“నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
“1938 జూన్ 16 నాడు మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభం అయినప్పుడు తొలి తెలుగు ప్రసంగం చేస్తూ సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు చెప్పిన తొలి పలుకులు ఇవి. రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేశారు. జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు కొంతకాలం ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు. మద్రాసు రేడియో స్టేషన్ నుంచి అదే మొదటి తెలుగు ప్రసంగం.
“రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’ వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి.
“ఆయన ఇలా చెప్పారు.
“యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశవాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక”
ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వం హెచ్చరిక రూపంలో నాయుడు గారు చేసిన మనవిని ఈనాటి ప్రసార సాధనాలవారు ఏమేరకు పాటిస్తున్నారన్నది సందేహమే.
“అంతకు ముందు అదే రోజు సాయంత్రం మద్రాసు రేడియో కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి) చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ, రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
“ప్రారంభోత్సవం రోజు సాయంత్రం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి, సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు.
“ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వమే మద్రాసు రేడియో కేంద్రం అనేక తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేసింది. రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వరరావు, ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డిగారు రాసిన ప్రసంగా వ్యాసాలను ఆకేంద్రం నుంచి ప్రసారం చేశారు.
“అదే కేంద్రం నుంచి తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన పున్నావజ్జల భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి, అక్బర్ పాత్రను డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం 1938 జూన్ 24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి ప్రసారం అయింది.
“జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు అసలు సిసలు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
“మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది.
“1939లో తిరుచినాపల్లి రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపిందని అనుకునేవారు.
“అంతకు ముందే హైదరాబాదులో, ఆ తరువాత మైసూరులో రేడియో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి మైసూరు రేడియో కేంద్రానికి సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. తిరువాన్కూర్ సంస్థానం 1937సెప్టెంబరు ఆఖరులో ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
డెక్కన్ రేడియో పూర్వాపరాలు :
“1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో
200 వాట్ల శక్తి కలిగిన చిన్న రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి నుంచి అది నిజాం నవాబు అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి.
“1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే కేంద్రాన్ని
సరూర్ నగర్ లో ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు
మొదలుపెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు. అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను
సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు.
రిలే స్టేషన్ మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. మల్లి పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి”
(సమాచార సేకరణలో అమూల్య సహకారం అందించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు
డాక్టర్ పీ ఎస్ గోపాలకృష్ణ గారికి నా కైమోడ్పులు)
(ఇంకావుంది)
రిప్లయితొలగించండిచాలా బాగా వ్రాసారు
AIR లో మూలిగే ఆర్కైవ్స్ కి కాలగతి పట్టి హాంఫట్ అయ్యే మునుపే పబ్లిక్ ఫోరంస్ గాని యూట్యూబ్ గాని NIC ద్వారాగాని ప్రచారం చేస్తే బాగుంటుంది. సలహా తీసుకుంటారా ?
ఏమో మా ఏ యై యారు యెప్పుడు నిదుర వీడునో !
జిలేబి