29, మే 2020, శుక్రవారం

సంబరాల వేళ సమీక్షాసమయం


వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి రేపటితో అంటే మే ముప్పయ్యో తేదీకి ఏడాది కాలం పూర్తవుతుంది. రాజకీయ పార్టీలకి ఇలాంటి సందర్భాలు సంబరాలు చేసుకునే సమయాలు. కరోనా కట్టడుల కారణంగా అట్టహాసంగా ఉత్సవాలు చేసుకునే వీలు  ఎలాగు లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు, కొత్త కమిషనర్ నియామకాల విషయంలో జగన్ ప్రభుత్వం లోగడ ఇచ్చిన జీవోలను కొట్టేస్తూ  హైకోర్టు ఆదేశాలు కూడా ఏడాది ఉత్సవాలకు ఒక్క రోజు ముందే వెలువడడం అనేది ఆశానిపాతమే. మానసికంగా కలచి వేసే అంశమే. గత కొద్ది రోజులుగా న్యాయస్థానాల నుంచి జగన్ ప్రభుత్వం తీర్పుల రూపంలో ప్రతికూల పరిస్తితులను ఎదుర్కుంటున్న మాట నిజమే. కానీ తాజా తీర్పు ప్రభుత్వాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడవేసేదిగావుంది. వైసీపీ ఏడాది  సంబరాల మాటేమో కానీ ఈ తాజా తీర్పు ప్రతిపక్షాలకు సంబరాలు చేసుకునే అవకాశం కల్పించింది.
హైకోర్టు పైన సుప్రీం కోర్టు ఉండవచ్చు. అప్పీలు చేసుకునే అవకాశం న్యాయమూర్తులు ఇచ్చారో లేదో తీర్పు పూర్తి పాఠం వెలువడితేకాని తెలియదు. ఆ ప్రక్రియ మరికొంత సమయం తీసుకోవడానికి (Purchasing Time) పనికిరావచ్చు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కూడా అనుకూలంగా వస్తుందనే పూచీలేదు.
ఎలాగూ, ఏడాది పాలన ముగియవచ్చే ముందు అన్ని శాఖలతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమీక్షలు నిర్వహిస్తూనే వున్నారు. అందులో కొంత సమయాన్ని ఈ కోర్టు తీర్పులకు కేటాయించి, భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వంలోనా, ప్రభుత్వ నిర్ణయాలను సరయిన విధంగానే వున్నాయి అని ముఖ్యమంత్రికి తెలియబరచే బాధ్యత వున్న అధికారుల స్థాయిలోనా, లేక వాటిని ప్రతిభావంతంగా సమర్ధించి రాజ్యంగబద్ధంగానే వున్నాయని న్యాయమూర్తులను ఒప్పించడంలో ప్రతిభ చూపాల్సిన ప్రభుత్వ న్యాయవాదుల స్థాయిలోనా.
ముందు నిర్మొహమాటంగా ఈ విషయాలను కూలంకషంగా చర్చించుకోవాలి. ప్రభుత్వంలోనే పొరబాట్లు జరుగుతున్నాయి అనుకుంటే, టీటీడీ ఆస్తుల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా, కోర్టు కాదన్న నిర్ణయాలను హుందాగా మార్చుకోవాలి. అధికారులది బాధ్యత అనుకుంటే వారిని తప్పించాలి. ప్రభుత్వ న్యాయవాదులే కారణం అనుకుంటే వారి స్థానంలో సమర్ధులను ఎంపిక చేసుకోవాలి.
ఇక ఈ విషయాల్లో చేసే ఎలాంటి కాలయాపన అయినా  ప్రభుత్వానికి మునుముందు ఓ గుదిబండలా తయారవుతుంది.
లేదా రాజకీయ ప్రత్యామ్నాయం ఎంచుకుని కొత్తగా ప్రజా తీర్పుకు వెళ్ళాలి. కానీ మధ్యంతర ఎన్నికల నిర్ణయం అనేది  ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు.  వెనుక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా శాసనసభను రద్దు చేసి తాజాగా ప్రజల  తీర్పును కోరినప్పుడు ఆయన అభిలాషకు అనుగుణంగా ఎన్నికలు జరిగాయి. అది ఆయనకు కలిసివచ్చింది. ఇప్పుడలాంటి పరిస్తితులు లేవు.
ఇప్పటి రాజకీయ వాతావరణంలో అలాంటి నిర్ణయాలు ఆత్మహత్యాసదృశమైనవి కూడా కావచ్చు.

2 కామెంట్‌లు:

  1. కొన్ని జనాలకి కొట్టొచ్చ్చినట్టు కనబడేవి చేయకూడదు .
    రంగులు వేయడం , మన బ్రాండ్ లు మాత్రమే అమ్మడం లాంటివి ..

    రిప్లయితొలగించండి
  2. It is part of learning curve for Jagan. He should desist from taking knee jerk reaction decisions. Consider all aspects. Take decisions which have support of majority people.

    రిప్లయితొలగించండి