26, నవంబర్ 2020, గురువారం

హైదరాబాదు ఇప్పుడూ, ఒకప్పుడూ – భండారు శ్రీనివాసరావు

 (Published in today's,26-11-2020, 'నమస్తే తెలంగాణ' )

ముందు ఒకప్పటి సంగతి చెప్పుకుందాం.
రేడియో మాస్కోలో నాకు ఉద్యోగం వచ్చింది. ఢిల్లీ నుంచి ఏరోఫ్లోట్ విమానంలో మాస్కో వెళ్ళాలి. దానికి ముందు ఢిల్లీ రైల్లో వెళ్ళాలి. తెల్లారి ఉదయం భార్యాపిల్లలతో సహా బయలుదేరి సికిందరాబాదు స్టేషన్ లో రైలెక్కాలి. వీడుకోలు చెప్పడానికి చుట్టపక్కాలు చాలామంది మా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లకు కప్పు కాఫీ ఇవ్వడం మర్యాద. కానీ కాఫీ డికాషన్ పెట్టడానికి ఇంట్లో నీళ్ళు లేవు. రోజు విడిచి రోజు నల్లా వదిలేవాళ్ళు. అదీ ఓ అరగంట సేపు. అదీ తెల్లవారుఝామున నాలుగు గంటలకు. ఆ కాసేపటి వ్యవధానంలో ఆరు కుటుంబాల వాళ్ళు నీళ్ళు పట్టుకోవాలి. మాకు తెల్లారి ప్రయాణం కాబట్టి మిగిలిన వాళ్ళు మాకు ముందు అవకాశం ఇచ్చారు. లేని పక్షంలో కాఫీ డికాషన్ వేయడానికి కూడా నీళ్ళకు కటకట. అప్పట్లో మరో సమస్య కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవదు. దీనికి తోడు అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలు. వోల్టేజి సమస్యలు. ఇంట్లో అన్ని లైట్లు వేస్తె, ఇంట్లోదే కాదు, వీధిలో కరెంటు స్తంభం పైన ఫ్యూజు కూడా పోతుందని చెప్పుకునే రోజులు అవి. పొద్దున్నే కరెంటు వుంటుందో ఉండదో అని కొవ్వొత్తులు కొని సిద్ధంగా పెట్టుకున్నాము, ఎందుకైనా మంచిదని. అదృష్టవశాత్తు వాటి అవసరం పడలేదనుకోండి.
మూడో రోజు మాస్కో చేరాము. అక్కడ రేడియో మాస్కోలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం పదమూడు అంతస్తుల భవనంలో చిట్ట చివరి అంతస్తులో మాకు అపార్ట్ మెంటు కేటాయించారు. ఇంత ఎత్తుకు నీళ్ళు వస్తాయా! రాకపోతే ఇక్కడ కూడా హైదరాబాదు నీళ్ళ కష్టాలేనా, అనుకుంటూ లోపలకు వెళ్ళాము. వెళ్ళగానే చేసిన మొదటి పని నల్లా తిప్పి చూడడం. ధారగా నీళ్ళు వచ్చాయి. ప్రతి పంపు తిప్పి చూశాము. అన్నిట్లో నీళ్ళు. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు.
ఇలాంటి పరిస్థితి హైదరాబాదులో చూడడం అసాధ్యం అనుకున్నాము ఆ రోజు.
ఇదేదో ఉత్ప్రేక్ష కోసం రాయడం లేదు. ఆ నాటి పరిస్థితులు, మంచి నీళ్ళ కష్టాలు ఈ తరానికి తెలియచెయ్యడం కోసం ఈ ప్రయత్నం.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇది కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి. కానీ కనబడదు.
ఎందుకో చెబుతాను. ఇంట్లో పిల్లాడు పెరుగుతూ ఉంటాడు. కాలం గడిచిన కొద్దీ కొద్దోగొప్పో వళ్ళు చేస్తాడు. సహజం. అది రోజూ చూసేవారికి కనబడదు. ఎప్పుడో ఒక చుట్టం దిగబడతాడు. పిల్లాడ్ని చూసి ‘అరె! వీడేనా వాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పీలగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త కండ పట్టి ముద్దొస్తున్నాడు’ అంటాడు. నిజమేనా బాబాయ్ అంటుంది తల్లి అనుమానంతో కూడిన ఆనందంతో. అలాగే ఒక నగర వాసులకు తమ చుట్టుపక్కల జరిగే అభివృద్ధి కంటికి ఆనదు.
హైదరాబాదులో జీవితం గురించి, జీవనం గురించి బాగా మధన పడిన సందర్భం ఒకటుంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయి? ఎలా మారతాయి? నేను చెప్పేది వేరే ప్రాంతాలనుంచి వచ్చి నగరంలో స్థిర పడిన వారి భయసందేహాలు గురించి కాదు. ఇక్కడే పుట్టి పెరిగిన తెలంగాణా వాసుల సంగతి.
తెలంగాణా రాష్ట్రం ఎదుర్కోబోయే బాలారిష్టాలు గురించి అనేకమంది ఆర్ధిక నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. నవజాత రాష్ట్రంలో, ‘కారు’ చీకట్లు కమ్ముకుంటాయన్నారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం ఇక్కట్లపాలవుతుందన్నారు. హైదరాబాదులో వున్న ప్రముఖ కంప్యూటర్ సంస్థలు బిచాణా ఎత్తేసి బెంగుళూరో, మరో వూరో తరలి వెడతాయని జోస్యం చెప్పారు.
అసలు అన్నింటికీ మించి మరో భయం పెట్టారు. హైదరాబాదులో ఏళ్ళతరబడి నివాసం వుంటున్న సీమాంధ్ర ప్రజానీకం దిక్కుతోచని స్తితిలో, బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో రోజులు లెక్కించే పరిస్తితి ఏర్పడగలదని లెక్కలు వేసారు.
ఇలా లేనిపోని అనేక అనుమానాలతోనే రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. ఆరేళ్ల పైచిలుకు కాలం గతంలో కలిసిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సందేహాలు తొలగిపోయాయి. అభద్రతాభావం అంతరించింది. అల్లర్లు, ఆందోళనలు కనుమరుగయ్యాయి. మొన్నీమధ్య కరోనా కర్ఫ్యూ అనే మాట వినబడింది కానీ గతంలో బాగా అలవాటయిన ఈ పదాన్ని నగర పౌరులు దాదాపు మరిచే పోయారు. రవాణా సదుపాయాలు మెరుగు పడ్డాయి. నలుమూలల్నీ కలుపుతూ మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. లింకు రోడ్లు, ఫ్లై ఓవర్లు, కాలి వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు అదుపులోకి వచ్చాయి.
వీటితో పూర్తిగా సమస్యలు మటుమాయం అయిపోతాయా అంటే సాధ్యం కాకపోవచ్చు. అభివృద్ధి వేగాన్ని మించి పౌర అవసరాలు త్వరితగతిన పెరిగిపోతూ ఉండడమే దీనికి కారణం.
నేను వుండేది అద్దె ఇల్లు కాబట్టి, మారాల్సిన అవసరం పడ్డప్పుడల్లా నగరంలో అనేక ప్రదేశాల్లో, ప్రాంతాల్లో నివసించే అదృష్టం పట్టింది. అన్ని చోట్లా పౌర సదుపాయాలు అద్భుతంగా వున్నాయి అని చెప్పను కానీ, మునుపటితో పోల్చుకుంటే వంద రెట్లు మెరుగు. మంచి నీళ్ళ కష్టాలు చాలావరకు తీరాయి. ఇబ్బందులు ఉండొచ్చు కానీ కటకటలు లేవు. రోజు విడిచి రోజు మంచినీళ్ళు కాకుండా ప్రతిరోజూ నల్లాలలో నీళ్ళు వదులుతున్నారు. ఏటా మేముంటున్న ఎల్లారెడ్డి గూడా అపార్ట్మెంటులో నీళ్ళ ట్యాంకులు కొనేవాళ్ళు. ఈ ఏడాది వేసవిలో ఆ అవసరం పడలేదు. బోరు బావిలో సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇక్కడ హైదరాబాదులో భూగర్భ జలాల మట్టం పెరిగిందని ఒకాయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ప్రధానమైన రహదారులు, కాలనీ రోడ్లు బాగుపడ్డాయి. ఇక కరెంటు సంగతి చెప్పక్కర లేదు. అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుంచీ ఉన్న పరిస్థితులతో పోల్చుకున్నాకూడా ఇప్పుడు రాజధాని నగరంలో విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడింది. కరెంటు కోతలనేవి గతకాలపు ముచ్చటగా మారాయి. ఓల్టేజి సమస్యలు బాగా తగ్గిపోయాయి. గత అయిదారేళ్ళలో వచ్చిన అద్భుతమైన మార్పు ఇది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సమాచార సలహాదారుడు, ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు అయిన సంజయ్ బారు వరాలమూట లాంటి ఒక మాట అన్నారు.
నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఆయన ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత అన్నమాట ఇది. నిజానికి ఒక వ్యాసంలో అక్షరాలా రాసిన మాట ఇది.
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
సమైక్యవాద భావజాలం కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి నుంచి ఇటువంటి కితాబు అంటే, హైదరాబాదు నగరం అందరికీ నివాసయోగ్యం అనే యోగ్యతాపత్రం అన్నమాట.

తోకటపా: ఆకస్మికంగా ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కొంత అంతరాయం కలిగిన మాట వాస్తవం. అలాగే, గత వందేళ్ళలో కనీవినీ ఎరుగని వర్షాల వల్ల నగర జీవనం అస్తవ్యస్తం అయింది. రహదారులు దెబ్బతిన్నాయి. అనేక కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ స్థాయిలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం, వాటివల్ల కలిగిన కష్టనష్టాలను పూర్తిగా పూడ్చుకోవడం ఎవరివల్లా కానిపని.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి