కోవిడ్ టీకా వేయించుకునే వారికోసం, టీకా
వద్దు అని సందేహపడే వారి కోసం ఈ పోస్టు.
ఈరోజు నేను ఈ టీకా వేయించుకున్నాను. వేయించుకుని
కూడా చాలా గంటలు గడిచిపోయాయి. సమగ్రమైన పోస్టు పెడదాం, ఈలోపల
టీకా విషయంలో నాకున్న సందేహాలు (After effects వంటివి) తొలగిపోవడానికి సమయం దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో
కొంత ఆలస్యం చేసిన మాట నిజం.
మరో నిజం కూడా చెప్పాలి. ఈరోజు ఉదయం వరకు టీకా
తీసుకోవాలనే ఉద్దేశ్యం కూడా లేదు. దాదాపు ఏడాదిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు
ఇప్పుడీ టీకా గొడవ ఎందుకులే అని సంక్షేపించిన మాట కూడా వాస్తవం.
అయితే గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో
నాకు తెలిసిన అనేకమంది టీకా వేయించుకున్నట్టు పోస్టులు పెట్టారు. ఇంకా చిత్రం
ఏమిటంటే వీరిలో ఓ పాతిక ముప్పయిమంది దాకా
మా దగ్గరి చుట్టపక్కాలే వున్నారు.
ఇక మనం మాత్రం ఎందుకు లేటు చేయాలి అని మామూలు ప్రొసీజర్
ఫాలో అయి ఓ ఇరవై మందిమి రిజిస్టర్ చేయించుకున్నాము. ఇందులో జ్వాలా కుటుంబం వుండడం
మాకు కలిసి వచ్చింది. పబ్లిక్ హెల్త్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సహాయ
హస్తం అందించారు.
పదకొండున్నర ప్రాంతంలో అందరం అక్కడ జమ
అయ్యాము. చక్కటి పకడ్బందీ ఏర్పాట్లు
చేశారు. ఆధార్ కార్డు, PAN
కార్డు నెంబర్లు తీసుకుని, ఓ ఫారం మీద మూడు
సంతకాలు, వేలి
ముద్ర పెట్టించుకుని ఒక చీటీ ఇచ్చారు. అది
తీసుకుని వేరే కౌంటర్ వద్దకు వెడితే బీపీ చెక్ చేసి మరో కౌంటర్ లో మొబైల్ నెంబరు వివరాలు రాసుకున్నారు. పక్కనే వున్న
మరో కుర్చీలో కూచోబెట్టారు. మంజుల అనే ఓ లేడీ
నర్స్ వచ్చి భుజం మీద ఇంజెక్షన్ చేసి చాలా సున్నితంగా టీకా మందు ఇచ్చారు. సూది చాలా సన్నగా వుంది. ఏమాత్రం నొప్పి
అనిపించలేదు. టీకా ఇవ్వగానే వేలి మీద
ఓటరుకు పెట్టినట్టు చుక్క గుర్తు వేశారు. పక్కన గదిలో కాసేపు కూర్చోమని చెప్పారు.
తాగేవారికి తేనీరు ఇచ్చారు. ఓ అరగంట
తర్వాత వెళ్ళిపోయి, ఇరవై ఎనిమిది రోజులు
విరామం ఇచ్చి ఇరవై తొమ్మిదో రోజున వచ్చి, మళ్ళీ రెండో డోసు టీకా తీసుకోమని చెప్పారు. దీనికి
సంబంధించి సెల్ ఫోన్
మెసేజ్ పంపుతారు. టీకా వేసిన చోట
దద్దురు రావడం కానీ, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు మాకే కాదు, ఈరోజు
మాతో పాటు టీకా వేయించున్న ఏ ఒక్కరికీ
ఎదురవ్వలేదు. టీకా వేయక ముందు అందరి మొహాల్లో కనిపించిన ఆందోళన, వేసిన తర్వాత
మచ్చుకు కూడా కనిపించ లేదు. ప్రతి ఒక్కరూ
సంతోషంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. మేము కూడా హాయిగా ఇళ్లకు తిరిగి వచ్చి భోజనాలు చేశాము. మా
బ్యాచ్ సంఖ్య పెద్దది కావడం వల్ల కొంచెం
ఎక్కువ సమయం పట్టింది. చిన్న కుటుంబం అయితే గంటలో అయిపోయేదేమో. రెండు డోసులు పూర్తయిన
తర్వాత కోవిడ్ టీకా సర్టిఫికేట్ జారీ చేస్తారు.
కరోనా కట్టడి విషయంలో ముఖ్యంగా కోవిడ్ టీకాల
విషయంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అత్యంత చక్కని సమన్వయం నాకక్కడ కనపడింది.
చివర్లో చెప్పేది ఒక్కటే.
టీకా తీసుకోవడానికి ముందు పాటించాల్సింది ఏమిటి
అంటే అది ఒక్కటే.
“భయ సందేహాలను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లి
టీకా వేయించుకోండి”
(03-03-2021)
మంచి పని చేశారు.
రిప్లయితొలగించండిఇవాళ పొద్దున్న రిజిష్టర్ చేయించుకుంటే వెంటనే .. అంటే ఈ రోజుకే .. టీకా స్లాట్ (slot) దొరికిందా? బాగానే ఉందే? ఏ హాస్పిటల్ ఏమిటి?