ఒక వ్యక్తి అన్నాక ఏదో ఒక వ్యవస్థలోని వాడే అవడానికి అవకాశాలు ఎక్కువ.
ఉదాహరణకు ఎవరో ఒక జర్నలిస్టు ఎవరినో బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒక పోలీసు అధికారి పెద్ద మొత్తంలో లంచం తీసుకుని పట్టుబడతాడు. ఒక బ్యాంకు అధికారి ఫ్రాడ్ కేసులో దొరికిపోతాడు. ఒక ఆధ్యాత్మిక గురువు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుంటాడు. ఒక కులానికి చెందిన వ్యక్తిపై ఇలాంటివే ఏవో అపనిందలు వస్తాయి. ఈ విషయాలపై మీడియాలో చర్చలు జరుగుతాయి. చర్చల్లో పాల్గొనే వాళ్ళు అసలు విషయం వదిలిపెట్టి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి వ్యవస్థలకు వాటిని ఆపాదిస్తూ మాట్లాడతారు. ఆ వ్యవస్థలు, కులాలకు చెందినవాళ్ళు కూడా తమ వ్యవస్థలపై జరుగుతున్న దాడిగానే పరిగణిస్తారు. ఈ క్రమంలో వ్యక్తులకు సంబంధించిన అంశాలు వ్యవస్థలకు చెందిన విషయాలుగా రూపాంతరం చెందుతాయి. అసలు విషయం, అసలు మనుషులు మరుగున పడిపోయి అనవసరమైన అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
రాజ్యాంగానికి మూల స్తంభాలు అయిన మూడు వ్యవస్థలు, వాటికి అనుబంధం అయిన నాలుగో స్తంభం మీడియా అలాగే ఈ సమాజంలోని అన్ని వ్యవస్థలలో ఇదే జరుగుతోంది. నిజంగా వ్యవస్థపై దాడి జరుగుతుంటే ఆ వ్యవస్థకు చెందిన వారు దానిని కాపాడుకోవడం కోసం ఎంతగా ఉద్యమించినా దాన్ని తప్పుపట్టలేము. కానీ జరుగుతున్న కధ వేరేగా వుంది. వ్యక్తుల లోపాలను వ్యవస్థల లోపాలుగా ఎత్తి చూపడం జరుగుతోంది. వ్యక్తులపై ఆరోపణలను వ్యవస్థలపై ఆరోపణలుగా పరిగణించడం వల్ల వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తోంది.
సున్నితంగా చెప్పే విషయం కనుక ఇంతకంటే సూటిగా చెప్పడం నాకు సాధ్యపడడం లేదు. (October,2020)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి