21, నవంబర్ 2020, శనివారం

బతికే వున్నాను

 

21-11-2020 నాటికి, అంటే నేటికి,  భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్ ఇచ్చారివాళ.



మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు అని సంబరపడి  అరిసెలు వండి పెట్టేదేమో,  మా ఆవిడ బతికి ఉన్నట్టయితే.  ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి మూసుకు వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి ఉంటున్నాను.

స్టేట్ బ్యాంక్  బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్  ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే  అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్ జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. వెడితే నోట్ల కట్తల వెనుక ఒక నగదు అధికారి, దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే తోటి సిబ్బందితో ముచ్చట్లు  చెప్పడం, తేనీరు  సేవించడం వంటి  పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరామామూలుగా థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని  ధ్రువపత్రంతో  పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇవ్వాల్సిన చోట ఇచ్చాను. అతడు నా వేలి ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.

వయసు మళ్ళిన పెన్షనర్లతో  ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని,  థాంక్స్  త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.

ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది పని పూర్తి అయింది.        

1 కామెంట్‌:

  1. Very very simple. Now the DLC digital life certificate can be given right from home. call your beat postman, he will arrange it at your door step. The cost is only seventy rupees.

    రిప్లయితొలగించండి