14, మార్చి 2021, ఆదివారం

మీడియాలో సిత్రాలు


జనాలకు చిత్రవిచిత్రాలు చూపే మీడియాలో కూడా ‘సిత్రాలు’ వుంటాయి.
మామూలుగా ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున మీడియా సందడి సందడి చేస్తుంది. బ్యాలెట్ పెట్టెల సీళ్లు విప్పినప్పటి నుంచి, బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టడం మొదలైనప్పటి నుంచి టీవీ స్టూడియోల్లో చర్చలు ప్రారంభిస్తారు.

ఇప్పుడు అంటే వ్యక్తిగత కారణాల వల్ల పోవడం లేదు కానీ గతంలో నాకీ హడావిడి ఎక్కువనే చెప్పాలి. ఉదయం మొదలుపెడితే రాత్రి పొద్దు పోయేవరకు ఈ టీవీ చర్చలు రోజంతా సాగుతూనే ఉండేవి. మధ్యాన్న భోజనం సమయానికి ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే ఏదో ఒక స్టూడియోకి వెడుతూ ఉండేవాడిని, ‘ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు’ అనే సామెతను నిజం చేస్తూ.

ఇంతకీ చెప్పాలని మొదలుపెట్టిన ‘సిత్రం’ ఏమిటంటారా!

2019లో ఎన్నికల ఫలితాల రోజున ఇలాగే అనేక టీవీ ఛానళ్లకు ముందుగానే ‘ఉభయం’ ఒప్పుకున్నాను. అదో పెద్ద టైం టేబుల్ లాగా వుండేది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పలానా టైంలో పలానా టీవీ అని.

అలాగే ఆరోజు ఉదయం నుంచి మిట్ట మధ్యాన్నం దాకా నాలుగయిదు ఛానళ్లలో చర్చాకార్యక్రమాల్లో పాల్గొని భోజనానికి వచ్చాను. తర్వాత ఎటూ కదలకుండా ఇంట్లో సోఫాలోనే పడుకుని టీవీ చూస్తుంటే మా ఆవిడ గమనించింది.

‘రాత్రిదాకా క్షణం తీరిక లేదన్నారు. మరి ఇప్పుడేమిటి ఈ వరదరాజస్వామి అవతారం అవటా! అని ఆరాలు మొదలు పెట్టింది.
అసలు విషయం ఆమెకు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.

అప్పటిదాకా వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత చర్చలు పెట్టి ఇక లాభం లేదనుకున్నారో ఏమిటో, కొన్ని చానళ్ళ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ప్రోగ్రాములు కాన్సిల్ చేసుకున్నట్టు నా ఫోనుకు వర్తమానం పంపారు.

కానీ ఆవిడకి ఈ మీడియా ‘సిత్రాలు’ యేమని చెప్పను, ఎలా చెప్పను?
(14-03-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి