15, మే 2020, శుక్రవారం

మంచి నీళ్ళ కరెంటు – భండారు శ్రీనివాసరావు


“We cannot afford this sort of luxury there”
యూకే, అమెరికా వంటి సంపన్న దేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపేవాళ్ళు కూడా ఇండియాలోని తమ చుట్టపక్కాలను చూడడానికి వచ్చినప్పుడు చెప్పే మాట ఇది.
మన ఇళ్ళను చూసి, మన ఇంట్లో ఫర్నిచర్ ని చూసి కాదు వాళ్ళు ఈ మాట చెప్పేది. మనం విచ్చలవిడిగా వాడుతున్న విద్యుచ్చక్తిని చూసి.
“ఆ గదిలో ఎవ్వరూ లేరు, అయినా  పంకా తిరుగుతోంది, ఆపేయవచ్చు కదా!’
“అందరం ఇక్కడే కూర్చున్నాం కదా! ఆ గదిలో ఏసీ ఎందుకు”
ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాదు, కాస్త చనువు వున్నవాళ్ళు లేచి వెళ్లి ఆ పంకాని, ఆ ఏసీని ఆపేసి వస్తారు కూడా.
ఎందుకంటే ఆ దేశాల్లో కరెంటు చార్జీలు ముట్టుకోకుండానే కాలిపోయే రకం.
మన దగ్గర వంటింట్లో ఇల్లాలు వంట చేస్తుంటుంది. కొరియర్ వాడు వచ్చి బెల్ కొడతాడు. వెంటనే ఆవిడ ముందు గ్యాస్ ఆఫ్ చేసి వెళ్లి తలుపు తీస్తుంది. అంతేకాని అదే గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేయదు. అంతేకాదు, వంట చేస్తున్నంత సేపు డ్రాయింగు రూములో టీవీ మోగుతూనే వుంటుంది. కావాలంటే గమనించి చూడండి.
సాధారణ కుటుంబాల్లో కరెంటు వాడకం గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. ఎందుకంటే బిల్లు చూసిన తర్వాత కానీ చార్జీల సంగతి గుర్తుకు రాదు. నేనూ ఈ బాపతే. కానీ చార్జీల విషయంలో నా వాదన వేరు.
గతంలో ఎన్నో వ్యాసాలు రాసాను. ప్రతివాళ్ళం ఇళ్ళల్లో ఇంత హాయిగా వుంటున్నామంటే ఈ కరెంటు వల్లే. బయట ఎండ దంచుతున్నా ఫ్యాను గాలికి సేద తీరవచ్చు. రాత్రి వేళ గాలి బిగించి ఉబ్బతీసినా ఏసీ చల్లదనంతో హాయిగా కునుకు తీయవచ్చు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పెద్దపెద్ద టీవీలతో ఇంటినే ఒక థియేటర్ గా మార్చుకుని చక్కగా కాలక్షేపం చేయవచ్చు.
కానీ కరెంటు చార్జీలు మాత్రం పెంచరాదు. నేను రాస్తున్నది బీదాబిక్కీ విషయం కాదు, తీరి కూర్చుని సాంఘిక మాధ్యమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళ గురించి. వాడుకున్న దానికి చార్జి కట్టి తీరాలి. చేసిన పనికి తగిన వేతనం ఇచ్చి తీరాలి. ఏదీ ఉచితం కాదు.  ఈనాటి కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సూత్రాలు.
ఇదేదో కరెంటు చార్జీల పెంపుగురించి సాగుతున్న వివాదంలో ఎవరినో సమర్ధించడానికి ఇది రాయడం లేదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేరుగా ఆయనతోనే చెప్పాను, కరెంటు చార్జీలు పెంచితే పరవాలేదని. సందర్భం గుర్తు లేదు, ముఖ్యమంత్రి ఆ రోజు జూబిలీ హాల్ లాన్స్ లో విందు ఏర్పాటు చేసారు. నేను అప్పుడే మాస్కో నుంచి వచ్చాను. అయిదేళ్ళ పాటు కన్ను కొట్టని కరెంటు దీపాలు చూసివచ్చిన మత్తులో వున్నాను.
ఆ రోజుల్లోనే కరెంటు చార్జీల గొడవ ఊపందుకుంటోంది. మాటలమధ్యలో ఏమిటి రష్యా సంగతులు అంటే నేను చెప్పాను. మంచి నాణ్యత కలిగిన కరెంటు ఇవ్వండి. చార్జీలు పెంచినా జనం ఏమీ అనుకోరు. అలా కాకుండా ఇలా వచ్చి అలా పోయే కరెంటుకు ఎక్కువ చార్జీలు వేస్తేనే జనంతో  చిక్కొస్తుంది’ అనేది నా జవాబు.
చివరికి షాక్ ఆయనకు కొట్టింది. నేను బాగానే వున్నాను. కానీ నా అభిప్రాయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా మారకుండానే  వుంది.
అయినా నేనేమైనా రాజకీయాల్లో వున్నానా ఏమిటి తరచూ అభిప్రాయాలు మార్చుకోవడానికి.
''అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేస్తుంటే కానీ పొలిటీషియన్‌ కానేరడు''  - కన్యాశుల్కం లో గిరీశం     

1 కామెంట్‌:

  1. "సాధారణ కుటుంబాల్లో కరెంటు వాడకం గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు"

    "సాధారణ" బదులు "అగ్రవర్ణ నగర ఎగువ మధ్యమగతి " అనడం కరెక్ట్.

    చంద్రబాబు మీ సలహా బట్టో ఇంకో కారణం వల్లనో కరెంట్ రేట్లు పెంచితే బిక్క చచ్చిన బడుగుబలహీనవర్గ మెట్ట ప్రాంత సన్నకారు చిన్నకారు రైతులు, కూలీలు, చేతివృత్తుల పనోళ్లే సిసలైన సాధారణ జనం.

    రిప్లయితొలగించండి