26, జూన్ 2020, శుక్రవారం

కరోనా అంటే భయం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు

 

“నేలతో నీడ అన్నది నను తాకరాదని,

పగటితో రేయి అన్నది నను తాకరాదని,

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది,

నేడు భర్తనే తాకరాదనీ... ఒక భార్య అన్నది”

(మంచి రోజులు వచ్చాయి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం)

కరోనా అంటే భయం ఎందుకు అంటే ఇందుకే.  ఇది అన్ని రోగాలవంటిది కాదు. చావుకు దగ్గర చేసే జబ్బులు దీనికంటే అనేకం వున్నాయి. ఉదాహరణకు కేన్సర్. ఇది వచ్చిన వాళ్ళను శారీరకంగా, ఇంట్లో వారిని ఆర్ధికపరంగా చావగొడుతుంది.ఇల్లూవళ్ళూ గుల్ల చేస్తుంది. రోగి కోలుకునే అవకాశాలు తక్కువ. కుటుంబం చితికి పోవడం మాత్రం ఖాయం.

ఇంత భయంకరమైన రోగం అయినా కానీ కేన్సర్ వచ్చిందంటే సాటివాళ్ళు ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపుతారు. అయ్యో పాపం అనుకుంటారు.  ఆసుపత్రిలో వుంటే వెళ్లి చూస్తారు. కర్మకాలి జరగరానిది ఏదైనా జరిగితే చుట్టపక్కాలు అందరూ అంతిమ సంస్కారాల్లో పాల్గొని  కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతారు. స్వాంతన కలిగిస్తారు.

కానీ కరోనా అలా కాదే.  శారీరకంగా అది పెట్టే బాధ అంత లెక్కలోనిది కాదు. కానీ మానసికంగా పెట్టే బాధకు లెక్కే లేదు. సొంత కుటుంబంలోని వాళ్ళే, బాగా  దగ్గర వాళ్ళే దూరం అవుతారు. ‘ఎవరూ రారూ నీకోసం’ అంటూ ఏదో ఆసుపత్రిలో రేయింబవళ్ళూ ఒంటరిగా కుమిలిపోవాలి. చికిత్సకు లొంగి కరోనా అనే రోగం శరీరాన్ని వదిలినా దాని తాలూకు ‘అంటరానితనం’ అనే అవలక్షణం ఇంగువ కట్టిన గుడ్డలా అంత తేలిగ్గా వదలదు. అపార్ట్ మెంటు వాళ్ళు, కాలనీ వాళ్ళ చూపుల్లో తొంగిచూసే అనుమానం రోగిని సెల వేసినట్టు బాధ పడుతుంది. తానేమీ ఎయిడ్స్ రోగి కాదే! మరెందుకీ శిక్ష అనే బాధ మనసులో తొలుస్తుంటుంది. సొంత మనుషులు కూడా రోగం నయమై వచ్చిన రోగిని తాకడానికి సందేహిస్తున్నారు అనే కధనాలు వింటున్నప్పుడు ఈ బాధ ఎన్నాళ్ళో అనే బాధ ఎక్కువ అవుతుంది.

ఇక ఖర్మ కాలి కరోనాకు బలయితే ఇక ఆ కష్టాలు చెప్పతరం కాదు. అయినవాళ్ళు రాలేరు. చితికి నిప్పు పెట్టాల్సిన వాళ్ళు కూడా రాలేని పరిస్తితి. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే మరణం. దిక్కుమాలిన చావు అంటారే అది.

ప్రజల్ని మరింత భీతావహుల్ని చేసేందుకు ఇదంతా రాయడం లేదు. ఈ రోగం పట్ల సమాజంలో ఆవరించివున్న అనుమానాలను తొలగించకపోతే పరిస్తితి నిజంగా ఇలాగే తయారవుతుంది.

ఇదొక కొత్త జబ్బు. ఎవరికీ దీని గురించి పూర్తిగా తెలియదు. మిడిమిడిజ్ఞానంతో చెప్పే కబుర్లు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఈ విషయంలో సమాజాన్ని, ప్రజలను జాగృతం చేయాల్సిన మాధ్యమాలు రాజకీయాలు అనే కరోనాను మించిన రోగంతో కునారిల్లుతున్నాయి. నిన్ననే అనుకుంటా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చా అని. దావానలంలా వ్యాపిస్తున్న కరోనా అని రాస్తే  టీఆర్పీ రేటింగులు పెరుగుతాయేమో కాని, సామాజిక బాధ్యత తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయగల  తీరిక వున్నవాళ్ళు కలికానికి కూడా కానరావడం లేదంటే నిజంగా బాధపడాల్సిన, కాదు కాదు, సిగ్గుపడాల్సిన  విషయమే.

ఈ జబ్బుకు ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ అవసరమా కాదా అన్నది సరయిన వైద్య నిపుణుల ద్వారా సేకరించి ప్రజలను చైతన్యం చేయకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో!

కింది ఫోటో మిత్రుడు జగన్ మోహన్ పోస్ట్ చేసారు. ఒక కరోనా రోగికి ఓ స్టార్ హాస్పిటల్ లో వేసిన బిల్లు. అక్షరాలా మూడు లక్షల నలభయ్ వేల రూపాయలు. నిజానికి హోం క్వారంటైన్ లో ఈ చికిత్స తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో నివసించేవారి పరిస్తితి ఏమిటి? రోగం వచ్చిందని తెలియగానే ముందు ఇల్లు ఖాళీ చేయాలనే వొత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో పెద్ద సంఖ్యలో రోగులకు వసతి కల్పించడం కూడా అసాధ్యమే. అందరూ స్టార్ ఆస్పత్రుల ఖర్చు భరించలేరు.

కిం కర్తవ్యమ్?         

(26-06-2020)


No photo description available.

3 కామెంట్‌లు:



  1. కిం కర్తవ్యమ్?


    హ్యాపీ గా బాల్చీ తన్నేయడం‌ :)


    మురళీ కృష్ణ గారికి చెప్పండి జనాల్ని కరోనా పేరుతో వాయగొట్టేస్తా వుంటే ("ట" వార్త లతో ) జనాలు టీవీ కట్టి పెట్టేయటం ఖాయమని. టీవీ మీడియా నడియింటిలో తెచ్చి పెట్టుకున్న తంటా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాల్చీ తన్నేసిన వాడికి హాపీయేనేమో, కానీ హాస్పిటల్ బిల్లు కట్టవలసినది ఆ కుటుంబం కదా?

      తొలగించండి
  2. TV9 మురళీకృష్ణ పులి తరుముకొస్తున్న విధంగా మాట్లాడుతాడు. ఎదుటి వారి మాట అయ్యేలోపు లొడ లొడ మంటాడు.verbal vomiting. స్థిమితం స్పష్టత లేని వారు జర్నలిస్టులు ఎలా అయ్యారో తెలియదు.

    రిప్లయితొలగించండి