2, ఏప్రిల్ 2020, గురువారం

మనం చేయాల్సింది మనం చేద్దాం ! – భండారు శ్రీనివాసరావు


అజ్ఞానం, అవగాహన లేమి అని అనుకున్నా పర్వాలేదు కాని కరోనాను కట్టడి చేయడానికి ప్రస్తుతం  అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన మార్గం మనుషుల నడుమ కొంత దూరం ఉండేలా చూసుకోవడం ఒక్కటే. ఇందుకోసం లాక్ డౌన్  ఒక్కటే పరిష్కారం. ఒకరకంగా ఇది ప్రధమ చికిత్స లాంటిది.
ఈ కరోనా వ్యాధి కధాకమామిషు ఏమిటి, దీన్ని అరికట్టడానికి ఎలాంటి వాక్సిన్ తయారు చేయాలి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాటివన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఎవరు చెప్పినా కొన్ని అవి ముందు జాగ్రత్తలే. ఆ జాగ్రత్తలో ఒకటి ఈ సామాజిక దూరమో, భౌతిక దూరమో ఏ పేరుతొ అన్నా పిలవండి అది పాటించడమే. ముందు వ్యాధి వ్యాప్తిని అరికట్టడం ప్రాధమిక బాధ్యత. ప్రభుత్వాలు ఈ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఫలితాలు కూడా వస్తున్నాయి.
ఉదాహరణకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని సియాటిల్ లోనే ముందు ఈ వ్యాధి పొడసూపింది. పాజిటివ్ కేసులు, కొరానా మరణాలు సంభవించింది కూడా ఈ నగరంలోనే. ఒకరకంగా అమెరికాలో కోరానా వ్యాధికి ఈ నగరాన్ని ఎపిసెంటర్ గా మొదటి రోజుల్లో అనుకున్నారు. దేశంలో లాక్ డౌన్ పెట్టాలా అక్కరలేదా అని ఫెడరల్ ప్రభుత్వం మీన  మేషాలు లెక్క పెడుతున్నప్పుడే వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. రోజులు గడిచిన తర్వాత దాని సత్ఫలితాలు ఇప్పుడు క్రమంగా అనుభవంలోకి వస్తున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గలేదు కాని వాటి సంఖ్య పెరగకుండా ఆపగలిగారు.
కరోనాకు ఏదైనా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేలోగా మానవాళి ముందు ఉన్న పరిష్కారం ఒక్కటే అది సెల్ఫ్ క్వారంటైన్. దానికి దోహద పడేదే ఈ  లాక్ డౌన్.
ఒక చిన్న నిప్పు రవ్వ గాలికిలేచి దూరంగా వున్న గడ్డి వాములపై పడి అవి భస్మీపటలం అయిన సందర్భాలు అందరి అనుభవం లోనివే. కాబట్టి ఈ కరోనా నిప్పురవ్వ యావత్ సమాజాన్ని దహించకుండా వుండాలంటే బహుముఖ చర్యలు అవసరం. అవన్నీ ఆచరణలోకి వచ్చేలోగా లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం.
ఈ క్రమంలో ప్రజలకు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యం కలగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులను పెద్ద మనసు చేసుకుని భరిస్తూ అనవసరమైన ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రభుత్వాలకు సహకరించడం ప్రజలు అలవాటు చేసుకోవాలి. కొన్నాళ్ళు ఇది తప్పదు.
కరోనా గురించి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వదంతులకు అడ్డకట్ట వేయాలి. నిజానికి ఇవన్నీ అర్ధ సత్యాలే. వాతావరణంలో వేడి వుంటే ఈ వైరస్ నశిస్తుందని కొందరు అంటున్నారు. కానీ ఈ వ్యాధి బాగా విస్తరించిన దేశాల్లో చలి వాతావరణం ఉన్న దేశాలతో పాటు ఉష్ణ దేశాలు కూడా వున్నాయి. ఏదీ నిర్ధారణ కానీ నేపధ్యంలో ఈ ఊహాగానాలు ప్రజల్లో భయ సందేహాలను మరింత పెంచుతాయి.  కాబట్టి చదువుకున్నవాళ్ళు తమకు తెలిసిన అరకొర జ్ఞానాన్ని నలుగురికీ పంచాలనే అతి ఉత్సాహాన్ని తగ్గించుకోవాలి.
తెలియని కొరానా గురించి తెలిసీ తెలియని మాటలు చెప్పేవారిని చూస్తుంటే, చిన్నప్పుడు చదువుకున్న  నలుగురు దృష్టి లేనివాళ్ళు, ఏనుగు కధ గుర్తుకురాక మానదు.        
        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి