8, జనవరి 2021, శుక్రవారం

ఆత్మస్తుతి పరనింద

మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మ ద్రోణులు నేల కూలిన తర్వాత సైన్యాధిపత్యం స్వీకరించిన కర్ణుడు కదనరంగంలో అర్జునుడు లేని సమయం చూసి చెలరేగిపోతాడు. ధర్మరాజుపై శరపరంపరగా అస్త్రాలు ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తాడు.

సూర్యాస్తమయం కాగానే నాటి యుద్ధం ముగుస్తుంది. గాయపడ్డ శరీరంతో, బాధ పడుతున్న మనసుతో ధర్మజుడు గుడారం చేరతాడు. అక్కడ తమ్ముడు అర్జునుడిని చూడగానే మనసులోని మాట పైకి వస్తుంది.

కర్ణుడు బాణ ప్రయోగంతో తనను నిలువెల్లా గాయపరుస్తుంటే వెంట వుండి కాపాడాల్సిన పాండవ మధ్యముడు కనిపించకుండా పోయాడని’ నిందారోపణ చేస్తాడు.

కౌరవులతో సాగిస్తున్న ఈ మహా సమరంలో తాను ఒక్కడే పదుగురి పెట్టున ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని, అలాంటి తనపైనే ఈ నిష్టూరాలు ఏమిటని కిరీటి బాధపడతాడు. ఇంతటి నింద మోస్తూ జీవించడం కంటే మరణమే మేలని ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. అది గమనించిన యుధిష్టురుడు, ‘తొందరపడి మాట తూలినందున తాను ప్రాణాలు త్యజించడమే సబబని’ తమ్ముడిని వారించబోతాడు.

వీరి సంభాషణను ఆలకించిన శ్రీ కృష్ణుడు వారితో ఇలా అంటాడు.

మీరిద్దరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే తమ్ముడిని నిష్కారణంగా నిందించినప్పుడే ధర్మజుడు మరణించాడు. అలాగే ఆత్మస్తుతికి పాల్పడినప్పుడే పార్ధుడు జీవచ్చవంగా మారిపోయాడు”.

మహాభారతంలో ప్రక్షిప్త కధనంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వృత్తాంతం తెలిపేదేమిటంటే ఆత్మస్తుతి (స్వోత్కర్ష) పరనింద (ఆరోపణ) వీటికి పాల్పడే వాడు జీవించి వున్నా మరణించినట్టు లెక్కే అని.

 


1 కామెంట్‌:

  1. హేవిటోనండీ పురాణగాథలు 🤔🙂! ఆఫీసుల్లో చాలా మంది పాటించేదే ఆత్మస్తుతి, కొండొకచో చాటుమాటుగా పరనింద కదా.

    అసలు ఈ నాటి రాజకీయ నాయకులు చేసేదే ఆత్మస్తుతి పరనిందానూ. వాళ్ళేమీ జీవచ్చవాలు అవడం లేదు, పైపెచ్చు ఇంకా ఇంకా చెలరేగి పోతున్నారు.

    రిప్లయితొలగించండి