26, డిసెంబర్ 2019, గురువారం

శిక్షలు లేని నేరాలు


ఘోరమైన తప్పులు చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.
కొంచెం అటూ ఇటూగా ముప్పయ్ ఆరేళ్ళ కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ కడుపుతో వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా.  ఇంటి మొత్తంలో చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని. ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను. పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, పిండి ఆరేయడం ఇలా అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టేఈ రకమైన క్షోభను అంతా పంటి బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆరోజు అలా గడిచిపోయింది. మొదటి పిల్లాడు పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?
పెళ్లి అనే ఒక బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?
వుండవు. నేనే సజీవ సాక్ష్యం.      

3 కామెంట్‌లు:

  1. అవి మూఢాచారాలు కావు. టీవి 9 లో హిందూ సంప్రదాయాలను ఆచారాలను హేళన చేయడం ఇప్పటికీ చేస్తున్నారు.రవి ప్రకాశ్ పోయినా ఇంకా పాత జబ్బులు పోలేదు. అతని శిష్యులు హైందవ సంస్కృతి ని అవహేళన చేస్తూనే ఉన్నాయి.

    ఇవాళ గ్రహణం గురించి ఐ స్మార్ట్ న్యూసే లో పిచ్చి స్కిట్ లు చూపించారు. ప్రతిరోజూ నారదుడి వేషంలో ఒకడి తో వెకిలి చేస్తున్నారు.

    ఎందుకు హిందువులంటే ఈ ద్వేషం.

    Hinduism is the only true tolerant catholic accommodative religion in the world.

    మీరు మీ తప్పు ఒప్పుకున్నా శిక్ష అనుభవించక తప్పదు. Law of karma is inexorable.

    రిప్లయితొలగించండి