8, ఏప్రిల్ 2021, గురువారం

మమజీవన హేతునా.... రెండేళ్ల నాటి జ్ఞాపకం

ఒక రచన చదివిన తర్వాత ఆహ్లాదం కలగొచ్చు. లేదా ఆగ్రహం రావచ్చు. కానీ నేను మొన్నో చిన్న నవలను (నవలిక అనొచ్చా) చాలా కోపంతో ఊగిపోతూ చదివాను. దానికి కారణం లేకపోలేదు.
స్వాతి వారపత్రిక వారే ఓ మాస పత్రికను కూడా అదే పేరుతొ ప్రచురిస్తూ వుంటారు. వార పత్రిక మొదటి రెండు అక్షరాలకు తగ్గట్టే షడ్రుచుల సమ్మేళనం పేరుతొ కొంత అసభ్యతను కూడా రంగరించి వదులుతుంటారు. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈ పత్రిక ఈనాడు తెలుగునాట చాలా ఇళ్ళల్లో దర్శనం ఇస్తూ వుంటుంది. పిల్లలు చదువుతారేమో అనే బెంగ కొన్నాళ్ళు తలితండ్రులను వేధిస్తూ వుండేది. అయితే జియో పుణ్యమా అని ప్రతి చేతిలో చిన్నాపెద్దా తేడాలేకుండా మొబైల్స్ రావడంతో ఏది అసభ్యత ఏది కాదు అనే చర్చ తెరచాటుకు పోయింది.
బహుశా ఇది దృష్టికి వచ్చిందేమో స్వాతి మాస పత్రిక మాత్రం కడిగిన ముత్యంలా తీసుకువస్తున్నారు. జనం వార పత్రిక ‘స్వాతి’ రుచికి అలవాటు పడ్డారేమో తెలియదు, ఈ మాస పత్రికకు ఆట్టే పాఠకాదరణ వున్నట్టు తోచదు. అయినా చదువరుల దృష్టిలో ఈ మాస పత్రిక ఓ మంచి పత్రిక. సందేహం లేదు.
సరే! కాసేపు ఈ విషయాన్ని తెరవెనక్కు నెట్టి అసలు విషయానికి వస్తాను.
టీవీల్లో చర్చ ప్రారంభానికి ముందు మైక్ టెస్ట్ చేసేటప్పుడు అందరూ మైక్ టెస్టింగ్ వన్, టు, త్రీ అని చెబితే నేను మాత్రం ‘భండారు శ్రీనివాసరావు, భ వత్తు భ. Is it OK?’ అని అడుగుతూ వుంటాను. అయినా సరే అయిదారు సంవత్సరాలుగా వారానికి రెండుసార్లు వెళ్ళే టీవీ చానల్స్ వాళ్ళు ‘బండారు’ అని వత్తు లేకుండానే వేస్తుంటారు. వారిది చాలా సరళ హృదయం. పరుషపు గుండె కాదని నేనే సమాధానం చెప్పుకుంటాను. పోనీలే వచ్చే జన్మలో అయినా లక్ష వత్తుల నోము నోచుకుంటారులే అనుకుంటాను.
వారం రోజుల క్రితం ఫేస్ బుక్ మిత్రులు నాకు స్వాతి మాస పత్రిక సంచికను పంపారు. అందులో ప్రచురించిన ‘మమజీవన హేతునా’ అనే నవలికలో మీ ప్రస్తావన వుంది చూసుకోండి అని పేజి నెంబరుతో సహా తెలియచేశారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక నవలలో ప్రస్తావించ తగిన స్థాయి లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆసక్తిగా తిరగేశాను.
ఆ నవలలో ‘బండారి’ అనే పాత్ర వుంటుంది. ఆ పాత్ర పరిచయం ఇలా జరుగుతుంది.
‘మమ జీవన హేతునా!’ నవలిక 23 వ పేజీ :
“....వాళ్లకు ఏదో సోర్స్ వుంటే వేస్తారు. మనం అడిగితే ఇంకాస్త న్యూస్ జోరు పెంచుతారు. వదిలేద్దాం’ అన్నాడు బండారి. ఆయన పూర్తి పేరు బండారు శ్రీనివాస్ రావు.ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ విభాగంలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.......బండారి ముఖంలో రంగులు మారడం గమనించాడు భరద్వాజ.
“పిచ్చివాళ్ళు. ఆ న్యూస్ మీడియాకు నేనే ఇచ్చానని తెలీదు” అనుకున్నాడు అతడు. అతడ్ని రెండు మూడు సార్లు మీడియా చర్చల్లో కూడా చూసిన గుర్తు.
ఇంటి పేరులో వత్తు మినహాయిస్తే మిగిలిన వర్ణనలు అన్నీ నాకు వర్తించేలానే వున్నాయి. నేను రేడియోలో వార్తా విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కనబడుతుంటాను. నా గురించి కాదని ఎలా అనుకుంటాను? అందుకే కోపం వచ్చింది. ఆ కోపంతోనే ఆ నవల చదివాను. నిజానికి ఆ పాత్రకు నా నేపధ్యం లేకున్నా తేడా ఏమీ రాదు. మరి ఆ నవల రాసిన రచయిత్రి నన్నెందుకు ఈ నవల్లోకి దింపారు.
వివరాలు చూసాను. అది రాసింది శ్రీమతి తటవర్తి నాగేశ్వరి. ఊరు కొవ్వూరు. ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు.
ఫోన్ చేసి అడిగాను.
ఆవిడ గారికి కూడా ఇలానే కొందరు ఫోన్లు చేసి అడుగుతున్నారట. ఒక జర్నలిస్ట్ పాత్రకు నా వివరాలు వాడుకున్నారట. ఆ నవలలో రాష్ట్రపతి పాత్ర కూడా వస్తుంది. దానికి అరుణ్ ముఖర్జీ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి పేరు శేఖర్ నాయుడు. నా పేరును ఇలా మార్చారు.
రచయిత్రి తటవర్తి నాగేశ్వరి గారు చాలా బాధ పడ్డారు. అది ఆవిడ కంఠంలో కనపడింది. నాకిచ్చిన మెసేజ్ లో కూడా మరోమారు కనబడింది.
“శ్రీనివాస్ రావు గారి కి నమస్కారాలు.
మీ పేరు ఒక మంచి పాత్రకు వాడాను.అన్యధా భావించ కండి
మన్నించండి
ఒక వేళ మీరు మనస్థాపానికి గురి అయితే నన్ను హృదయ పూర్వక న్గా ఛమించండి..
నాగేశ్వరి” (వాట్సప్ లో తెలుగు టైప్ చేసేటప్పుడు కొన్ని ముద్రారాక్షసాలు దొర్లుతూనే వుంటాయి, అది సహజం)
ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి.
ఎందుకంటే ఇది జీవితం. కల్పన కాదు.
(08-04-2019)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి