ఈ లాక్ డౌన్ కాలంలో అందరికీ పుష్కలంగా
దొరుకుతోంది ఒక్కటే! అది ఖాళీ సమయం. ఎంత ఖర్చు చేస్తున్నా ఇంకా మిగిలిపోతోంది.
కాబట్టి గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. మనసు ఎటు తిరిగితే
అటు తిరుగుదాం అనిపిస్తోంది. చిన్ననాటి సంగతులు, స్కూలు, కాలేజి జ్ఞాపకాలు, పిల్లలు, చదువులు,
పెళ్ళిళ్ళు, విదేశాల్లో తిరుగుళ్ళు ఇలా ఏదిపడితే అది గుర్తు చేసుకోవడం. అందుకోసమే ఈ రాతలు.
దీనికి ఒక పద్దతి అంటూ వుండదు. ముళ్ళపూడి వారి ‘కోతికొమ్మచ్చి’ లాగా ముందుకూ,
వెనక్కి, వెనక్కీ ముందుకూ. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు రెండూ వుంటాయి. కష్టాలను
మనసులోనే దాచేసుకుని ఆనంద క్షణాలను
అందరితో పంచుకుంటే ఈ కరోనా హాలిడేస్ ని మరింత ఎంజాయ్ చేయగలుగుతాం.
“ఫేస్ బుక్ లో కానీ, పత్రికల్లో కానీ
ఎవరు రాసినవి వాళ్ళు చదువుకోవడమే. మొహమాటానికి లైకులు కొట్టినా పూర్తి పాఠం
చదివేవారు బొత్తిగా లేకుండా పోయార”ని మితృడు జ్వాలా నరసింహరావు ఒక పోస్టుకు కామెంటు
పెట్టాడు. మొన్నమొన్నటి వరకు నాదీ ఇదే అభిప్రాయం. ఫేస్ బుక్ లో ప్రవేశించిన చాలాకాలం
వరకు నేను రాస్తూ పోయానే తప్ప ఇతరులు ఏం రాస్తున్నారనేది అంతగా పట్టించుకునేవాడిని
కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు వేరే వ్యాపకాలు చాలా ఉండేవి. ముప్పూటలు రోజూ ఏదో
ఒక టీవీ స్టూడియోకి పోయిరావడం, నా బ్లాగుకు, పత్రికలకు వారం వారం వ్యాసాలు రాసే
పనిలో తలమునకలుగా వుండడం, ఇప్పట్లా ఇంట్లో ‘ఒంటరితనం’ లేకపోవడం ఇలా అనేకానేక
కారణాలు. ఇప్పుడు ఈ బాదర బందీలు లేవు. మా ఆవిడ పోయినదగ్గరి నుంచి ఐచ్చికంగా ఇవన్నీ
మానేసాను. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా
ఒంటరితనం నన్ను తోడుగా చేసుకుంది. దాంతో ఫేస్ బుక్ లో ఎవరు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు అనేదానిపై
ఆసక్తి పెరిగింది. ఆణిముత్యాల వంటి రచనలు కళ్ళబడ్డాయి. మెరికల్లాంటి రచయితలు
పరిచయం అయ్యారు. వాళ్ళ పూర్వ రంగం చూస్తే వాళ్ళలో ఎవ్వరూ కాగితం మీద కలం పెట్టిన
వారిలా లేరు. కానీ వాళ్ళ రచనల్లో వడీ, వేగం, సహజత్వం ఏ ప్రమాణాల ప్రకారం
తీసుకున్నా చేయి తిరిగిన రచయితలకు ఏమాత్రం తీసిపోవు. మరో వాస్తవం ఏమిటంటే
వీళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళ ఫోటోలు పెట్టుకున్న ఆడవాళ్ళు మాత్రం కాదు.
నేను ఫేస్ బుక్ లో ప్రవేశానికి ముందు ఒక నియమం పెట్టుకుని పాటిస్తూ వచ్చాను. బాగా
తెలిసిన ఆడవారు అయితే తప్ప నేను లైక్ కూడా కొట్టను. కామెంట్ల జోలికి పోను. మొదట్లో
అది నా అహంభావానికి చిహ్నంగా భావించినవాళ్ళూ వున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళే ఈవిషయం
నాతో చెప్పారు. ఏడెనిమిది మంది మహిళలు, నలుగురయిదుగురు మగవాళ్ళు రాసినవి నేను
తప్పకుండా చదువుతాను. ఫేస్ బుక్ లో సాధారణ పోస్టులకి భిన్నంగా, హాయిగా ఇంట్లోని సంగతులు, చిన్ని చిన్ని ముచ్చట్లు చాలా
ఆహ్లాదకరంగా రాస్తుంటారు. ఎవరినీ నొప్పించేవి కావు.
మరో సంగతి ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది
నా పోస్టులు చదివేవారిలో లేరు. నేను రాసేవి చాలావరకు రాజకీయ పరంగా వుంటాయి. బహుశా వారి
అభిరుచికి తగినట్టుగా ఉండకపోవచ్చు.
అందుకే జ్వాలా అభిప్రాయంతో నేను
ఏకీవభించడం లేదు. ఓ ఎనిమిది నెలలకు పూర్వం అయితే ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం
కూడా.
బ్లాగుల్లో కూడా మీరు అంతేగా. ఎవరి బ్లాగులోనూ కామెంట్లు పెట్టరు కదా మీరు 🙂.
రిప్లయితొలగించండిఒక్కప్పుడు బ్లాగ్ రైటర్స్ రాసేవి చాలా చాలా బాగుండేవి , అందులో ఎక్కువగా మహిళలేవే . వాళ్లంతా తమ చుట్టూ ఏం జరుగుతుందో రాసేవారు , అప్ప్పటి వరకు ప్రొఫెషనల్ రైటర్స్ రాసేవి చదివి మొహం మొత్తేసి ఉన్న నాకు ఈ బ్లాగ్ లు నిజంగా వరమే . మామూలు విషయాన్ని కూడా హాస్యంగా రాయడం , కొంతమంది తమ విజ్ఞానం ని పంచుకోవడం , కొంతమంది ఆటోబయోగ్రఫీ లు రాయడం ( మీలాంటి వాళ్ళు, మీ రష్యన్ స్టోరీస్ లు కొత్త విజ్ఞానం )అవన్నీ గోల్డెన్ డేస్. ఇప్పుడు వాళ్లంతా మాయమైపోయారు . పత్రికల్లో వచ్ఛేది అంతా సెన్సార్ అయి , ఇద్దరు ముగ్గురు ప్రూఫ్ రీడింగ్ చేసి వస్తుంది , బ్లాగుల్లో, ఫేస్బుక్ లో , తమ తమ అనుభవాలని సెన్సార్ లేకుండా , నిర్భయంగా రాస్తున్నారు . ఇది నిజంగా కొత్త ఒరవడి . తెర వెనక నిజాలు ఏంటో, జనాలు ఏంటో తెలుస్తుంది. Please keep writing.
రిప్లయితొలగించండిబ్లాగుల్లో వ్యాఖ్యలు పెడితే మళ్లీ అదొక గొలుసు లాగా అవుతుంది. ప్రతి వ్యాఖ్యలు, వాటికి సమాధానాలు, వివరణలు ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు. శ్రీనివాసరావు sir వంటి వారికి అంత వ్యవధి కూడా ఉండదు.
రిప్లయితొలగించండిఅందుకే బ్లాగర్లు వ్యాఖ్యాతలు విడివిడిగా ఉన్నా రేమో.
బ్లాగర్లకు విషయం చెప్పాలనే సరదా. వ్యాఖ్యాతలకు ముచ్చట్లు సరదా.
మీరు సోషల్ మీడియాలో మెచ్చిన రచయితల పేర్లు పంచుకోగలరా?
రిప్లయితొలగించండి