22, ఏప్రిల్ 2020, బుధవారం

ట్రంప్ పిచ్చోడో గట్టోడో కొద్ది నెలల్లో తేలుతుంది


వాడో పిచ్చోడు. దేశాన్ని నాశనం చేయడానికే వచ్చాడు”
అమెరికాలో ఎవరినన్నా కదిలిస్తే చాలామంది ట్రంప్ గురించి చెప్పే మాటలు. నిజానికి ఇందులో నిజమెంత?
చూడడానికి పెద్ద తాగుబోతులా కనిపించే ఈ పెద్ద మనిషికి తాగుడు అంటే గిట్టదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడురా బాబూ  అని ముక్కుమీద వేలేసుకునేలా వుంటాయి అయన మాటలు. అమెరికా అధ్యక్షుడు కాకముందు, అయిన తర్వాతా ఆయన తీరింతే! మనసులో మాట పైకి అనేయడం తప్ప అలా అనడంవల్ల వచ్చే మంచీచెడుల గురించి పట్టించుకోని భోలాశంకరుడు.
కింది ఫోటో ట్రంప్ దే. 1987 లో ప్రసిద్ధ టీవీ యాంకర్ ల్యారీకింగ్,  సీఎన్ఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ చేసినప్పటిది. అప్పటికి ఆయనకు రాజకీయాల వాసన తెలియదు. తన వ్యాపారం తప్ప వేరే వ్యాపకాలు లేవు.
లారీ కింగ్ ఆ ప్రశ్నే అడిగాడు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని.
ట్రంప్ ఇలా జవాబు చెప్పాడు.
“ఎంతమాత్రం లేదు. కానీ ఒక విషయం. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని అనుకున్న మరుక్షణం ఆ పనిలోనే వుంటాను. మరో విషయం.  అలా నేను నిర్ణయించుకున్న తర్వాత నన్నెవ్వరూ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకోలేరు”     
అలానే అయ్యారు ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత. అదీ మొదటి ప్రయత్నంలోనే.
ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ముందు ట్రంప్ మరో మాట చెప్పారు.
“మన దేశ ఆర్ధిక వ్యవస్థ, మనం గొప్పలు చెప్పుకునేంత గొప్పదేమీ కాదు. నిజం చెప్పాలంటే అదొక గాలి బుడగ. ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు”
“అమెరికా అమెరికన్లది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తట్టాబుట్టా సర్దుకుపోవాల్సిందే” ఇలా సాగేవి ఆయన ఎన్నికల ప్రసంగాలు.
ఇప్పుడు కొరానా విషయంలో కూడా ఆయనది వేరే దారి. ప్రస్తుత దుస్తితికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే అని అభిప్రాయపడేవాళ్ళే ఎక్కువ ఆ దేశంలో.
ఈ నేపధ్యంలోనే అయన మరో బాంబు పేల్చారు.
బయటి దేశాల వాళ్లకి అమెరికాలోకి ‘నో ఎంట్రీ’ అని ప్రకటించారు.
ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని 1987 లో ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే తేలిపోయింది.
కాదు అది అహంకారం అంటుంది అక్కడి మెజారిటీ మీడియా. మీడియా విశ్వసనీయతని ఆయన గత ఎన్నికల్లోనే దెబ్బతీసారు.
ఆయనది  ఆత్మవిశ్వాసమా లేక అహంకారమా తేల్చుకోవడానికి మరి కొద్ది నెలల్లో జరిగే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలు వేదిక కాబోతున్నాయి.
ఈ సారి కూడా మీడియా ఓడిపోతే ఇక దాని విశ్వసనీయత పూర్తి ప్రశ్నార్ధకమవుతుంది..     


(1987లో ట్రంప్)


    

2 కామెంట్‌లు:

  1. I object you honor! మీరిక్కడ భోళాశంకరుడు అన్న మాటవాడి మా మనోభావాలకు గాయం చేశారు.
    ఇంతకీ అమెరికా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయో లేక ఫిక్సయిపోతున్నాయో ఎవరికి తెలుసు.

    రిప్లయితొలగించండి
  2. అవును, ఒకటి మాత్రం నిజం, చైనా మెడ లో గంట మాత్రం కట్టాడు , ఈ పని ఇంతకు ముందున్న వాళ్ళు చేయడానికి భయపడ్డారు .
    ఆలోచించలేని , స్వాతంత్య్రం లేని ప్రజలు కొత్థ కొత్థ టెక్నాలజీ కనుక్కున్నారు అంటే , అది పెద్ద అబద్దం అని తెలుసు , అయినా అందరు మౌనంగానే ఉన్నారు , ఇతను మాత్రం , అవన్నీ కొట్టుకొచ్చ్చినవి అని నిర్భయంగా చెప్పి, అరెస్ట్ కూడా చేసి చూపించాడు . ఉక్కిరి బిక్కిరి చేసేసాడు .
    :Venkat

    రిప్లయితొలగించండి