(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా
అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో
ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్
యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త డిక్రీపై మరో రెండు
రోజుల్లో అంటే ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే
జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా
ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు.
అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ (మార్షల్ లా)
ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ
అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో
వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్
రష్యన్ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా
పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే
రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని
అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్
యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు
అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది
అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా
కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే
భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి గోర్భచేవ్ ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే
దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
గోర్భచేవ్ దంపతులు నల్ల సముద్ర తీరంలో
గృహ నిర్బంధంలో వున్నప్పుడు అనేక సందేహాలు చుట్టుముట్టాయి. వాళ్ళని బందీగా ఉంచారు
అన్నమాటే కానీ వాళ్ళ కదలికల మీద గట్టి కాపలా లేదు. ఇంట్లో ఫోను డిస్కనెక్టు చేశారు
కానీ బయట కారులో ఫోను తొలగించలేదు. గృహ నిర్బంధంలో వున్నప్పుడు గోర్భచేవ్
అనేకమందితో మాట్లాడినట్టు రుజువులు వున్నాయి.
1991 కుట్రపై సాధికార సమాచారం కలిగిన
అమెరికన్ చరిత్రకారుడు జాన్ డన్లప్ అబిప్రాయం ప్రకారం గోర్భచేవ్ రెండు రకాల
ఆలోచనల్లో వున్నారు. కుట్ర విజయవంతం అయితే మళ్ళీ తనకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అది విఫలం
అయితే తన పాత్ర అంతటితో ముగుస్తుంది.
అంచేత కుట్రకు బహిరంగంగా మద్దతు తెలపక పోయినా, అది విజయవంతం కావాలని ఆయన మనసులో కోరిక వుండేది. అయితే ఈ
అభిప్రాయాన్ని గోర్భచేవ్ తరువాతి రోజుల్లో ఖండించారు.
2006లో రష్యన్ టెలివిజన్ కి ఇచ్చిన
ఇంటర్వ్యూలో బోరిస్ ఎల్త్సిన్ చేసిన ఆరోపణ డన్లప్ అభిప్రాయానికి దగ్గరగా
వుంది.
“కుట్ర జరిగే సమయంలో అన్ని విషయాలు ఆయన
(గోర్భచేవ్) కు చెప్పారు.
“అయితే ఈ క్రీడలో నేనా? వాళ్ళా? (కుట్రదారులు) ఎవరు విజేతలు అవుతారు
అన్నది తెలిసేదాకా ఆయన బయటపడదలుచుకోలేదు” అనేది డన్లప్ కధనం.
అయితే గోర్భచేవ్ ఫౌండేషన్ ఈ ఆరోపణని తీవ్రంగా ఖండించింది. గోర్భచేవ్ పేరు
చెడగొట్టడానికి ఈ నిందారోపణలు చేస్తున్నారని, సోవియట్ యూనియన్ విచ్చిన్నంలో తన పాత్రను మరుగుపరచుకోవడానికి
ఎల్త్సిన్ ఈ పనికి పూనుకున్నారని ఫౌండేషన్ పేర్కొన్నది. నిజానిజాలు తేలకముందే ఆ
తర్వాత కొద్ది రోజులకే ఎల్త్సిన్ అనారోగ్యంతో మరణించారు. (ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి