6, మార్చి 2021, శనివారం

నాది నాది అనుకున్నది నీది కాదురా! – భండారు శ్రీనివాసరావు

 

పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్ళు మారుస్తుందని అంటారు. మేము మా పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము. ఆఖరికి ఇళ్ళ సమస్య లేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.

1975 లో హైదరాబాదు రేడియోలో చేరినప్పుడు 75 రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి ‘పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్. కాలనీకి మా మకాం మారింది. , సెకండ్ క్లాసు టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కొన్నేళ్ళు కాపురం. రిటైర్ కాగానే, తదుపరి ఎల్లారెడ్డి గూడా. ఇదిగో ఇప్పుడు మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో తెలవదు. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో. ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అదే కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.

ఇలా  రోజులు  గడుపుతున్న రోజుల్లో  ఓ రోజున, మా ఇంటాయన, ఆయన ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము, తాలూకు ఒక పెద్ద మనిషి వచ్చి చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు, రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని.

మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే పోలా.

బాధ అల్లా ఒక్కటే. మిగిలిన చోట్లతో పోలిస్తే, ఈ మాదాపూర్ లో మానవ సంబంధాలు అంతంత మాత్రం. పావురాలు, మొక్కలతోనే అనుబంధం. దాన్ని తెంచుకోవడం ఎల్లా అన్నదే ఒక్క  మనాది.

కొసమెరుపు: భూమి గుండ్రం సామెత మాదిరిగా మళ్ళీ యెల్లారెడ్డి గూడాకే, అదే ఇంటికే మళ్ళీ చేరాం.

5 కామెంట్‌లు:

  1. జనరల్ గా రిటైర్ అయినా తరువాత ఇల్లు కొనేసుకుని ఒక దగ్గర ( సొంతూరు లో ) స్థిరపడిపోతారు కదా ?
    ఇంకొక విషయం ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను , సుమారు నలభై సంవత్సరాల క్రితం , మీరు డే కేర్ సెంటర్ మొదలు పెట్టారు అని చెప్పారు కదా ? 1980 నాటికే డే కేర్ సెంటర్ లు డిమాండ్ ఉండేదా ? నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ రోజుల్లో స్కూల్ వరకు పిల్లలు ఇంట్లోనే ఉండేవారు కదా అని. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం అనేది అప్పటికి ఇంత ఎక్కువగా లేదేమో అని నా అనుమానం . : Kasi

    రిప్లయితొలగించండి
  2. @ అజ్ఞాత : When I could have, I could not have. When I want have I cant have అన్నట్టు ఒక వయసులో ఏర్పాటు చేసుకోవాల్సిన ఇల్లు. మరో వయసులో అలవిమారిన విషయంగా మారిపోతుంది. ఇకపోతే ఆ రోజుల్లో బ్యాంకుల్లో ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలే ఎక్కువగా మా ఆవిడ నడిపిన సెంటర్ లో చేరేవాళ్ళు.

    రిప్లయితొలగించండి
  3. జీవితాంతం అద్దెలకు తగలేసింది పెడితే సొంత ఇల్లే కొనుక్కోవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. @ సూర్య : మానేయకముందు సిగరెట్ల మీద తగలేసిన డబ్బులతో ఏకంగా ఓ పెద్ద మేడ వచ్చేది.

    రిప్లయితొలగించండి
  5. మనేసిన తరూవత అ డబ్బు ఏమి అయ్యిందొ ఎవరికీ తెలియదు

    రిప్లయితొలగించండి