సూటిగా
సుతిమెత్తగా .......
కురువంశ చక్రవర్తులైన ధృతరాష్ట్రుడు, ఆయన సోదరుడు పాండురాజు అన్నదమ్ములు.
‘ఈ
సోదరుల సంతానం అయిన గాంధారి పుత్రులు కౌరవులు, కౌంతేయులైన పాండవులు తమ తండ్రుల
బాటలోనే కలిసిమెలిసి ఉంటారని అనుకున్నానే కానీ ఇలా విడిపోయి కయ్యాలకు కాలు
దువ్వుతారని ఊహించలేకపోయాన’ని కురుక్షేత్ర సంగ్రామానికి వారు సంసిద్దులవుతున్న తరుణంలో భీష్మ పితామహుడు మధన
పడతాడు.
భారత
రాజ్యాంగం రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈనాడు జీవించి వుంటే, నేటి పరిస్థితులను
గమనించి భీష్మాచార్యుని మాదిరిగానే
కలతచెంది వుండేవారు. రాజ్యాంగ వ్యవస్థలు మూడూ ఎవరి పరిధిలో అవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అదే సమయంలో తమ పరిధి మించి
ప్రవర్తించకుండా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావించి వుంటారు కానీ, తమది పై చేయి
అంటే తమదే పైచేయి అనే ఆధిక్యతాధోరణిలో కీచులాడుకుంటాయని ఆనాడే ఊహించివుంటే రాజ్యాంగ
రచనలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుండేవారేమో!
మన
ప్రజాస్వామ్య వ్యవస్థలో తాము కోరుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు.
అంటే ప్రజలే ప్రభువులు. ప్రజల తరపున ఆ ప్రభుత్వాలు ప్రజలని పాలిస్తున్నట్టు లెక్క.
ఈ కోణంలో చూస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది మాట. అంటే ఒక రకంగా
మనది ప్రజాస్వామ్య నియంతృత్వం అంటే
నొచ్చుకోవాల్సిన పనిలేదు. గతంలో,
వర్తమానంలో కూడా ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రభుత్వాలను ప్రజలు చూశారు. వారికి
నచ్చని ఆ ప్రభుత్వాలను ఆ ప్రజలే ఎన్నికల్లో పక్కన పెట్టారు.
రెండు
రాజ్యాంగ వ్యవస్థల నడుమ ఘర్షణ చెలరేగితే సర్దుబాటు చేయడానికి మరో రాజ్యాంగ వ్యవస్థ
న్యాయ వ్యవస్థ వున్నది. చిత్రం ఏమిటంటే ఈ మూడు వ్యవస్థలు అంటే ప్రభుత్వం, పరిపాలన, న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా
పనిచేస్తూనే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ మూడింటి మీదా రాజ్యాంగానిదే పై
చేయి. ఇక ప్రజలు అంటే ఓటర్లది మరింత పై చేయి. ఎందుకంటే వారు ఎన్నుకున్న
పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సైతం సవరించే అధికారం వుంది.
రాజ్యాంగ
నిర్మాతలు తమకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా, సమన్వయంతో పనిచేస్తే ప్రజాస్వామ్యం
పరిఢవిల్లుతుంది. పొరపొచ్చాలతో వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం పలుచబడుతుంది. రాజ్యాంగ
వ్యవస్థలు ఈ వాస్తవాలను గమనంలో వుంచుకున్నంత కాలం ఘర్షణలకు అవకాశం వుండదు.
వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. వ్యవస్థల గౌరవం నిలబడుతుంది.
ఇక ఈ
మూడింటిలో ఒకటి ప్రభుత్వం. దీన్ని రాజకీయాల నుంచి వేరు చేసి చూడడం అసాధ్యం.
మిగిలిన రెండూ రాజకీయాలకు దూరంగా , వాటి నీడ తమ కార్యకలాపాలపై పడకుండా
చూసుకోగలిగితే లేనిపోని ఘర్షణలకు అవకాశం
వుండదు.
ఈ
రెండు వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్టు కనపడాలి కూడా.
ప్రధానంగా న్యాయమూర్తులు,
ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులకు ఈ బాధ్యత ఎక్కువ. అధికారులు ప్రభుత్వానికి
తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తాము
అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అప్పుడప్పుడు
హెచ్చరికలు చేస్తూ వుండడాన్ని బట్టి చూస్తే అధికారుల వ్యవహార శైలి పట్ల రాజకీయ
పార్టీలకి సందేహం వుందని అర్ధం అవుతుంది. ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థ కూడా ఇటువంటి
ఆరోపణలకు గురవుతూ వుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సందర్భాలలో మంచీచెడూ చెప్పాల్సిన మీడియా
కూడా రాజకీయ రంగులు పులుముకోవడం యావత్ పరిణామాలను మరింత విషమం చేస్తోంది.
ఏమిటి
దీనికి కారణం?
రాజ్యాంగ
వ్యవస్థలలోని వ్యక్తులు సైతం రాజకీయాల పట్ల ఆకర్షితులు కావడం ఒక కారణంగా
చెప్పుకోవచ్చు. మూడు దశాబ్దాలకు పైగా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించిన
ఉన్నతాధికారులు,
పోలీసు అధికారులు,
న్యాయాధికారులు,
ఆఖరికి మిలిటరీ అధికారులు సైతం ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఎక్కువ
కావడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది మంచిది కాదని అనడం లేదు. మిగిలిన రాజ్యాంగ
వ్యవస్థలతో పోలిస్తే,
రాజకీయాలకు సంఘంలో వున్న ప్రాధాన్యత వివరించడానికే ఈ వివరణ.
ఇలా
రాజకీయాలకు ఆకర్షితులయ్యే కొందరు అధికారులు తమ పదవీకాలంలో కూడా ఏదో ఒక రాజకీయ
పార్టీకి అండదండలు అందించే వుంటారు అని
సందేహించేవారిని తప్పు పట్టే అవసరం ఉంటుందనుకోను. ఇలా అన్ని వ్యవస్థలు ఎంతో కొంత
రాజకీయ రంగు పులుముకుంటున్నప్పుడు అసలు సిసలు
రాజకీయం చేసే రాజకీయ నాయకులు చేతులు కట్టుకుని కూర్చుంటారా!
అదే
జరుగుతోంది ఇప్పుడు.
తోకటపా:
సరే!
ఒకప్పటి సంగతి చెప్పుకుందాం. రెండు వ్యవస్థల నడుమ సంఘర్షణలు భారత ప్రజాస్వామ్యంలో
కొత్తవేమీ కావు. వీటిని వ్యవస్థల నడుమ ఘర్షణలు అనడం కంటే ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల నడుమ ఘర్షణలు
అంటే సబబుగా వుంటుంది.
లోగడ
నెహ్రూ ప్రధానమంత్రిగా వున్నప్పుడు అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ తో
ప్రధానికి కొన్ని విషయాల్లో పొరపొచ్చాలు వచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరూ ఒకే
పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఈ తలనొప్పులు తప్పలేదు.
అలాగే జ్ఞానీ జైల్ సింగ్ రాష్ట్రపతిగా వున్నప్పుడు అప్పటి
ప్రధాని రాజీవ్ గాంధీని ఏదో ఒక కారణంతో పదవి నుంచి దింపేయాలని తలపోసినట్టు ఆ
రోజుల్లో బాహాటంగానే చెప్పుకున్నారు. తన తల్లి హత్యకు కారణం అయిన ఖలిస్తాన్
తీవ్రవాద సంస్థతో జైల్ సింగ్ కు సంబంధాలు వున్నాయని రాజీవ్ కు అనుమానం. తన ఫోన్
సంభాషణలపై గూఢచర్యం జరుగుతోందని జైల్ సింగ్ కు సందేహం. అంచేతే ఆయన తనను చూడవచ్చిన
వారిని రాష్ట్రపతి భవన్ లోని ఉద్యానవనంలో కూర్చోబెట్టి
మాట్లాడేవారని ఒక మాట ప్రచారంలో వుండేది. ఇందిరాగాంధి హత్యానంతరం సిక్కులపై
జరిగిన హత్యాకాండలో బాధితులైన వారికి ప్రధాని రాజీవ్ తగిన న్యాయం చేయలేకపోయారని కూడా జైల్
సింగ్ మనసులో వుంది.
అంతే
కాదు, రాజీవ్ గాంధీ
ప్రభుత్వాన్ని మిలిటరీ చర్య ద్వారా పడగొట్టడానికి ఓ కుట్ర జరిగిందని, ఈ విషయం రాష్ట్రపతికి కూడా తెలుసని
మాజీ మిలిటరీ కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ పీ.ఎన్. హూన్ రాసిన ‘ది అన్ టోల్డ్
ట్రూత్’ అనే పుస్తకంలో వుంది. అయితే ఈ మిలిటరీ చర్య వల్ల
పరిణామాలు విపరీతంగా ఉండవచ్చని, చివరికి దేశం సైన్యం హస్తగతమయ్యే ప్రమాదం కూడా
వుందని జైల్ సింగ్ సందేహపడ్డారని ఆర్మీ కమాండర్ హూన్ పేర్కొన్నారు.
ఇవన్నీ
చిలికి చిలికి గాలివాన కాకుండా వారిరువురు
నిగ్రహం పాటించడం వల్ల ఆ రోజుల్లో పెద్ద సంక్షోభం తప్పిపోయింది.
అంటే
ఏమిటన్న మాట!
ఈనాడు నిర్ణయాలు
తీసుకునేవారికి అధికారం మాత్రమే కాదు, నిగ్రహం కూడా అవసరం.
(09-01-2021)
భండారు శ్రీనివాస రావు
రిప్లయితొలగించండి"భారత రాజ్యాంగం రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈనాడు జీవించి వుంటే, నేటి పరిస్థితులను గమనించి భీష్మాచార్యుని మాదిరిగానే కలతచెంది వుండేవారు. రాజ్యాంగ వ్యవస్థలు మూడూ ఎవరి పరిధిలో అవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అదే సమయంలో తమ పరిధి మించి ప్రవర్తించకుండా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావించి వుంటారు కానీ, తమది పై చేయి అంటే తమదే పైచేయి అనే ఆధిక్యతాధోరణిలో కీచులాడుకుంటాయని ఆనాడే ఊహించివుంటే రాజ్యాంగ రచనలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుండేవారేమో!"
హరి.S.బాబు
భీష్ముడు కలత చెందాడు, నిజమే!కానీ, ధర్మం చెప్పడంలో నిష్పక్షపాతమే చూపించాడు.ఆయనకి పాండవుల పట్ల మితిమీరిన ప్రేమా దుర్యోధనుడి పట్ల మితిమీరిన ద్వేషమూ లేవు.దుర్యోధనుడికి కూడా హితవునే చెప్పాడు.
మీకు మాత్రం అలాంటి నిష్పక్షపాతం ఉన్నట్టు లేదు.కారణం తెలియదు గానీ రాజశేఖర రెడ్డి అంటే మితిమీరిన అభిమానం చూపిస్తారు.అంత పరవశించిపోవడానికి అతను చేసిన ఘనకార్యం ఏమిటి?
కేవలం 2004 నుంచి 2009 మధ్య అతను చేసిన క్రైస్తవీకరణ ఫలితమే ప్రస్తుతం ఆంధర్ గురించి మీరు ఆందోళన పడుతూ వరస పోష్టులు వెయ్యాల్సి వస్తున్నది.అది తెలుసా మీకు!
రిటైరయ్యారు.కృష్ణా రామా అంటూ వేదాంతం రాసుకోండి.కరెంట్ అఫైర్స్ గురించి మీరు పక్షపాతపు నిట్టూర్పులు విడిస్తే ప్రయోజనం లేదు.ఎవడి యుద్ధం వాడే చెయ్యాలి, చేస్తున్నారు కూడా!
Hari S Babu garu: చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఠాఠ్. మీరలాగంటేలాగా? మీకీదేశంలో ఎవడిమీదైనా అభిమానముండొచ్చు. ఐనాగానీ ఈడ పైకిచెప్పాలంటే సంత్రబాబునే పొగడాలి. కిండర్ మతాన్నే పాఠించాలి. లేదంటే నేన్ శాంతియుతంగా బూతులతో దాడిచేస్తా..
తొలగించండి