20, మార్చి 2021, శనివారం

చంద్రబాబుకి కితాబు ఇచ్చిన కుల్ దీప్ నాయర్ – భండారు శ్రీనివాసరావు

 

చంద్రబాబు నాయుడు గారిది  విలక్షణమైన తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.

1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.

"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.

'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్రప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.

'ఆంద్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.

'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. మా ప్రభుత్వం ఆ దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'

'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'

1 కామెంట్‌: