25, ఏప్రిల్ 2021, ఆదివారం

టీకా తాత్పర్యం – భండారు శ్రీనివాసరావు

 టీకా హిందీ పదం అని  పాశం యాదగిరి కుండ బద్దలు కొట్టి మరీ చెబుతాడు. కాదనడానికి లేదు. ఎందుకంటే ‘హిందీ నా మదర్ టంగ్, తెలుగు  స్టెప్ మదర్ టంగ్’  అని  మరో కుండ బద్దలు కొడతాడు.

టీకా అంటే బిందు, అంటే బొట్టు,  అంటే సింధూరం, అంటే చుక్క అంటూ  ఇలా ఎన్నో అంటేల తర్వాత  చెబుతాడు, ఓ కధ. లోగడ  భుజాల మీద టీకా వేసేటప్పుడు ‘ఏం కాదు చిన్న బొట్టు’ అంటూ వేసేవారట. నిజంగానే  అక్కడ పడ్డ పుండు నయమయిన తర్వాత బొట్టు మాదిరిగా మచ్చ పడేది.

మా చిన్నతనంలో టీకాలు వేసేవాళ్ళు ఊరికి వచ్చాడని తెలియగానే వాళ్లకు కనబడితే పట్టుకుని టీకాలు పొడుస్తారని భయపడి చిన్నపిల్లలం వారి గడ్డి వాముల్లో దాక్కునే వాళ్ళం. అయినా పట్టుకుని పొడిచేవాళ్ళు. టీకా వేసిన చోట మరునాడు పొంగేది. చీము పట్టేది. రసి కారేది. సలసలమని సూదులతో  గుచ్చినట్టు నొప్పి. దానితో పాటే జ్వరం. ఆ టీకా బాధలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఆ టీకాలు ఏమిటో, ఎందుకు వేస్తారో తెలియని వయసు. పెద్దవాళ్లు కూడా చెప్పేవాళ్ళు కారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకి సరైన దారులు ఉండేవి కావు. అయినా టీకాల వాళ్ళు మాత్రం ప్రతి ఊరూ తిరిగి టీకాలు వేసేవాళ్ళు.

ఆ టీకాల పుణ్యమా అని దేశంలో మశూచి వ్యాధి అంతరించి పోయింది. అలాగే పిల్లకు చిన్నతనంలో వచ్చే కోరింత దగ్గులు (ఆస్తమా వాళ్ళ లాగా ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టుగా విడవకుండా దగ్గడం) చిన్న పిల్లల చేష్టలు ( ఉన్నట్టుండి మెలికలు తిరిగి కళ్ళు తేలవేయడం) ఇలా అనేకం వచ్చాయి. అన్ని రకాల టీకాలు వేయించుకున్నాం రాగి దమ్మిడీ ఖర్చు లేకుండా.

ఇవెప్పుడో చిన్నప్పటి టీకాల సంగతులు.

తర్వాత పల్స్ పోలియో వచ్చింది. అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను. 

ప్రభుత్వాలు, ప్రజలు ఏకతాటిపై నిలుస్తే ఒక మహమ్మారిని ఎలా తిప్పికొట్టి, రూపుమాపవచ్చో అనడానికి మనదేశంలో జరిగిన ఈ  పల్స్ పోలియో కార్యక్రమం  ఒక ఉదాహరణ. చిన్నతనంలో వచ్చే ఈ వ్యాధికి గురయి ఏటా లక్షలాదిమంది పిల్లలు జీవితాంతం వికలాంగులుగా జీవచ్ఛవాల మాదిరిగా జీవించే దుస్థితి నుంచి బయట పడేయడానికి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఒక సంజీవనిలా పనిచేసింది. 

బాగా  గుర్తుంది. 1995  డిసెంబరు 10. దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క రోజున అయిదేళ్ళ లోపు వయసున్న చిన్నపిల్లలకు అందరికీ పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వేలాదిమంది డాక్టర్లు, లక్షలాదిమంది వైద్య సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో సైనికుల మాదిరిగా పాల్గొన్నారు. ఒక ఊరు ఒక వాడ అనిలేదు. బస్సు స్టేషన్లలో, విమానాశ్రయాలలో సైతం పోలియో డ్రాప్స్ వేశారు. కొండలు, గుట్టల్లో నివసించే వారి పిల్లలకు ఈ డ్రాప్స్ వేయడానికి వైద్య సిబ్బంది శ్రమ అనుకోకుండా వెళ్ళారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు వున్నారని తెలిసినా సరే, వదిలి పెట్టకుండా చిన్న చిన్న గూడేలకు, తండాలకు వెళ్ళారు.

హైదరాబాదులో విషయాలు ఒక విలేకరిగా నాకు తెలుసు. అప్పుడు హైదరాబాదు పురపాలక సంస్థ ఇండియా పాపులేషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న డాక్టర్ ఏపీ రంగారావును  జంటనగారాలకు సంబంధించి బాధ్యుడిగా ఆరోగ్యశాఖ  కార్యదర్శి రేచల్ చటర్జీ నియమించారు. పల్స్ పోలియో ప్రాముఖ్యత, అవసరం గురించి  సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగించడానికి విస్తృతమైన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజుల్లో ఇటువంటి వాటికి రేడియో బాగా ఉపయోగపడేది. అంచేత ఈ ఈ కార్యక్రమంలో నేనూ కొంత భాగస్వామిని గా వున్నాను.

డిసెంబరు  పదో  తేదీ  దగ్గర పడింది. హడావిడి పెరిగింది. పల్స్ పోలియో కార్యకర్తలు అందరూ ఒక రోజు ముందే తొమ్మిదో తేదీ సాయంత్రానికే మునిసిపల్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది  అంతా పోలింగుకు వెళ్ళే ఎన్నికల అధికారుల మాదిరిగా తరలి వచ్చి పోలియో డ్రాప్స్ వున్న బాక్సులను వెంటబెట్టుకుని వెళ్ళారు.

మరునాడు ఉదయం అప్పటి గవర్నరు,  ముఖ్యమంత్రి  పిల్లలకు డ్రాప్స్ వేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలుపుసొలుపు లేకుండా పనిచేసిన వైద్య సిబ్బంది ఆ రాత్రి ఇళ్లకు చేరేసరికి అర్ధరాత్రి దాటి వుంటుంది.  కార్యక్రమం జయప్రదం అయిన సంతోషంలో వారికి అలసట తెలియలేదు.  

 ప్రతి పల్స్ పోలియో రోజున  కనీసం పదిహేడు కోట్ల మంది పిల్లలకు  ఈ  డ్రాప్స్ వేస్తూ వచ్చారు.  అలా చేస్తూ పొతే, దేశంలో చిట్ట చివరి పోలియో కేసు వెస్ట్ బెంగాల్ లోని హౌరా జిల్లాలో 2011 జనవరి  13 వ తేదీన రిపోర్ట్ అయింది. అదే దేశంలో చివరి పోలియో కేసు. తర్వాత, అంటే అధికార గణాంకాల ప్రకారం 2012 మే 2 వరకు  ఒక్కటంటే ఒక్క పోలియో కేసు కూడా రిపోర్ట్ కాలేదు. పోలియో  రహిత దేశంగా భారత దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012 ఫిబ్రవరి  24న అధికారికంగా ప్రకటించింది.

(25-04-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి