28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఓ కప్ప కధ

 అనగనగా ఓ కప్ప. ఆ కప్పకు ఓ రోజు చెట్టెక్కాలని బుద్దిపుట్టింది. అనిపించిందే తడవు, నున్నగా సన్నగా వున్న ఓ చెట్టు చూసుకుని ఎక్కడం మొదలెట్టింది. మిగిలిన కప్పలు చుట్టూచేరి, 'వద్దు వద్దు, చెట్లెక్కడం మన ఇంటా వంటా లేదు. అందులోను అంత పొడుగు చెట్టు అసలెక్కలేవు. అక్కడినుంచి పడ్డావంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు, దిగిరా దిగిరా' అని నిరుత్సాహపరుస్తూ బావురుమంటూ వెంటపడ్డాయి. అయినా లెక్కచేయకుండా ఆ కప్ప అమాంతం ఆ చెట్టెక్కి కూర్చుంది.

యెలా?

యెల్లా అంటే, ఆ కప్ప చెవిటిది. ఒక్క ముక్కా వినబడదు. అందుకే తోటికప్పలు బావురు బావురుమంటూ, 'వద్దు వద్దం'టూ ఇచ్చే ప్రతికూల సలహాలు దాని చెవికెక్కలేదు. అందుకే హాయిగా చెట్టెక్కగలిగింది.

ఈ కప్ప కధలోని నీతి ఏమిటంటే ఏ పనిచేయబోయినా 'వద్దు వద్దు ఆ పని నువ్వు చెయ్యలేవు' అని నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ వుంటారు. సాహసాలు చేసేవాళ్ళు అలాటి మాటలు చెవిన పెట్టకూడదు. ఎవరేమన్నా ముందు అనుకున్న రీతిలోనే ముందుకు సాగిపోవాలి.

 

పి.శివశంకర్ – ఓ జ్ఞాపకం

 

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది. విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు. ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు. ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.


జీవితం చీకటి వెలుగుల రంగేళి - భండారు శ్రీనివాసరావు

 ఆనందం, విచారం ఒకేసారి పెనవేసుకుని వచ్చిన సమాచారం వస్తే దాన్ని మించిన విషాదం ఏముంటుంది?

అరుణ్ మొహంతి.

ముప్పయ్యేళ్ళ క్రితం రేడియో మాస్కోలో సహోద్యోగి. ఒరిస్సా (అప్పుడు అదే పేరు) నుంచి చదువుకోవడానికి మాస్కో వెళ్ళాడు. చదువుకుంటూనే మాస్కో రేడియోలో అప్పుడప్పుడూ ఒరియాలో వార్తలు చదివేవాడు. చివరికి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. నేను తెలుగులో వార్తలు చదవడానికి కుటుంబంతో సహా మాస్కో వెళ్ళినప్పుడు పరిచయం. మృదుస్వభావి. మార్క్సిజాన్ని ఆపోసన పట్టాడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతోనే కానవచ్చేవాడు. సాయంకాలక్షేపాల్లో సయితం మాటలు తూకం వేసుకుని మాట్లాడేవాడు. నేను సరదాగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని. మేము అక్కడికి వెళ్ళిన రెండేళ్లకు కాబోలు పెళ్లయింది. వధువు నమిత. ఒరియా అమ్మాయి. బాగా చదువుకున్నది. కొత్త సంసారం. అప్పటికి మా ఆవిడే ఆమెకు పెద్ద దిక్కు. ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరిగే వాళ్ళు.

పంజాబీ, హిందీ, బెంగాలి, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడంతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో వార్తలు ప్రసారం అయ్యేవి. అందరం కుటుంబాలతో కలిసి రేడియో మాస్కో వారు ఏర్పాటు చేసిన పలు అంతస్తుల భవనంలో కాపురాలు వుండేవాళ్ళం. కమ్యూనిస్ట్ శకం ముగిసి సోవియట్ యూనియన్ అంగ,వంగ కళింగ దేశాల మాదిరిగా విడివడ్డ తరువాత మేము మాస్కో నుంచి హైదరాబాదు వచ్చేసాము. అరుణ్ దంపతులు మాస్కోలోనే వుండిపోయారు. తరవాత మా నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. చూస్తుండగానే ముప్పయ్యేళ్లు గడిచిపోయాయి.

పీ. ఎస్. మూర్తి. ఒకప్పుడు రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి దగ్గర అయిదేళ్ళపాటు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు. వ్యాపారపనుల నిమిత్తం మాస్కోలో మేమున్న రోజుల్లో అక్కడికి వచ్చి వెడుతుండేవారు. సూర్యనారాయణ గారు మా ఆవిడకు వరసకు బాబాయి అవుతారు. అంచేత మూర్తిగారు కూడా మాస్కో వచ్చినప్పుడల్లా మాఇంటికి వచ్చేవారు. అక్కడే మూర్తి గారికీ, అరుణ్ మొహంతితో పరిచయం అయింది. మేము ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా అనేక ఏళ్ళపాటు ఆ స్నేహం కొనసాగింది. మాస్కో వెళ్ళినప్పుడల్లా మొహంతిని కలిసేవారు. వ్యాపార విషయాల్లో తనకు తోచిన సలహాలు మూర్తికి చెబుతుండేవాడు అరుణ్.

తరువాత మూర్తి కుటుంబంతో సహా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారానే అరుణ్ చనిపోయాడనే ఓ విషాద వార్త తెలిసింది.  ఆయన ఇచ్చిన నెంబరుకు ఒక మెసేజ్ పెట్టాను, నేను పలానా అని పరిచయం చేసుకుంటూ.

నమిత నుంచి వెంటనే జవాబు వచ్చింది.

మాస్కో రేడియోలో భారతీయ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత కూడా పద్నాలుగేళ్ళు అరుణ్ దంపతులు అక్కడే వుండిపోయారట. తరువాత ఢిల్లీ వచ్చేశారు. అరుణ్ మొహంతికి జేఎన్యూలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. భార్య నమిత కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా చేరారు. బాగా సెటిల్ అయ్యామని అనుకుంటున్న తరుణంలో అరుణ్ కిడ్నీవ్యాధిబారిన పడి కన్నుమూశాడు. అతడి తలితండ్రులు ఇద్దరూ ఏడాదిలోపలే మరణించారు.

అరుణ్ కుటుంబంతో మూడు దశాబ్దాల తరువాత సంబంధాలు ఏర్పడ్డాయని సంతోషించాలో, అరుణ్ ఇక లేడని తెలిసి బాధపడాలో ఏమీ తెలియని స్థితి.

27, ఫిబ్రవరి 2021, శనివారం

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

 

Srinivasa Subrahmanya Sai Bhagavatulaగారు  నా వేరే  పోస్టుకి కామెంటు పెడుతూ ఈ కింది ప్రశ్న అడిగారు. జవాబు క్లుప్తంగా ఇవ్వడం కుదరక  మళ్ళీ  ఓ పాత పోస్టునే  పెడుతున్నాను. వారికి  నా కృతజ్ఞతలు

వారిలా రాశారు:

 

 

“ఇది సందర్భం కాదు అని తెలుసు, అయినా సాహసించి ఇక్కడ మిమ్ములను అడుగుతున్నాను,దయచేసి అన్యధా భావించకండి.

మీరు నెహ్రూ కాలాల్లో ఆయన పరిపాలనపై ఊమెన్ అనే కార్టూన్ చిత్రకారుడు వేసిన వ్యంగ్య కార్టూన్ లపై నెహ్రూగారు ఎప్పుడైనా అసహనం చూపించటం గానీ, మండిపడటం కానీ విన్నారా, చూశారా చదివారా ?

కిందిది నా జవాబు :

 

 

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు, జోకులు. దినవారీ సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. దురదృష్టం ఏమిటంటే, ఆరోగ్యకరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలను కూడా హరాయించుకోలేని వాతావరణం ఈనాడు సమాజంలో వుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, వారి అనుయాయుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి.

ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ అది. నెహ్రూ అభిమానులనుంచి దాడి తప్పదని అనుకుంటుంటే, ఊహించని విధంగా లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఫోన్ వచ్చింది.

ఈరోజు ఉదయం పత్రికలో మీ కార్టూన్ చూశాను. చూడగానే నాకెంతో సంతోషమయింది. నా మనసుకు ప్రశాంతత చిక్కింది. నాదో కోరిక. అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అడిగారు నెహ్రూ, కాసింత శ్లేషతో కూడిన హుందాతనం చూపిస్తూ. (https://www.ndtv.com/opinion/when-nehru-was-caricatured-by-rk-laxman-558107)

వెనక, ప్రసిద్ధ కార్టూనిస్టు శంకర్ ఆధ్వర్యంలో శంకర్స్ వీక్లీ అనే పూర్తి నిడివి కార్టూన్ల పత్రిక వచ్చేది. ఇందిరాగాంధీ హయాములో దేశంలో ఎమర్జెన్సీ అమలు అవుతున్న కాలంలో పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా కార్టూన్ గీయడం తనకు సాధ్యం కాదని చెబుతూ ఆయన ఆ పత్రిక ప్రచురణనే నిలిపివేశారు.

ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా, వారివారి అనుయాయులవారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.

బాపూ సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ హెలికాప్టర్ కొని దానికి యాదగిరి అని పేరు పెట్టారు. ఒక ప్రముఖ పత్రిక అంజయ్య గారి కార్టూన్ వేసినప్పు డల్లా ఆయన వేలికి హెలికాప్టర్ కట్టి ప్రచురించేది. అయన కూడా అది చూసి నవ్వుకునే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలం తెచ్చిన మార్పు ఇది. అప్పుడు హెలికాప్టర్ అసహజం, ఇప్పుడు విమానాలు సహజం. ప్రతి విమర్శా, ప్రతి జోకూ రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడానికి ఉద్దేశించించినవని అనుకోకూడదు.

నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అలా కార్టూన్ల రూపంలో వ్యక్తీకరింపబడుతుంటాయి. వాటిని చూసి, చదివి హాయిగా నవ్వుకోగలిగితే (అంజయ్య గారిలాగా) ఏ గొడవా వుండదు. (15-11-2020)

 

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

News Watch With Journalist Bandaru Srinivas rao Part 1 (2014)


రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయి,   తెలంగాణా రాష్ట్రం  ఆవిర్భావానికి   ముందు,  అప్పటి  ఎన్నికలపై  ఇచ్చిన ఇంటర్వ్యూ. ఒక మిత్రుడు  అమెరికా నుంచి వాట్సప్ లో పంపారు, ఇప్పటి ఎన్నికల పరిస్తితులకు అనుగుణంగానే ఉందంటూ.


చివరి నవ్వు

 

2019, ఆగస్టు.
గలేరియా మాల్ లో ఓ షాపు.

“ఎంత”
“ట్వెల్ ఫిఫ్టీ”
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.

అప్పుడు వినపడింది నవ్వు.
ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.
ఆమె వైపు చూస్తే ఆ అమ్మాయి నా మొహం లోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?
తీరా చూస్తే మా ఆవిడే.

నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.

అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా ఏమన్నాను?
ఆ తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.

తర్వాత ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.
“మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.

ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ ఓ షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.
డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.

ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి అవుతుందని.

నవ్వు లాగే జ్ఞాపకాలు.
తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు (Idream)


చెప్పింది చెప్పినట్టు, చెప్పింది మార్చకుండా (ఇంటి పేరుతొ సహా) నా జీవనయాన క్రమాన్ని నాతోనే చెప్పించిన  ఐ డ్రీం (Idream) నాగరాజు గారికీ, అ సంస్థ యాజమాన్యానికీ కృతజ్ఞతలు. 

https://youtu.be/jVNIPkwB_48


21, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఓ మంచి పుస్తకం చదివాను – భండారు శ్రీనివాసరావు

 మంచి పుస్తకం చదవడానికి, మంచి సినిమా చూడడానికి, మంచి పాట వివిధభారతిలో వినడానికీ చెరువులో చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓపిక వుండాలని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చెబుతుండేవారు. గాలం వేసి ఎంతో ఓపికగా ఎదురుచూడగా, చూడగా ఒక మంచి చేప ఆ గేలానికి చిక్కుతుంది. అలాగే పుస్తకాలు, సినిమాలు, రేడియోలో పాటలు కూడా. చదవగా చదవగా ఓ మంచి పుస్తకం, చూడగా చూడగా ఓ మంచి సినిమా, వినగా వినగా ఓ మంచి పాట అలా అన్నమాట.

సలీం గారు మంచి రచయిత. గతంలో వారి కధలు అనేక పత్రికల్లో చదివాను. బాగా రాస్తుంటారు, పెద్ద ఉద్యోగ బాధ్యతల నడుమ తీరిక చేసుకుని.
ఆ మధ్య తాను రాసిన ఒక నవలను అభిమానంతో నాకు కొరియర్ లో పంపారు. చాలా రోజులుగా అది మంచంమీద నా తలగడ పక్కనే వుండేది. ఏరోజుకారోజు చదవాలని అనుకోవడం. మరేదో రాసే హడావిడిలో దాన్ని పక్కన పెట్టడం.



రాత్రి శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత సలీం గారి నవల చేతిలోకి తీసుకున్నాను. అలా చదువుతూ పోయాను. గంట, రెండు గంటలు అలా సమయంతో నిమిత్తం లేకుండా చదువుతూనే వున్నాను. పూర్తిచేసిన తర్వాత కానీ పుస్తకం కింద పెట్టలేదు, నేను నిద్ర పోలేదు.
మంచి పుస్తకం అంటే ఒక పెద్దాయన చెప్పిన నిర్వచనం జ్ఞాపకం వచ్చింది.
“ఏకబిగిన చదివించగలగాలి. చదవడం పూర్తి చేసిన తర్వాత కూడా చాలా సేపు ఆ లోకంలోనే వుండిపోగలిగేలా చేయగలగాలి. గుండె గొంతుకలో కొట్టాడుతున్నఅనుభూతి కలిగించాలి”
సలీంగారు రాసిన “మౌన రాగాలు” అనే ఈ పుస్తకానికి ఆ మూడు లక్షణాలు వున్నాయని చదవడం పూర్తి చేసిన తర్వాత నాకనిపించింది.
అభినందనలు సలీంగారూ. (21-02-2021)

20, ఫిబ్రవరి 2021, శనివారం

గజిబిజి పలుగులు - భండారు శ్రీనివాసరావు

 “అర్ధం చేసుకోగలిగితే వేదాంతం చాలా గొప్పది.

పారమార్ధికం, పారలౌకికం  ఈ రెంటినీ సరైన పాళ్ళలో కలిపితే అదే వేదాంతం అవుతుంది. గీతలో భగవానుడు బోధించింది అదే.

“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం నాకు  వదిలేయ్”

ఎవరి పని వాళ్ళు చేయడం పారలౌకికం. ఫలితాన్ని పరమాత్ముడికి వదిలేసి దేనికీ తాపత్రయ పడకపోవడం పారమార్ధికం.

ఇలా చేస్తే స్వార్ధరహిత కర్తవ్యపాలన జరుగుతుంది. దాన్ని పరిపాలన అనండి, ఉద్యోగం అనండి, కుటుంబ బాధ్యతలు అనండి, ఇంకేదైనా అనండి. అన్నిటికీ ఈ సూత్రాన్ని పాటిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.

కానీ జరుగుతున్నది తద్విరుద్ధం. పారమార్ధిక భావాలు బాగానే ప్రబలుతున్నాయి. అలాగే పారలౌకిక భావనల్లో స్వార్ధ తలంపులు కూడా.

భగవద్గీతను భక్తిగా తలమీద పెట్టుకుంటాం కాని, అందులో చెప్పిన దాన్ని నిబద్ధతతో తలకెక్కించుకో౦!

కలివిడిగా వున్నప్పుడు కూడా మనసును విడిగా ఉంచుకోగలగాలి. విడిగా వున్నప్పుడు సైతం నలుగురితో కలిసివున్నామన్న భావన పెంచుకోవాలి.

ఏమిటో శంకరాభరణం శంకర శాస్త్రిగారి మాటల్లాగా ఒక్కటీ అర్ధం కావడం లేదనిపిస్తోందా!

అందుకే దాన్ని వేదాంతం అన్నారు శిష్యా!”

అనుగ్రహభాషణ ముగించారు  ఏకాంతానందస్వామి.  

(20-02-2021)

రష్యన్ భాషలో శంకరాభరణం సినిమా

 

1979వ సంవత్సరం లో ఒక రోజు.
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
కట్ చేస్తే.....
మళ్ళీ 2017లో...
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.


(విశ్వనాద్ గారితో రచయిత)


శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”
చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.
సీన్ కట్ చేసి కొంత వెనక్కి వెడితే....
1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.
సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా.
పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.
సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

17, ఫిబ్రవరి 2021, బుధవారం

బ్రహ్మరాత - భండారు శ్రీనివాసరావు

వంద ఏళ్ళ క్రితం రూపాయే? ఇప్పుడూ రూపాయే!
ఏమిటి? వడ్డీ! అక్షరాలా అంతే! ఈరోజే అక్షరాల్లో చూశాను. కానీ ఆ వ్రాత బ్రహ్మ వ్రాత. ఒక పట్టాన అర్ధం కాదు. ఎందుకంటే అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు.
పాత కాగితాలు, దస్తావేజులు వెనక భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ ఏర్పడడం వల్ల కొంతా, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి.
రేడియోలో కలిసిపనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు ఒక పాత దస్తావేజు ప్రతి పంపారు. ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది. ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) వారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారు గంగన్న గారు.
గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదువందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట. ఈరోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది. గంగన్న గారు వుండేది రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు.
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతిరాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రూపాయి విలువచేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891.......తన్కు (ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యి౦ద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తన్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీరోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గ౦న్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. (17-02-2021)