19, ఏప్రిల్ 2021, సోమవారం

అభిమాన ధనమే నిజమైన సంపద

(ఏప్రిల్ 20 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం)

గమనిక: ఈ వ్యాస పరిధి  ఒక విలేకరిగా నాకు తెలిసిన చంద్రబాబు నాయుడికే పరిమితం. అంటే రాష్ట్రవిభజనకు పూర్వం వరకే. ఆ తరువాత నేనెన్నడూ వారిని ముఖాముఖి కలుసుకున్నది లేదు)

 

ప్రతి ఏడాది ఏప్రిల్ పందొమ్మిదవ తేదీన మాకు తెలిసిన ఓ విజయవాడ వాస్తవ్యురాలు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు,  బస్సులో బయలుదేరి మరునాటి ఉదయం కల్లా హైదరాబాదు చేరుకొని చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోవడం నాకు తెలుసు. ఎందుకంటే ఆరోజు ముఖ్యమంత్రి నివాసంలో రద్దీని తప్పించి, ఆయన్ని కలుసుకునే వెసులుబాటు కల్పించడం అనే బాధ్యత ఆవిడ నా భుజస్కందాలపై వుంచేది. ఆయన అధికారంలో వున్నప్పుడు, లేనప్పుడు కూడా ఆవిడ అలా ఏటా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోవడం ఏళ్ళ తరబడి చూస్తూ వచ్చిన నాకు చంద్రబాబు అదృష్టవంతులైన రాజకీయ నాయకుల కోవలో ఒకరని అనిపించేది.

ఇప్పుడు కూడా ఆవిడ అలాగే వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే 2005  లో నేను రిటైర్ అయిన తర్వాత ఇలాంటి పనులు నెత్తికెత్తుకోవడం మానేశాను.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నాకూ, ఆయన పేషీ అధికారులకు నడుమ స్నేహపూర్వక కీచులాటలు నడుస్తుండేవి.

“ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..” అన్నాడో అధికారి ఓ రోజు నాతో తన  మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.

ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.

ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!” అనేవారు  సౌమ్యుడయిన ఆ అధికారి.

ఎమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా  పిలిచిన వాళ్ళు ఆయన పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం” అనేవాడిని నేను.

తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది. పెళ్ళిళ్ళకే కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.

రేపు ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. వారికి నా శుభాకాంక్షలు.

(19-04-2021)



2 కామెంట్‌లు: