీ పరిస్థితి అల్లా కాదు. నలభయ్ ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలలో పాతుకుపోయిన పార్టీ. లీడర్లు, కేడర్లు కింది స్థాయి నుంచి కలిగిన రాజకీయ పార్టీ, ఆ లీడర్లకు, కేడర్లకు గుర్తింపు వచ్చేది, ఉనికి చాటుకునేది ఎన్నికల సమయంలోనే. పైగా నామినేషన్ల పర్వం కూడా పూర్తయిన తర్వాత బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే మరి ఎన్నికల బరిలో ఉన్న తమవారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఎదురుగా నిలబడి వుంది. బ్యాలెట్  పత్రంలో పేరు, పార్టీ గుర్తు వుండి కూడా ప్రచారం చేసుకోలోని దుస్థితి. ఇదే విషయాన్ని టీడీపీ అగ్రనాయకులు అశోక గజపతి రాజు మరికొందరు లేవనెత్తారు కూడా.

ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగితే టీడీపీ సాంప్రదాయక ఓటర్ల పరిస్థితి ఏమిటి? అలాగే కింది స్థాయిలో పార్టీ పేరు చెప్పుకుని ఉనికిని కాపాడుకుంటున్న కార్యకర్తల సంగతి ఏమిటి? వాళ్ళు ఎవరికి  ఓటు వేయాలి? ఒకసారి ఓట్లు అలా చీలిపోతే వాటిని తిరిగి రాబట్టుకోవడం ఎంత కష్టం?

ఈ సందర్భంలో అనేక ఏళ్ళ క్రితం ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాటల సందర్భంలో చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది.

‘మీ పార్టీకి బలం లేదని తెలిసి కూడా ఎందుకు బరిలో దిగుతారు?’ అనే ప్రశ్నకు ఆయన జవాబు.

‘గెలవడం గెలవక పోవడం మాకు ముఖ్యం కాదు. పార్టీ కేడర్ లో విశ్వాసం నింపడం ప్రధానం. ఒకసారి పొత్తుల్లో సీటు వదులుకుంటే ఇక ఆసీటు మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వుంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఈ కఠిన వాస్తవం తెలుసు’   

మరి టీడీపీ ఏం చేయాలి?

‘నిర్ణయం  ఉపసంహరించుకోలేని  పక్షంలో ఇతర పార్టీలకు  కాకుండా ‘NOTA’ కు ఓటు వేయమని తమ కేడర్ కు చెప్పాలి.

(03-04-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి