29, ఏప్రిల్ 2020, బుధవారం

ఇదేదో బాగానే వుంది మరి


కరోనా కాలంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళు తమకుతోచిన రీతిలో వంటలూ గట్రా చేస్తూ వాటిని పోస్టు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు. గరిటె తిప్పడం కాదుకదా, అట్లకాడ పట్టుకోవడం కూడా రాదనే నా బలహీనత నాకు తెలుసు కనుక నేనూ ఒక ప్రయోగం చేస్తున్నాను, వేరే విధంగా.
పూర్వపు రోజులకు వెళ్ళిపోయాను. అంటే వెనుకటి దూరదర్సన్ కాలానికి అన్నమాట. టీవీ చూసే సమయం బాగా తగ్గించాను. ఉదయం ఓ గంటా, సాయంత్రం ఓ మూడు గంటలు, అదీ ఏ ఛానల్ వాడయినా మంచి పాత సినిమా వేస్తేనే సుమా, టీవీ ఆన్ చేస్తున్నాను. వెనుకటి రోజుల్లో అయితే, పగలల్లా మేజా మీద ఠీవిగా కూర్చున్న టీవీ మీద ఓ గుడ్డ కప్పిఉంచితే, అది శివుడి గుడిలో నందివాహనంలా ఓ చోట కదలకుండా వుండేది. ఇప్పుడు గోడకు అతుక్కు పోయిన బల్లిలా నోరుమూసుకుని పడుంటోంది.
అది ఎలా వుందని కాదు, నేను మాత్రం నిక్షేపంలా కొత్త నెత్తురు పట్టిన మనిషిలా తయారవుతున్నాను. బీపీ గట్రా చూసుకోలేదు కానీ ఖచ్చితంగా నార్మల్ గానే వుండివుంటాయి. మనసు ప్రశాంతంగా వుంటే మనిషి కూడా ప్రశాంతంగానే ఉంటాడు. ఉండక చస్తాడా ఏమిటి.


నిన్ననే ద్వితీయ విఘ్నం కూడా గడిచింది కాబట్టి ఈరోజు మూడో రోజు ధైర్యంగా ఈ పోస్టు.

1 కామెంట్‌: